డ్రగ్స్ కేసు: సినీ నిర్మాత అరెస్ట్!
హైదరాబాద్: రాజధానిలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ మాఫియా కేసులో గురువారం మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో సినీ నిర్మాత ఉన్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి 16 ఎల్ఎస్‌డీ డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న(బుధవారం) హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల నిర్వాహకుడు బెండెన్ బెన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టిన పోలీసులు గురువారం మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. బెండెన్ బెన్, నిఖిల్ షెట్టి కలిసి డ్రగ్స్ వ్యాపారం నడుపుతున్నట్లు ఇదివరకే పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్లయింది.
డ్రగ్స్ దందాలో ప్రధానంగా గోవా నుంచే హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా అయ్యాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ గోవా నుంచే డ్రగ్స్ తీసుకొచ్చి నిఖిల్‌షెట్టి, ఇతర పెడలర్లకు అందించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఓ సినీ నిర్మాతకు గోవాలోనే డ్రగ్స్ అందజేశారని.. కేసుకు ప్రధాన లింకు గోవాలోనే ఉండి ఉంటుందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలలో డ్రగ్స్ మాఫియా జరుగుతుందన్న వార్తలతో నగరంలోని ప్రముఖ పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు దీనిపై ఆందోళన చెందుతున్నాయి. ఏ క్షణంలో ఏ విషయం వినాల్సి వస్తుందేమోనన్న భయం యాజమాన్యాల్లో కనిపిస్తోంది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌ను కస్టడీలోకి తీసుకుని పూర్తి వివరాలు రాబట్టాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ భావిస్తోంది.
పలు స్కూళ్లు, కాలేజీలకు చెందిన విద్యార్థులు డ్రగ్స్ మత్తులో మునిగితేలుతుండటంతో తల్లిదండ్రులు, యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బుధవారం ఖండించిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్.. వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్న విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి కాలేజీలు, స్కూళ్ల పేర్లను ప్రకటించలేదని పోలీసులు చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీతో పాటు ఎంఎన్‌సీ కంపెనీలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.