ఏసీబీ వలలో తహశీల్దార్
ఏసీబీ వలలో తహశీల్దార్
Published Fri, Dec 11 2015 3:44 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
లంచం డబ్బుల కలెక్షన్ కోసం
సోదరుడిని పంపిన అంబర్‌పేట తహశీల్దార్
రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన వైనం
అంబర్‌పేట: విధుల్లో చేరిన కొద్దిరోజులకే అవినీతికి తెరలేపి..అడ్డంగా దొరికిపోయారు అంబర్‌పేట తహశీల్దార్ సంధ్యారాణి, అవినీతి ఆరోపణలతో ఆ స్థానం నుంచి బదిలీ అయిన తహశీల్దార్ స్థానంలో కొత్తగా వచ్చిన సంధ్యారాణి సైతం అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్ కథనం ప్రకారం...అంబర్‌పేట తహసీల్దార్ ఎస్.సంధ్యారాణి రెండు నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆమె మలక్‌పేట అక్బర్‌పుర ప్రాంతంలో మహ్మద్ అతర్ అహ్మద్ అనే వ్యక్తి నిర్మిస్తున్న అపార్టుమెంట్‌ను తనిఖీ చేశారు.
ఆ స్థలం ప్రభుత్వానిదని, దానికి సంబంధించిన పత్రాలు తీసుకుని తనను కలవాలని ఆమె అతర్ అహ్మద్‌ను ఆదేశించారు. దీంతో అతర్ తాను 1974లో కొనుగోలు చేసిన 525 గజాల స్థలానికి చెందిన పత్రాలను, జీహెచ్‌ఎంసీ జారీ చేసిన అనుమతి పత్రాలను తీసుకుని సంధ్యారాణిని కార్యాలయంలో కలిశారు. వాటిని పరిశీలించిన తర్వాత ఆ స్థలం ప్రభుత్వానిదేనని, వెంటనే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. రూ. 10 లక్షలు ఇస్తే నోటీసులు ఇవ్వకుండా చూస్తామని చెప్పారు. దీంతో బాధితుడు చేసేదేమీలేక రూ.7 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
దీంతో తహసీల్దార్‌పై నిఘా వేసిన ఏసీబీ అధికారులు, గురువారం బాధితునికి రంగు పూసిన రూ. 4 లక్షలను అందించి ఆమెకు ఇవాల్సిందిగా సూచించారు. ఈమేరకు మహ్మద్ అతర్ అహ్మద్‌రూ.4 లక్షలను తీసుకొని తహశీల్దార్ సంధ్యారాణికి ఫోన్ చేయగా...అబిడ్స్‌కు రావాలని సూచించారు. అబిడ్స్‌కు వెళ్లి తిరిగి ఫోన్ చేయగా డబ్బులను పంజగుట్టలో ఉన్న తన సోదరుడు వెంకటనాగేశ్వర్‌రావుకు ముట్టజెప్పాల్సిందిగా ఆమె తెలిపారు. దీంతో అతర్ అహ్మద్ పంజగుట్ట ప్రాంతానికి వెళ్లి వెంకట నాగేశ్వర్‌రావుకు ఫోన్ చేయగా అతను వచ్చి రూ.4 లక్షలను తీసుకున్నాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు వెంకటనాగేశ్వర్‌రావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తహశీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. అనంతరం తహసీల్దార్‌ను కూడా అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించారు.
అయితే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఏక కాలంలో అంబర్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయం, మల్కాజిగిరిలోని ఆమె నివాసం వద్ద కూడా సోదాలు చేస్తున్నట్లు అధికారులు విలేకరులకు తెలిపారు.
ఇంటికి తాళం
గౌతంనగర్: అంబర్‌పేట తహశీల్దార్ సంధ్యారాణి నివాసంపై గురువారం ఏసీబీ అధికారులు దాడికి ప్రయత్నించారు. మల్కాజిగిరి కృపాకాంప్లెక్స్‌లోని శ్రీకృష్ణనగర్ కాలనీలో ఉంటున్న ఆమె నివాసానికి గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడానికి వచ్చారు. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉండడంతో గంటపాటు వేచి చూసి అధికారులు వెనుదిరిగారు.
Advertisement
Advertisement