
చెరువులను కాపాడుకోవాలి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున చెరువుల రక్షణకు చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి శాఖ ఇంజనీర్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. జేఈ నుంచి సీఈ వరకు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో వరదల సమయంలో చెరువులను కాపాడుకోవాలని సూచించారు. లేకుంటే మిషన్ కాకతీయలో నాణ్యత లేని పనులు జరిగాయని దుష్ర్ప చారం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘట నలు జరిగినా క్షమించేది లేదని మంత్రి హెచ్చరించారు. మిషన్ కాకతీయ కింద చేపట్టిన తొలి దశ చెరువుల పునరుద్ధరణ పనులను జూన్ చివరికల్లా పూర్తి చేయాలన్నారు. చెరువుల తూములు తెరచి ఉంచినట్లు సమాచారం అందితే చర్యలు తప్పవన్నారు.
పనిచేసే చోట ఉండని ఇంజనీర్లకు హెచ్‌ఆర్‌ఏలో కోత
పనిచేసే చోట నివాసముండని ఇంజనీర్లకు ఒక నెల ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)లో కోత పెట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం ఆదేశించారు. ఇప్పటికే ఈ విషయమై పలుమార్లు హెచ్చరించినా ఖాతరు చేయడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్‌ఈ హైదరాబాద్‌లోనే ఉంటున్నారని మంత్రి తెలిపారు. ఇంకా పలువురు ఇంజనీర్లు, కింది స్థాయి సిబ్బంది తాము విధులు నిర్వహించే చోట నివాసం ఉండని వారి జాబితాను మంత్రి చదివి వినిపిం చారు. మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో పలువురు ఇంజనీర్లు, సిబ్బంది ఇతర ప్రాంతాలు, జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ నుంచి రాకపోకలు చేస్తున్నారన్నారు. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.