National Academy of Construction
-
స్థిరమైన భవిష్యత్ కోసం.. ఎన్ఏసీ, పీఎస్ఐ ఒప్పందం
మహీంద్రా యూనివర్సిటీ.. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC), ప్రీ-ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PSI)తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. నిర్మాణ రంగంలో స్థిరమైన భవిష్యత్తు కోసం జులై 19న యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ అవగాహన ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను మహీంద్రా యూనివర్సిటీ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది.ఎన్ఏసీ, పీఎస్ఐ మధ్య జరిగిన ఒప్పంద కార్యక్రమంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ జనరల్ మధుసూధన రెడ్డి, వీసీ డాక్టర్ యాజులు మేడూరి మొదలైనవారు పాల్గొన్నారు.భారతదేశంలో కన్స్ట్రక్షన్ & ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ స్థాయిని సాధించడానికి ఈ ఎమ్ఒయు కీలకమైన దశను సూచిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని అభివృద్ధి చేయడానికి మేము కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మహీంద్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజులు మేడూరి అన్నారు.నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) డైరెక్టర్ జనరల్ పీ మధుసూధన రెడ్డి మాట్లాడుతూ.. మహీంద్రా యూనివర్సిటీ, ప్రీ-ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన ఒప్పందం నిర్మాణంలో స్థిరమైన భవిష్యత్తును సూచిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా కొత్త ఆవిష్కరణలకు, అభివృద్ధి చెందుతున్న వాటికి అనుగుణంగా ప్రభావవంతమైన పరిష్కారాలు సాధ్యమవుతాయని అన్నారు.We are pleased to announce a significant collaborative effort with the National Academy of Construction (NAC) & the Pre-Engineered Structures Society of India (PSI). The tripartite #MoU signifies a shared commitment to fostering a sustainable future for the construction sector. pic.twitter.com/q9q9p80zhg— Mahindra University (@MahindraUni) July 23, 2024 -
ప్రభుత్వాల చెలగాటం...‘న్యాక్’కు నిధుల సంకటం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక పరమైన అంశాల్లో నెలకొన్న వివాదాలు ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌కు అడ్డంకిగా మారాయి. ఈ వివాదం వల్ల న్యాక్‌కు నిధులు రావటం నిలిచిపోవటంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహణ ఇబ్బందిలో పడింది. ఏడాదిగా నిధుల కోసం నానాతిప్పలు పడుతున్న నాక్ యంత్రాంగం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద బడా సంస్థల వద్దకు వెళ్లి నిధులు సమీకరించుకుని కార్యక్రమాలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు కార్పొరేట్ సంస్థలతో పాటు, నాబార్డ్ చేసిన ఆర్థిక సాయంతో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మరిన్ని సంస్థలు ముందుకొచ్చి సాయం చేస్తే, కొత్త బ్యాచ్‌లను ఏర్పాటు చేసి మరిన్ని బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వాలని యత్నిస్తున్నారు. గతంలో విదేశీ యువతకు కూడా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయంగానూ ఖ్యాతి పొందిన న్యాక్‌కు.. ప్రభుత్వ విభాగాలు ఆర్థిక క్రమశిక్షణ తప్పటంతో నిధుల కోసం రోడ్డున పడాల్సిన దుస్థితి దాపురించింది. నిధుల వ్యయంపై అభిప్రాయభేదాలు.. న్యాక్ కోర్సులకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇస్తోంది. ఇది 70:30 దామాషాగా విడుదలవుతున్నాయి. తాను ఇస్తున్న నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సరి్టఫికెట్లు సరిగా దాఖలు కావటం లేదని, కొన్ని నిధులు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని కేంద్రం సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయి. అవి రానురాను పెద్దవి కావటంతో ఏడాది క్రితం కేంద్రం నిధుల విడుదలను ఆపేసినట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా నిలిచిపోయి, న్యాక్‌కు నిధుల సమస్య ఉత్పన్నమైంది. మూడు నెలల కోర్సులను బ్యాచ్‌ల వారీగా నిర్వహిస్తున్న న్యాక్ వద్ద పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పోగయ్యాయి. ఈ తరుణంలో చేతిలో నిధులు లేకుండా పోయాయి. దీంతో న్యాక్ ఉన్నతాధికారులు కార్పొరేట్ కంపెనీలను సంప్రదించటం ప్రారంభించారు. అలా తొలుత తాన్లా ప్లాట్‌ఫామ్స్, జీఐపీఎల్ సంస్థలు 350 మంది శిక్షణకు కావాల్సిన నిధులు అందించాయి. ఒక్కో అభ్యర్థికి రూ. లక్ష వరకు ఫీజు ఉండే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లాంటి పీజీ కోర్సులు కూడా వాటితో నిర్వహిస్తుండటం విశేషం. ఇక మరో 200 మంది అభ్యర్థులతో కూడిన బ్యాచ్‌ల శిక్షణకు కావాల్సిన నిధులను నాబార్డు సమకూర్చింది. వీటితో ఇప్పటి వరకు శిక్షణ నిర్వహిస్తున్నారు. మరిన్ని సంస్థలు ముందుకొస్తే విస్తరిస్తాం... ‘‘సీఎస్ఆర్ నిధులతో శిక్షణ కార్యక్రమాలు విస్తరించాలని నిర్ణయించాం. ఇప్పటికి తాన్లా ప్లాట్‌ఫామ్స్, జీఐపీఎల్, నాబార్డు నిధులు అందించాయి. ఈ డిసెంబరులో కేంద్ర ప్రభుత్వ నిధులు కొన్ని రాబోతున్నాయి. వాటికి అదనంగా సీఎస్ఆర్ కింద కార్పొరేట్ కంపెనీలు సాయం అందిస్తే న్యాక్ మరింత ఉన్నతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది’అని న్యాక్ డీజీ బిక్షపతి పేర్కొన్నారు. పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి న్యాక్ శిక్షణార్థులను ఎంపిక చేసుకుంటున్నందున కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని న్యాక్ ప్లేస్మెంట్ డైరక్టర్ శాంతిశ్రీ కోరారు. ఇదీ పరిస్థితి.. ఉన్నత విద్య చదువుకోలేని పరిస్థితిలో చదువు మానేసిన ఎంతోమంది యువతీయువకులకు భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో న్యాక్ శిక్షణ ఇస్తోంది. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఫాల్స్ సీలింగ్, భవన నిర్మాణ సూపర్వైజింగ్, వెల్డింగ్, కన్స్ట్రక్షన్ సర్వే అంశాల్లో తర్పి దు పొందుతున్న అభ్యర్థులకు దేశవిదేశాల్లోని నిర్మాణ సంస్థల్లో ఉపాధి దొరుకుతోంది. గతంలో కేవలం భవన నిర్మాణంలోని వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చిన న్యాక్.. ఆ తర్వాత పీజీ కోర్సులను కూడా ప్రారంభించింది. బీటెక్ సివిల్ అభ్యర్థులు, ఇంజినీర్లకు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు నిర్వహిస్తోంది. ఇలాంటి తరుణంలో నిధుల సమస్య ఉత్పన్నమై న్యాక్‌ను గందరగోళంలో పడేసింది. -
న్యాకు వద్దు!
