సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక పరమైన అంశాల్లో నెలకొన్న వివాదాలు ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు అడ్డంకిగా మారాయి. ఈ వివాదం వల్ల న్యాక్‌కు నిధులు రావటం నిలిచిపోవటంతో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహణ ఇబ్బందిలో పడింది.
ఏడాదిగా నిధుల కోసం నానాతిప్పలు పడుతున్న నాక్ యంత్రాంగం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద బడా సంస్థల వద్దకు వెళ్లి నిధులు సమీకరించుకుని కార్యక్రమాలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు కార్పొరేట్ సంస్థలతో పాటు, నాబార్డ్ చేసిన ఆర్థిక సాయంతో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
ఇప్పుడు మరిన్ని సంస్థలు ముందుకొచ్చి సాయం చేస్తే, కొత్త బ్యాచ్‌లను ఏర్పాటు చేసి మరిన్ని బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వాలని యత్నిస్తున్నారు. గతంలో విదేశీ యువతకు కూడా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయంగానూ ఖ్యాతి పొందిన న్యాక్‌కు.. ప్రభుత్వ విభాగాలు ఆర్థిక క్రమశిక్షణ తప్పటంతో నిధుల కోసం రోడ్డున పడాల్సిన దుస్థితి దాపురించింది.
నిధుల వ్యయంపై అభిప్రాయభేదాలు..
న్యాక్ కోర్సులకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇస్తోంది. ఇది 70:30 దామాషాగా విడుదలవుతున్నాయి. తాను ఇస్తున్న నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సరి్టఫికెట్లు సరిగా దాఖలు కావటం లేదని, కొన్ని నిధులు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని కేంద్రం సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయి. అవి రానురాను పెద్దవి కావటంతో ఏడాది క్రితం కేంద్రం నిధుల విడుదలను ఆపేసినట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా నిలిచిపోయి, న్యాక్‌కు నిధుల సమస్య ఉత్పన్నమైంది. మూడు నెలల కోర్సులను బ్యాచ్‌ల వారీగా నిర్వహిస్తున్న న్యాక్ వద్ద పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పోగయ్యాయి. ఈ తరుణంలో చేతిలో నిధులు లేకుండా పోయాయి. దీంతో న్యాక్ ఉన్నతాధికారులు కార్పొరేట్ కంపెనీలను సంప్రదించటం ప్రారంభించారు.
అలా తొలుత తాన్లా ప్లాట్‌ఫామ్స్, జీఐపీఎల్ సంస్థలు 350 మంది శిక్షణకు కావాల్సిన నిధులు అందించాయి. ఒక్కో అభ్యర్థికి రూ. లక్ష వరకు ఫీజు ఉండే కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ లాంటి పీజీ కోర్సులు కూడా వాటితో నిర్వహిస్తుండటం విశేషం. ఇక మరో 200 మంది అభ్యర్థులతో కూడిన బ్యాచ్‌ల శిక్షణకు కావాల్సిన నిధులను నాబార్డు సమకూర్చింది. వీటితో ఇప్పటి వరకు శిక్షణ నిర్వహిస్తున్నారు.
మరిన్ని సంస్థలు ముందుకొస్తే విస్తరిస్తాం...
‘‘సీఎస్‌ఆర్ నిధులతో శిక్షణ కార్యక్రమాలు విస్తరించాలని నిర్ణయించాం. ఇప్పటికి తాన్లా ప్లాట్‌ఫామ్స్, జీఐపీఎల్, నాబార్డు నిధులు అందించాయి. ఈ డిసెంబరులో కేంద్ర ప్రభుత్వ నిధులు కొన్ని రాబోతున్నాయి. వాటికి అదనంగా సీఎస్‌ఆర్ కింద కార్పొరేట్ కంపెనీలు సాయం అందిస్తే న్యాక్ మరింత ఉన్నతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది’అని న్యాక్ డీజీ బిక్షపతి పేర్కొన్నారు. పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి న్యాక్ శిక్షణార్థులను ఎంపిక చేసుకుంటున్నందున కార్పొరేట్ సంస్థలు సీఎస్‌ఆర్ నిధులతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని న్యాక్ ప్లేస్‌మెంట్ డైరక్టర్ శాంతిశ్రీ కోరారు.
ఇదీ పరిస్థితి..
ఉన్నత విద్య చదువుకోలేని పరిస్థితిలో చదువు మానేసిన ఎంతోమంది యువతీయువకులకు భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో న్యాక్ శిక్షణ ఇస్తోంది. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఫాల్స్ సీలింగ్, భవన నిర్మాణ సూపర్‌వైజింగ్, వెల్డింగ్, కన్‌స్ట్రక్షన్ సర్వే అంశాల్లో తర్పి దు పొందుతున్న అభ్యర్థులకు దేశవిదేశాల్లోని నిర్మాణ సంస్థల్లో ఉపాధి దొరుకుతోంది.
గతంలో కేవలం భవన నిర్మాణంలోని వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చిన న్యాక్.. ఆ తర్వాత పీజీ కోర్సులను కూడా ప్రారంభించింది. బీటెక్ సివిల్ అభ్యర్థులు, ఇంజినీర్లకు కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ లాంటి కోర్సులు నిర్వహిస్తోంది. ఇలాంటి తరుణంలో నిధుల సమస్య ఉత్పన్నమై న్యాక్‌ను గందరగోళంలో పడేసింది.
Comments
Please login to add a commentAdd a comment