న్యాక్‌తో అమెరికా సంస్థ జోడీ
- సివిల్ ఇంజనీరింగ్‌లో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ శిక్షణ ఇవ్వనున్న పీఎంఐ
- న్యాక్‌లో నిర్వహణ.. పీఎంఐ సంస్థ పేరిట సర్టిఫికెట్లు
- ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగావకాశం
- త్వరలో అవగాహన ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్) సంస్థ అమెరికాకు చెందిన ‘ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్(పీఎంఐ)’తో కలసి పనిచేయనుంది. భవన నిర్మాణానికి సంబంధించిన శిక్షణ, ఇంజనీర్లకు నైపుణ్యాభివృద్ధి తర్ఫీదు అందిస్తున్న న్యాక్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. అటు పీఎంఐ సంస్థ ఇచ్చే శిక్షణకు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. తాజాగా ఈ రెండు సంస్థలు సంయుక్తంగా సివిల్ ఇంజనీరింగ్‌లో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాయి. దీనిపై త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే న్యాక్ ఆధ్వర్యంలో ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన సమావేశంలో పీఎంఐ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు.
న్యాక్‌లో శిక్షణ.. పీఎంఐ పేరుతో సర్టిఫికెట్
ప్రపంచవ్యాప్తంగా సివిల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. పెద్ద పెద్ద సంస్థలు చేపట్టే భారీ ప్రాజెక్టుల్లో సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ ఏర్పడింది. పేరున్న సంస్థల్లో ప్రత్యేక శిక్షణ పొందినవారికి కాంట్రాక్టు సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చేందుకు పీఎంఐతో కలసి పనిచేయాలని న్యాక్ నిర్ణయించింది. దీనిపై ఇటీవల న్యాక్ ప్రతినిధులు పీఎంఐతో సంప్రదించగా.. ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. శిక్షణ తీరు, ఇతర అంశాలను నిర్ధారిం చాక అవగాహన ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదించింది.
ఈ మేరకు శిక్షణ ఉండాల్సిన తీరును సిద్ధం చేసేందుకు న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీల ప్రతినిధులు, ప్రఖ్యాత ఇంజనీరింగ్ నిపుణులు అందులో సభ్యులుగా ఉన్నారు. ఇక శిక్షణ కోసం న్యాక్‌లో ఉన్న మౌలిక వసతులను పరిశీలించేందుకు పీఎంఐ ఇండియా విభాగం హెడ్ రాజ్ కల్లారీ త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఆ తర్వాత రెండు సంస్థల మధ్య ఎంవోయూ ఉంటుంది. న్యాక్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులు అనంతరం ఆన్‌లైన్ ద్వారా పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైనవారికి పీఎంఐ పేరుతో సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ శిక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి అభ్యర్థులు న్యాక్‌కు వచ్చే అవకాశముంది.