పోలీసుల అదుపులో ‘ముత్తూట్’ దొంగలు!
♦ వాడీ నుంచి ముంబై వెళుతుండగా ఇద్దరిని పట్టుకున్నట్టు సమాచారం
♦ సర్దార్‌జీతో పాటు మరో ముగ్గురి కోసం ముంబైలో ప్రత్యేక బృందాల గాలింపు
♦ నాలుగుసార్లు రెక్కీ, ఐదోసారి దోపిడీ చేసినట్టుగా నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ దోపిడీ కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. సర్దార్‌జీతోపాటు మరో ముగ్గురి వద్ద భారీ మొత్తంలో బంగారం ఉండటంతో వారి ప్రతి కదలికపై పోలీసులు ప్రత్యేక నిఘాను ఉంచినట్టు సమాచారం. సర్దార్ జీ వేషధారణలో ఉన్న ప్రధాన నిందితుడు, మిగత వారు పాత నేరస్తులు కావడంతో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ముంబైలో గాలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే కర్ణాటకలోని వాడీలోని వారి స్థావరాల్లో ముత్తూట్‌లో దోపిడీకి ఉపయోగించిన స్కార్పియో, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
‘వాడీ’ కేంద్రంగానే దోపిడీకి స్కెచ్..
డిసెంబర్ 23 నుంచి 25 వరకు ఆరుగురు నిందితుల కదలికలను తెలుసుకునేందుకు 35 సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దోపిడీ తర్వాత రాష్ట్ర సరిహద్దులు దాటేలోపు బైక్, స్కార్పియోలు రెండు సార్లు కలుసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఏ మార్గంలో వెళితే బాగుంటుందని రెక్కీ చేసుకుని దోపిడీ తర్వాత అదే మార్గంలో వాడీ వెళ్లినట్టుగా గుర్తించారు. ఈ ఆరుగురు అంతర్రాష్ట్ర నేరగాళ్లే అని, జైలులోనే కలసి ఈ దోపిడీకి స్కెచ్ వేసి ఉంటారని సీపీ సందీప్ శాండిల్యా అనుమానం వ్యక్తం చేశారు. దోపిడీ చేయడానికి ముందు మహారాష్ట్ర(ఎంహెచ్) రిజిస్ట్రేషన్‌తో కూడిన నంబర్ ప్లేట్‌ను స్కార్పియోకు వినియోగించారు. పరిగి బస్టాండ్‌లో బైక్‌ను పార్క్ చేసిన సమయం లో కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో కూడిన నంబర్ ప్లేట్‌ను వాడారు. నేరం జరిగే రోజుకు ఘటనాస్థలికి 5 కిలోమీటర్ల ముందు తమ బండి నంబర్ ప్లేట్‌ను ఏపీకి మార్చారు.
రెక్కీ తీరు ఇలా..
డిసెంబర్ 14: ఏపీ23ఎం3107 నంబర్ గల స్కార్పియో బీరంగూడలో చక్కర్లు
డిసెంబర్ 23: ఉదయం 5 గంటలకు వాడీ నుంచి స్కార్పియోలో సర్దార్‌జీ గ్యాంగ్ ప్రయాణం. ఉదయం 9 గంటలకు బీరంగూడ ముత్తూట్ కార్యాలయానికి చేరిక. ఇద్దరు వ్యక్తులు లోనికి వెళ్లి బంగారంపై ఎంత రుణం ఇస్తారని ఆరా. రాత్రి బీరంగూడకు సమీపంలోని ఓ దాబాలో ఆశ్రయం
డిసెంబర్ 24: మళ్లీ ఉదయం 9 గంటలకు బీరంగూడ ముత్తూట్ కార్యాలయానికి చేరిక. మరో ఇద్దరు వ్యక్తులు వెళ్లి బంగారంపై రుణం ఆరా. సిబ్బంది ఎంత మందనే దానిపై దృష్టి. ద్విచక్ర వాహనాన్ని పరిగి బస్టాండ్‌లో పార్క్ చేసి స్కార్పియోలో వాడీకి ప్రయాణం
డిసెంబర్ 26: బీరంగూడ నుంచి దోపిడీ చేశాక పోలీసుల కంట పడకండా ఏయే మార్గాల్లో తప్పించుకోవచ్చనే దానిపై చక్కర్లు. బైక్ మళ్లీ పరిగి బస్టాండ్‌లోనే పార్కింగ్. వాడీకి ప్రయాణం
దోపిడీ అమలు చేసిందిలా..
డిసెంబర్ 27: ఉదయం 5 గంటలకు వాడీ నుంచి స్కార్పియోలో ఆరుగురి రాక. పరిగి బస్టాండ్‌కు చేరుకున్నాక ఇద్దరు దిగి బైక్‌ను తీసుకుని పైలట్‌గా స్కార్పియో ముందు బయలుదేరారు. సైబరాబాద్ కమిషనరేట్ సరిహద్దులోకి ప్రవేశించే సమయంలో పెట్రోలింగ్ వాహనాన్ని చూసి దోపిడీ ప్లాన్ విరమణ. బీరంగూడకు పది కిలోమీటర్ల దూరంలోని దాబాలో రాత్రి బస చేశారు.
డిసెంబర్ 28: ఉదయం 8 గంటలకు బైక్‌పై ఇద్దరు వ్యక్తులు బీరంగూడ వరకు చక్కర్లు. ఆ తర్వాత స్కార్పియోలో ముత్తూట్ కార్యాలయానికి చేరుకుని 9 నుంచి 9.30 గంట మధ్యలో 46 తులాల బంగారం దోపిడీ. 9.30 నుంచి 9.40 వరకు దోపిడీ జరిగిన ప్రాంతం నుంచి 2 కిలోమీటర్ల వరకు స్కార్పియో ముందు బైక్ పైలటింగ్. వాడీలోని స్థావరంలో వాహనాలు వదిలేసి రైలులో ముంబైకి పరారీ. ఈ క్రమంలోనే ఇద్దరి అరెస్ట్.