వక్ఫ్ భూముల కబ్జాపై విచారణ జరపండి: అక్బరుద్దీన్ ఒవైసీ
* ప్రభుత్వానికి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వినతి
* కబ్జాదారులెవరో తేల్చండి
* సభలో శ్వేతపత్రం పెట్టండి
* మూసీ నదిని శుద్ధి చేయండి
* మైనారిటీలకు గృహాలు నిర్మించండి
సాక్షి, హైదరాబాద్: ఆక్రమణకు గురైన వేలాది ఎకరాల వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మైనారిటీ సంస్థలు, వక్ఫ్ ఆస్తులు ఎవరి కబ్జాలో ఉన్నాయో సీబీసీఐడీతో విచారణ జరిపించాలని కోరారు. వక్ఫ్ ఆస్తులపై శ్వేత పత్రం సమర్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూముల్లో 76 శాతం ఆక్రమణలోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయదుర్గం భూములు మొదలు బహుళ జాతి కంపెనీలకు ధారాదత్తం చేసిన భూములన్నీ వక్ఫ్‌కు చెందినవేనని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో భూసంస్కరణల పేరుతో జమీందార్లు, భూస్వాముల నుంచి వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వాలు వాటిని బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టాయని... ముస్లిం నిరుపేదలకు ఒక్క ఎకరం భూమిని కూడా కేటాయించలేదని అన్నారు.
హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూనే.. మూసీ నదిని కూడా శుద్ధి చేయాలని కోరారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రపంచంలోనే ఎత్తై భవనాలు నిర్మిస్తామంటున్న ప్రభుత్వం.. హైదరాబాద్‌లో నిరుపేదలు తల దాచుకునేందుకు రెండు గదుల ఇళ్ల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. మైనారిటీ విద్యార్థుల ఉపకార వేతనాల బకాయిలకు సరిపడే నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయించలేదని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఒక మైనారిటీ సభ్యుడిని నియమించాలని కోరారు. తొమ్మిది జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా పరిగణిస్తుంటే ఖమ్మం జిల్లాను ఎందుకు మినహాయించారని ప్రభుత్వాన్ని నిల దీశారు. మైనారిటీ సంక్షేమశాఖ, మైనారిటీ కమిషన్, వక్ఫ్ బోర్డుల విభజన ఇంకా జరగలేదని.. ఎప్పుడు జరుగుతుందో చెప్పాలని కోరారు.
వక్ఫ్ భూములు కాపాడుతాం: మహమూద్
వక్ఫ్ ఆస్తులు.. ఆక్రమణలో ఉన్న వక్ఫ్ భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని ఉపముఖ్యమంత్రి మ హమూద్ అలీ ప్రకటించారు. అక్బరుద్దీన్ ప్రసంగానికి సమాధానంగా ఆయన మాట్లాడుతూ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల బకాయి లు త్వరలోనే చెల్లిస్తామన్నారు. కాగా, అక్బర్ ప్రసంగం మధ్యలో స్పందించిన ఆర్థికశాఖ మంత్రి ఈటెల మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో మైనారిటీలను ఎన్నికల కోణంలోనే చూశారని, తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. సీమాంధ్ర పాలకులకు ముస్లింల సంక్షేమం కనిపించలేదని, నిజాం నవాబు కూడబెట్టిన లక్షలాది ఎకరాల భూములు మాత్రమే కనిపించాయని అన్నారు. మైనారిటీ విభాగానికి రూ.1038 కోట్లు కేటాయించామని తెలిపారు.