
నాకు ప్రాణ హాని ఉంది: మత్తయ్య
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు జెరూసలేం మత్తయ్య.. ప్రతివాదుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కదలికలపై ప్రత్యర్థుల రెక్కీ నిర్వహించారని, ఏ క్షణంలోనైనా దాడి జరుపవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి వద్ద పోలీసు రక్షణ కల్పించి ప్రాణాలను కాపాడాలని వేడుకున్నారు.
సామాజిక సేవ చేస్తూ జీవించే తాను ఉప్పల్ టెంపుల్ రోడ్డులో నివాసం ఉంటున్నానని, ఓటుకు నోటు కేసులో ఏ4 ముద్దాయిగా కేసు నమోదైనప్పటి నుంచి బంధువుల ఇండ్లలో తలదాచుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు నా స్వంత ఇంటికి చేరుకోవాలంటే భయం వేస్తోందని, కొందరు చంపాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటి భయంతో న్యాయ స్థానాల్లో జరిగే విచారణలకు హాజరు కాలేకపోతున్నానని, కావున తన ఇంటికి, తనకు రక్షణ కల్పించాలని కోరారు.