సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(నాక్) పేరును తెలంగాణ ప్రభుత్వం మంగళవారం మార్చేసింది. సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ‘నాక్’ పేరును నేషనల్ అకాడమీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (నాస్‌డాక్)గా మార్చాలని నిర్ణయించారు. ‘నాక్’పై ఆధిపత్యం కోసం ఇరు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ రాష్ట్ర ప్రభుత్వం సొంత పాలక మండలిని నియమించుకుంది.
కాగా, ఈ మధ్య కాలంలో ఫైళ్ల పరిశీలన, ఉన్నతాధికారులతో సమావేశాల నిర్వహణ తదితర వాటి కోసం సీఎం కేసీఆర్ ఎక్కువగా ‘నాక్’ను వినియోగిస్తున్న విషయం విదితమే. కాగా, మంగళవారం జరిగిన ఈ సమావేశంలో నిర్మాణ రంగంలో కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకునేలా ‘నాస్‌డాక్’ తయారు కావాలని సీఎం కేసీఆర్ సూచించారు. నిర్మాణ రంగంలోని వారికి వృత్తి నైపుణ్యం పెంచేలా శిక్షణ కార్యక్రమాలుండాలన్నారు. అందుకే ‘నాక్’ పేరును మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను 20 శాతం పెంచాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇవ్వాలని, క్లాస్-వన్ కాంట్రాక్టర్ల వద్ద శిక్షణ ఇప్పించి వారు నిలదొక్కుకునేలా తయారు చేయాలన్నారు. హరిత భవనాల విధానం ప్రకారం నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ మంది సౌకర్యవంతంగా విధులు నిర్వహించేలా ఈ భవనాల నిర్మాణాల నమూనాలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటెల, సీఎస్ డాక్టర్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, అర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, నాస్‌డాక్ డీజీ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
నాక్ ఇకపై నాస్‌డాక్
Published Wed, Dec 10 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM
Advertisement
Advertisement