రైలు ఢీకొని తల్లీకూతుళ్ల మృతి
హైదరాబాద్ : పట్టాలు దాటుతున్న తల్లీకూతుళ్లను రైలు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బోరబండ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది.వివరాలిలా ఉన్నాయి.. జహీరాబాద్ పట్టణం ఆర్యానగర్‌కు చెందిన తల్లీకూతుళ్లు లింగమ్మ (55), తుల్జామ్మ (35)లు శుక్రవారం ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్ పర్వత్‌నగర్‌లో నివాసముంటున్న సత్తెమ్మ (లింగమ్మ చెల్లెలు) ఇంటికి వచ్చారు.
తిరిగి జహీరాబాద్ వెళ్లడానికి సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో శ్రీ వీవీ నగర్ సమీపంలో గల రైలు పట్టాల పక్కన నుంచి ముగ్గురు పిల్లలు, తల్లీకూతుళ్లు నడుచుకుంటూ వస్తున్నారు.
స్టేషన్ సమీపంలోకి రాగానే పట్టాలు దాటుతున్న లింగమ్మ, తుల్జామ్మలను గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో అక్కడిక్కడనే మృతిచెందారు. వారి వెనుకే వస్తున్న ముగ్గురు పిల్లలు కళ్లు మూసి తెరిచే లోపు అమ్మ, అమ్మమ్మలు రైలు ఢీకొని మృతి చెందారు. దీంతో వారు పరిగెత్తుకెళ్లి పర్వత్‌నగర్‌లో ఉన్న బంధువులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.
సమాచారం అందుకున్న పర్వత్‌నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మహ్మద్ జావెద్ షరీఫ్ బాబా విషయాన్ని రైల్వే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులకు ఫోన్‌లో విషయాన్ని చేరవేశారు. ఎమ్మెల్యే మాధవరం వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వచ్చి మృతుల బంధువులను పరామర్శించారు. ఆయన అక్కడి నుంచి రైల్వే అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే జీఎంను కలిసి ప్రమాదాలు జరగకుండా శాశ్వతమైన పరిష్కారం లభించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. మృత దేహాలను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.