స్మార్ట్ ఫోన్.. ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చింది.ఎన్నో ఉపయోగాలను మోసుకొచ్చింది.కానీ ఇప్పుడు అనర్థాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.యువత దానికి బానిసై అందమైన భవిష్యత్తును అంధకారంగా చేసుకుంటోంది. తాజాగా ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)’పరిశీలనలోనూ ఇదే తేలింది. భవన నిర్మాణ రంగానికి అవసరమైన అన్ని రకాల విభాగాల్లో అద్భుత శిక్షణ ఇచ్చే సంస్థగా న్యాక్‌కు పేరుంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద నిర్మాణ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. భూటాన్, నేపాల్‌లాంటి చిన్న దేశాలు న్యాక్‌తో ఒప్పందం చేసుకుంటుండగా, మధ్య ఆసియా దేశాలు అది ఇచ్చే సర్టిఫికెట్లకు ఎంతో ప్రాధాన్యమిస్తూ, అందులో శిక్షణ పొందిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. కానీ ఇక్కడి యువత మాత్రం దానిపై అంతగా దృష్టి సారించట్లేదు. పదో తరగతి, అంతకంటే తక్కువ స్థాయిలోనే చదువు మానేసిన వారు గతంలో వృత్తి విద్యల్లో శిక్షణకు ఎంతో ఆసక్తి చూపే వారు. కానీ గత నాలుగైదేళ్లుగా యువత ఆలోచనలో మార్పు వచ్చింది. ఫోన్ ప్రపంచంలో మునిగితేలుతున్న వారు న్యాక్ అంటే బాబోయ్ అంటున్నారు. ప్రపంచం న్యాక్ వైపు చూస్తుంటే, స్థానిక యువత వద్దనుకుంటోంది. మన పురోగతికి గొడ్డలిపెట్టుగా మారిన సామాజిక సమస్యలో ఇది మరో కోణం అని చెప్పుకోవచ్చు. – సాక్షి, హైదరాబాద్ కష్టపడటమా..? ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం భవన నిర్మాణ రంగం ఉజ్వలంగా ఉంది. భవన నిర్మాణంలో భాగమైన ప్లంబింగ్, కార్పెంటరీ, వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, సీలింగ్, వైరింగ్, సైట్ ల్యాండ్ సర్వే, సైట్ సూపర్వైజింగ్, పెయింటింగ్.. ఇలాంటి విభాగాల్లో ఉపాధికి విస్తృత అవకాశాలున్నాయి. కానీ ఇవన్నీ శ్రమతో కూడుకున్న పనులు. స్మార్ట్‌ఫోన్‌లో ముగిని తేలుతున్నవారు శ్రమతో కూడుకున్న పనులంటే దూరంగా ఉంటున్నారని తేలింది. ఆ పనుల్లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాల్సి రావటం, పని చేస్తూ ఫోన్ వినియోగం సాధ్యం కాకపోవటం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విశేషాలను చూస్తూ ‘నేనేంటి కష్టపడే పని చేయటమేంటి’అనే భావనకు రావడం తదితర కారణాలతో ఇలాంటి ఉద్యోగాలకు యువత దూరమవుతోందని న్యాక్ తాజాగా గుర్తించింది. స్పందన కరువు.. న్యాక్‌కు భవన నిర్మాణ రంగంలోని వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చే టాప్ సంస్థగా పేరుంది. 1998లో ప్రారంభమైన న్యాక్.. యువత నుంచి ఆదరణ పెరుగుతుండటంతో తన శాఖల సంఖ్య పెంచుకోవాలని నిర్ణయించింది. తొలుత మాదాపూర్‌లో ప్రధాన కేంద్రం ఉండేది. ఇక్కడ రెసిడెన్షియల్ శిక్షణ కేంద్రం అందుబాటులో ఉంది. శిక్షణ కోసం దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండటంతో జగిత్యాలలో రెండో రెసిడెన్షియల్ కేంద్రాన్ని, పాతజిల్లా కేంద్రాల్లో సాధారణ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. రెసిడెన్షియల్‌కు కేంద్రాలకు సంబంధించి రెండు చోట్లా కలిపి శిక్షణ కాలానికి 600 మందిని ఎంపిక చేసుకునే వీలుంది. గతంలో అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చేవి. కానీ ప్రస్తుతం అతి కష్టమ్మీద 400 మంది వరకే చేరుతున్నారు. - రాష్ట్రవ్యాప్తంగా డీఆర్డీఏలాంటి సంస్థలు చిరుద్యోగాలకు సంబంధించి