ఎంపీ మేకపాటి ధీమా
⇒ వైఎస్ అడుగుజాడల్లో నడిస్తే ప్రజలు ఆదరిస్తారు
⇒ వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలి
⇒ ఘనంగా వైఎస్సార్‌సీసీ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిస్తే ప్రజలు తప్పనిసరిగా ఆదరిస్తారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి పోరాడితే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు చారిత్రక అవసరం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేనిపక్షంలో ఏపీలో ప్రజాస్వామ్యం మంట గలిసిపోతుంది’’ అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ వైపు నుంచి ఒక్క చిన్న పొరబాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైఎస్సార్‌సీపీని స్థాపించి ఆరేళ్లు పూర్తయి 7వ వసంతంలోకి అడుగుపెడు తున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ... ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
‘‘వాస్తవానికి 2014లోనే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాల్సి ఉండగా, కొన్ని స్వీయ పొరపాట్లకుతోడు చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయి టీడీపీకి ఓట్లేశారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని కచ్చితంగా ఆదరిస్తారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్రమోదీని వైఎస్సార్‌సీపీ తరపున అభినందిస్తున్నాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్థానాల్లో ఉండేవారు ప్రజాస్వామికంగా వ్యవహరించాలి. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నాం. వైఎస్సార్‌సీపీలో యువకులే ఎక్కువగా ఉన్నారు కనుక పార్టీకి మున్ముందు మంచి భవిష్యత్తు ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత యువతపై ఉంది’’ అని రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
జగన్ గొప్ప పోరాట యోధుడు
వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటును తీర్చేందుకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి ముందుకొచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప పోరాట యోధుడని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. జగన్ సారథ్యంలోని పార్టీలో ఉన్నందుకు అందరమూ గర్వపడుతున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరని పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి చెప్పారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో తొలుత వైఎస్సార్‌సీపీ జెండాను మేకపాటి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, కొండా రాఘవరెడ్డి, మతీన్, బోయినపల్లి శ్రీనివాస రావు, ఇతర నేతలు బి.గురునాథ్‌రెడ్డి, అమృతాసాగర్, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, డాక్టర్ ప్రపుల్లరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, డి.శ్రీధర్‌రెడ్డి, జి.మహేందర్‌రెడ్డి, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, విశ్వనాథాచారి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ సీఎం అయ్యేంత వరకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటామంటూ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా నేతలు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. మరోవైపు పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇరు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
2019లో గెలుపు మనదే
Published Mon, Mar 13 2017 2:30 AM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM
Advertisement
Advertisement