బంగారుతల్లి, అభయహస్తం లాంటి పథకాలను తపాల కార్యాలయాల ద్వారా లబ్ధిదారులకు అందించేందుకు యోచిస్తున్నామని తపాల శాఖ ఏపీ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ సుధాకర్ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. తపాల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలోని 14 జిల్లాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు చెల్లింపులు జరుపుతున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవలే 171 పౌరసేవలను అందించేందుకు మీ సేవను ప్రారంభించామన్నారు. దీనిని త్వరలో అన్ని తపాల కార్యాలయాలకు విస్తరిస్తామన్నారు. అదే స్ఫూర్తితో ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించే ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. తపాల శాఖ ద్వారా ఎన్నో నూతన పథకాలను ప్రవేశపెట్టామని, వాటి ద్వారా సంస్థకు మంచి ఆదాయం వస్తోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.