జాబ్ మేళాలు నిర్వహిస్తుంటాయి. వీటిల్లో న్యాక్ కూడా పాల్గొంటోంది. కానీ అక్కడికి వచ్చే యువత న్యాక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు. కేటరింగ్ సంస్థలు, రిటేల్స్, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రుల్లో బాయ్స్ వంటి ఉద్యోగాలకే మొగ్గు చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో న్యాక్‌కు ఐదారుకు మించి రిజిస్ట్రేషన్స్ రావటం లేదు. - శిక్షణ లేకుండా వ్యక్తుల వద్ద పని నేర్చుకుని భవన నిర్మాణ రంగంలో ఉద్యోగం కోసం గల్ఫ్‌కు వెళ్లే తెలంగాణ యువతకు అక్కడ చుక్కెదురవుతోంది. శిక్షణ సర్టిఫికెట్లు లేవన్న కారణంతో అసలు పని కాకుండా కూలీ పని ఇస్తున్నారు. చివరకు అది వెట్టిచాకిరీకి దారి తీస్తోంది. - మాల్స్, దుకాణాలు, ఆసుపత్రి బాయ్స్.. ఇలాంటి వాటిల్లో నెలకు 10, 12 వేల వరకు ఇస్తారు. కానీ న్యాక్‌లో శిక్షణ పొందిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిపితే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన శిక్షణార్థులను ఎంపిక చేసుకుంటాయి. వాటిల్లో జీతాలు నెలకు రూ.30 వేల వరకు ఉంటున్నాయి. అయితే దీన్ని కాదని తక్కువ జీతమొచ్చే బాయ్స్ ఉద్యోగాలకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు పదో తరగతి, ఆ స్థాయిలో చదువు మానేసిన వారు న్యాక్‌లో చేరితే మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి. కానీ శ్రమ ఉంటుందని ఇలాంటి మంచి ఉద్యోగాలు వద్దనుకుంటున్నారు. జీతం తక్కువైనా చిల్లర ఉద్యోగాలనే ఇష్టపడుతున్నారు. ఇది సమాజానికి మంచి పరిణామం కాదు. వారిలో మార్పు కోసం యత్నిస్తున్నాం -
న్యాక్‌ను ‘ఎక్సలెన్స్’గా తీర్చిదిద్దాలి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)ను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందులో శిక్షణ పొందిన వారికి దేశవిదేశాల్లో ఉద్యోగాలు పొందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన న్యాక్ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ..యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏజెన్సీగా న్యాక్ ను తీర్చిదిద్దాలన్నారు. జిల్లాల్లో న్యాక్ కేంద్రాలను పటిష్టం చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు 12% పెంపు, ఎన్టీఏ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యం, ఉద్యోగులకు రవాణాభత్యం పెంపు అంశాలను ఆయన ప్రస్తావించారు. సమావేశంలో న్యాక్ కో చైర్మన్ హోదాలో సీఎస్ ఎస్పీ సింగ్, ప్రధాన కార్యదర్శి హోదాలో రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, డీజీ భిక్షపతి, రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ లింగయ్య, సాగునీటి శాఖ ఈఎన్సీ నాగేందర్, బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ సుగుణాకర్‌రావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఒకేసారి 400 మందికి ప్లేస్మెంట్
