శిరీష కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనతో తెరపైకి వచ్చిన బ్యూటీషియన్ అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష మృతిపై సందేహాలు పటాపంచలయ్యాయి. ఎట్టకేలకు శిరీష మృతి కేసును పోలీసులు ఛేదించారు. తొలుత ఆత్మహత్యగా.. అనంతరం అనుమానాస్పద మృతిగా మారిన ఈ కేసుపై వివరాలు మరి కొద్ది గంటల్లో వెల్లడికానున్నాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 2గంటలకు సీపీ మహేందర్ రెడ్డి వెల్లడించనున్నారు.
నిందితులను కూడా మీడియా ముందు ఉంచనున్నారు. గత మూడు రోజులుగా ఈ కేసు తీవ్ర ఉత్కంఠను రేపిన విషయం తెలిసిందే. మరోవైపు ఎస్సై ప్రభాకర్ రెడ్డి మృతిపై కూడా హత్యనా లేక ఆత్మహత్యనా అనే కేసును విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఆర్‌జే ఫొటోగ్రఫీ స్టూడియోలో శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి వరకు చేపట్టిన దర్యాప్తులో ఆమెది ఆత్మహత్య అన్న దిశగా పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించగా.. పోస్టుమార్టంలో మాత్రం ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు వెల్లడైంది.
దీంతో ఆమెది హత్య అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై సందేహాలు నివృత్తి చేసుకోవడానికి రాజీవ్, శ్రవణ్‌లను గురువారం రాత్రి ఘటనాస్థలానికి తీసుకెళ్లి విచారించారు. సేకరించిన ఆధారాలు, విచారణలో తేలిన అంశాలు, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ముగింపునకు వచ్చిన పోలీసులు మరికొద్ది గంటల్లో వివరాలు తెలపనున్నారు.