Borabanda MMTS railway station
-
సెల్ఫీ పోజు.. అతనికేం కాలేదంట!
సాక్షి, హైదరాబాద్: వేగంగా వస్తున్న ఎంఎంటీఎస్ ముందు సెల్ఫీ వీడియో దిగడానికి ప్రయత్నించి.. గాయపడిన యువకుడి తాజా వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సెల్ఫీ వీడియో ఘటనలో అతను తీవ్రంగా గాయపడినట్టు మొదట కథనాలు వచ్చాయి. అయితే, ఈ ఘటనలో అతనికేం పెద్దగా గాయాలు కాలేదని, అతను బాగానే ఉన్నాడంటూ స్నేహితులు ఆటపట్టించేలా ఉన్న ఈ తాజా వీడియో హల్చల్ చేస్తోంది. వరంగల్ ఉర్సు కరీమాబాద్‌కి చెందిన కృష్ణమూర్తి కుమారుడు తోటం శివ(25) గత ఆదివారం బోరబండ ఎంఎంటీఎస్ స్టేషన్లో వేగంగా వస్తున్న రైలు ముందు సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. రైల్వే హోంగార్డ్ వారిస్తున్నా ఎడమ చేత్తో సెల్‌ఫోన్ పట్టుకున్న శివ కుడిచేత్తో రైలును చూపిస్తూ ఫోజు ఇచ్చాడు. ఇంతలో ఎంఎంటీఎస్ డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. వేగం తగ్గిన రైలు వచ్చి శివ కుడిచేతిని ఢీ కొట్టింది. దీంతో పట్టాల పక్కన పడిపోయిన శివ తలకు రాయి తగలడంతో గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. సోమవారం భరత్‌నగర్ ఆర్పీఎఫ్ పోలీసులు శివకు సెల్‌ఫోన్ అప్పగించి అతడిపై కేసు నమోదు చేశారు. కౌన్సెలింగ్ అనంతరం రైల్వే కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం విధించిన రూ.500 జరిమానా శివ చెల్లించాడు. ఈ సెల్ఫీ ‘సైట్’ను నాంపల్లి రైల్వే ఎస్పీ జి.అశోక్‌కుమార్, ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ ఘటన ఇలా ఉండగా శివ తాజా వీడియో హల్చల్ చేస్తోంది. ఇతనికేం కాలేదు.. తినితాగి మంచిగా ఉన్నాడంటూ స్నేహితులు ఆటపట్టించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను బట్టి శివకు పెద్దగా గాయాలు కాలేదని స్పష్టమవుతోంది. అయితే, ఇది వీడియోనేనా? లేక పాతదా? అన్నది నిర్దారణ కాలేదు. మొత్తానికి ఈ వీడియోతోపాటు శివ సెల్ఫీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
వేగంగా ట్రైన్ ఢీ కొట్టినా ఏం కాలేదంట!
-
రైలు ఢీకొని తల్లీకూతుళ్ల మృతి
హైదరాబాద్ : పట్టాలు దాటుతున్న తల్లీకూతుళ్లను రైలు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బోరబండ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది.వివరాలిలా ఉన్నాయి.. జహీరాబాద్ పట్టణం ఆర్యానగర్‌కు చెందిన తల్లీకూతుళ్లు లింగమ్మ (55), తుల్జామ్మ (35)లు శుక్రవారం ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్ పర్వత్‌నగర్‌లో నివాసముంటున్న సత్తెమ్మ (లింగమ్మ చెల్లెలు) ఇంటికి వచ్చారు. తిరిగి జహీరాబాద్ వెళ్లడానికి సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో శ్రీ వీవీ నగర్ సమీపంలో గల రైలు పట్టాల పక్కన నుంచి ముగ్గురు పిల్లలు, తల్లీకూతుళ్లు నడుచుకుంటూ వస్తున్నారు. స్టేషన్ సమీపంలోకి రాగానే పట్టాలు దాటుతున్న లింగమ్మ, తుల్జామ్మలను గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో అక్కడిక్కడనే మృతిచెందారు. వారి వెనుకే వస్తున్న ముగ్గురు పిల్లలు కళ్లు మూసి తెరిచే లోపు అమ్మ, అమ్మమ్మలు రైలు ఢీకొని మృతి చెందారు. దీంతో వారు పరిగెత్తుకెళ్లి పర్వత్‌నగర్‌లో ఉన్న బంధువులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. సమాచారం అందుకున్న పర్వత్‌నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మహ్మద్ జావెద్ షరీఫ్ బాబా విషయాన్ని రైల్వే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులకు ఫోన్లో విషయాన్ని చేరవేశారు. ఎమ్మెల్యే మాధవరం వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వచ్చి మృతుల బంధువులను పరామర్శించారు. ఆయన అక్కడి నుంచి రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే జీఎంను కలిసి ప్రమాదాలు జరగకుండా శాశ్వతమైన పరిష్కారం లభించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. మృత దేహాలను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.