తెలంగాణ న్యాక్ ఘనత.. కేంద్రం అభినందన సాక్షి, హైదరాబాద్: వారంతా పదో తరగతి, ఇంటర్ స్థాయిలోనే చదువు ఆపేసిన యువకులు. పేదరికంతో చదువు కొనసాగించలేక వృత్తి విద్యలో నైపుణ్యం సాధించాలని ఆరా టపడ్డారు. వారికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) భవన నిర్మాణానికి సంబం ధించి వివిధ ట్రేడ్లలో శిక్షణ ఇచ్చింది. తరగతుల అనంతరం నెల రోజుల్లో వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చూపింది. ఒకేసారి 400 మందికి ఉపాధి లభించటంతో తెలంగాణ ‘న్యాక్’ పనితీరును కేంద్రం గుర్తిం చింది. న్యాక్ డీజీని కేంద్ర ఔత్సాహిక పారి శ్రామిక, నైపుణ్యాభివృద్ధి మంత్రి రాజీవ్ ప్రతాప్‌రూడీ ఢిల్లీ పిలిపించుకుని చర్చించారు. త్వరలోనే హైదరాబాద్ న్యాక్‌ను సందర్శించి ఇతర రాష్ట్రాల్లో వాటి ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. తొలి ఘనత: హైటెక్స్ ప్రాంగణంలోని న్యాక్‌తోపాటు జగిత్యాలలోని ఉపకేంద్రంలో నిరుద్యోగ యువతకు భవన నిర్మాణ రంగంలో శిక్షణ ఇవ్వటం కొన్నేళ్లుగా జరుగు తున్నదే. కానీ ఒకే విడతలో 400 మందికి ప్లేస్‌మెంట్స్ రావటం ఇదే తొలిసారి. ఈ ఘనతే తెలంగాణ న్యాక్ వైపు కేంద్రం చూసేలా చేసింది. పదో తరగతి విద్యార్హతతో మంచి వేతనాలకు వీరు ఎంపికవటాన్ని గుర్తించిన రూడీ.. తాజాగా తెలంగాణ న్యాక్ డీజీ బిక్షపతిని ఢిల్లీ ఆహ్వానించి న్యాక్ వివరాలు, పనితీరుపై ఆరా తీశారు. కేంద్రం తరుఫున తెలంగాణ న్యాక్‌కు అవసరమైన సహాయంఅందిస్తామని, జాతీయ స్థాయిలో న్యాక్ సేవలందించాలని సూచించారు. -
‘న్యాక్’కు బంగారు నెమలి
‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్’ పురస్కారానికి ఎంపిక సాక్షి, హైదరాబాద్: ఉన్నత శిక్షణతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్).. ప్రతిష్టాత్మక ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్’బంగారు నెమలి పురస్కారానికి ఎంపికైంది. ఈ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలోని భారత విభాగం ఈ సంవత్సరం ఉత్తమ శిక్షణ ప్రమాణాలు పాటించినందుకు ‘న్యాక్’ను ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరిజిత్ పసాయత్ ఆధ్వర్యంలోని జ్యూరీ న్యాక్‌ను ఎంపిక చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 19న దుబాయ్‌లో జరిగే కార్యక్రమంలో యూఏఈ ఆర్థికమంత్రి సుల్తాన్ బిన్సయీద్ అల్మన్సూరీ ‘న్యాక్’డైరెక్టర్ జనరల్ భిక్షపతికి పురస్కారాన్ని అందించనున్నారు. న్యాక్ ఈ ఘనత సాధించినందుకు సంతోషంగా ఉందని సంస్థ చైర్మన్ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంస్థ డీజీ, సిబ్బందిని అభినందించారని, దీంతో సంస్థ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
న్యాక్‌తో అమెరికా సంస్థ జోడీ
సివిల్ ఇంజనీరింగ్‌లో ప్రాజెక్టు మేనేజ్మెంట్ శిక్షణ ఇవ్వనున్న పీఎంఐ న్యాక్‌లో నిర్వహణ.. పీఎంఐ సంస్థ పేరిట సర్టిఫికెట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగావకాశం త్వరలో అవగాహన ఒప్పందం సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) సంస్థ అమెరికాకు చెందిన ‘ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్(పీఎంఐ)’తో కలసి పనిచేయనుంది. భవన నిర్మాణానికి సంబంధించిన శిక్షణ, ఇంజనీర్లకు నైపుణ్యాభివృద్ధి తర్ఫీదు అందిస్తున్న న్యాక్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. అటు పీఎంఐ సంస్థ ఇచ్చే శిక్షణకు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. తాజాగా ఈ రెండు సంస్థలు సంయుక్తంగా సివిల్ ఇంజనీరింగ్‌లో ప్రాజెక్టు మేనేజ్మెంట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాయి. దీనిపై త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే న్యాక్ ఆధ్వర్యంలో ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన సమావేశంలో పీఎంఐ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. న్యాక్‌లో