మూసీ పొడవునా స్కైవే!
హైదరాబాద్: స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా సిగ్నల్ రహిత, సాఫీ ప్రయాణానికి హైదరాబాద్‌లోని మూసీ పొడవునా ఈస్ట్ వెస్ట్ కారిడార్ (ఓఆర్‌ఆర్ ఈస్ట్- ఓఆర్‌ఆర్ వెస్ట్) స్కైవే (ఆకాశమార్గం) నిర్మాణానికి కన్సల్టెన్సీ సర్వీసుల కోసం జీహెచ్‌ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. దాదాపు 41 కి.మీ.ల మేర పొడవైన స్కైవే నిర్మాణానికి అధ్యయన నివేదికను అందజేయాల్సిందిగా కోరింది. స్కైవేకు సంబంధించి రోడ్డు సైనేజీలు, పేవ్‌మెంట్ మార్కింగ్‌లు, రైలింగ్‌లు, సేఫ్టీ బారియర్లు తదితరమైన వాటిని కూడా నివేదికలో పొందుపరచాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 20 వేల కోట్లతో నగరంలో రాచమార్గాలను నిర్మించనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. అందులో భాగంగా ఈ స్కైవే పనులకు కన్సల్టెన్సీ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. నెలరోజుల్లో నివేదిక అందజేయాల్సిందిగా పేర్కొన్నారు. టెండర్లకు సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం ఈనెల 27న జరగనుండగా, టెండరు దాఖలుకు జూన్ 6 చివరి తేదీగా పేర్కొన్నారు.