శిక్షణ.. పీఎంఐ పేరుతో సర్టిఫికెట్ ప్రపంచవ్యాప్తంగా సివిల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. పెద్ద పెద్ద సంస్థలు చేపట్టే భారీ ప్రాజెక్టుల్లో సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ ఏర్పడింది. పేరున్న సంస్థల్లో ప్రత్యేక శిక్షణ పొందినవారికి కాంట్రాక్టు సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు మేనేజ్మెంట్లో శిక్షణ ఇచ్చేందుకు పీఎంఐతో కలసి పనిచేయాలని న్యాక్ నిర్ణయించింది. దీనిపై ఇటీవల న్యాక్ ప్రతినిధులు పీఎంఐతో సంప్రదించగా.. ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. శిక్షణ తీరు, ఇతర అంశాలను నిర్ధారిం చాక అవగాహన ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదించింది. ఈ మేరకు శిక్షణ ఉండాల్సిన తీరును సిద్ధం చేసేందుకు న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీల ప్రతినిధులు, ప్రఖ్యాత ఇంజనీరింగ్ నిపుణులు అందులో సభ్యులుగా ఉన్నారు. ఇక శిక్షణ కోసం న్యాక్‌లో ఉన్న మౌలిక వసతులను పరిశీలించేందుకు పీఎంఐ ఇండియా విభాగం హెడ్ రాజ్ కల్లారీ త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఆ తర్వాత రెండు సంస్థల మధ్య ఎంవోయూ ఉంటుంది. న్యాక్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులు అనంతరం ఆన్లైన్ ద్వారా పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైనవారికి పీఎంఐ పేరుతో సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ శిక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి అభ్యర్థులు న్యాక్‌కు వచ్చే అవకాశముంది. -
నాక్ ఇకపై నాస్డాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(నాక్) పేరును తెలంగాణ ప్రభుత్వం మంగళవారం మార్చేసింది. సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ‘నాక్’ పేరును నేషనల్ అకాడమీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (నాస్డాక్)గా మార్చాలని నిర్ణయించారు. ‘నాక్’పై ఆధిపత్యం కోసం ఇరు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ రాష్ట్ర ప్రభుత్వం సొంత పాలక మండలిని నియమించుకుంది. కాగా, ఈ మధ్య కాలంలో ఫైళ్ల పరిశీలన, ఉన్నతాధికారులతో సమావేశాల నిర్వహణ తదితర వాటి కోసం సీఎం కేసీఆర్ ఎక్కువగా ‘నాక్’ను వినియోగిస్తున్న విషయం విదితమే. కాగా, మంగళవారం జరిగిన ఈ సమావేశంలో నిర్మాణ రంగంలో కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకునేలా ‘నాస్డాక్’ తయారు కావాలని సీఎం కేసీఆర్ సూచించారు. నిర్మాణ రంగంలోని వారికి వృత్తి నైపుణ్యం పెంచేలా శిక్షణ కార్యక్రమాలుండాలన్నారు. అందుకే ‘నాక్’ పేరును మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను 20 శాతం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇవ్వాలని, క్లాస్-వన్ కాంట్రాక్టర్ల వద్ద శిక్షణ ఇప్పించి వారు నిలదొక్కుకునేలా తయారు చేయాలన్నారు. హరిత భవనాల విధానం ప్రకారం నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ మంది సౌకర్యవంతంగా విధులు నిర్వహించేలా ఈ భవనాల నిర్మాణాల నమూనాలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటెల, సీఎస్ డాక్టర్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, అర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, నాస్డాక్ డీజీ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.