న్యాకు వద్దు! | Young people saying no for Employment of Because of smartphones | Sakshi
Sakshi News home page

న్యాకు వద్దు!

Published Thu, Apr 25 2019 2:33 AM | Last Updated on Thu, Apr 25 2019 10:17 AM

Young people saying no for Employment of Because of smartphones - Sakshi

స్మార్ట్‌ ఫోన్‌.. ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చింది.ఎన్నో ఉపయోగాలను మోసుకొచ్చింది.కానీ ఇప్పుడు అనర్థాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.యువత దానికి బానిసై అందమైన భవిష్యత్తును అంధకారంగా చేసుకుంటోంది.

తాజాగా ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)’పరిశీలనలోనూ ఇదే తేలింది. భవన నిర్మాణ రంగానికి అవసరమైన అన్ని రకాల విభాగాల్లో అద్భుత శిక్షణ ఇచ్చే సంస్థగా న్యాక్‌కు పేరుంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద నిర్మాణ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. భూటాన్, నేపాల్‌లాంటి చిన్న దేశాలు న్యాక్‌తో ఒప్పందం చేసుకుంటుండగా, మధ్య ఆసియా దేశాలు అది ఇచ్చే సర్టిఫికెట్లకు ఎంతో ప్రాధాన్యమిస్తూ, అందులో శిక్షణ పొందిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. కానీ ఇక్కడి యువత మాత్రం దానిపై అంతగా దృష్టి సారించట్లేదు. పదో తరగతి, అంతకంటే తక్కువ స్థాయిలోనే చదువు మానేసిన వారు గతంలో వృత్తి విద్యల్లో శిక్షణకు ఎంతో ఆసక్తి చూపే వారు. కానీ గత నాలుగైదేళ్లుగా యువత ఆలోచనలో మార్పు వచ్చింది. ఫోన్‌ ప్రపంచంలో మునిగితేలుతున్న వారు న్యాక్‌ అంటే బాబోయ్‌ అంటున్నారు. ప్రపంచం న్యాక్‌ వైపు చూస్తుంటే, స్థానిక యువత వద్దనుకుంటోంది. మన పురోగతికి గొడ్డలిపెట్టుగా మారిన సామాజిక సమస్యలో ఇది మరో కోణం అని చెప్పుకోవచ్చు.
– సాక్షి, హైదరాబాద్‌

కష్టపడటమా..?
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం భవన నిర్మాణ రంగం ఉజ్వలంగా ఉంది. భవన నిర్మాణంలో భాగమైన ప్లంబింగ్, కార్పెంటరీ, వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, సీలింగ్, వైరింగ్, సైట్‌ ల్యాండ్‌ సర్వే, సైట్‌ సూపర్‌వైజింగ్, పెయింటింగ్‌.. ఇలాంటి విభాగాల్లో ఉపాధికి విస్తృత అవకాశాలున్నాయి. కానీ ఇవన్నీ శ్రమతో కూడుకున్న పనులు. స్మార్ట్‌ఫోన్‌లో ముగిని తేలుతున్నవారు శ్రమతో కూడుకున్న పనులంటే దూరంగా ఉంటున్నారని తేలింది. ఆ పనుల్లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌ వినియోగానికి దూరంగా ఉండాల్సి రావటం, పని చేస్తూ ఫోన్‌ వినియోగం సాధ్యం కాకపోవటం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విశేషాలను చూస్తూ ‘నేనేంటి కష్టపడే పని చేయటమేంటి’అనే భావనకు రావడం తదితర కారణాలతో ఇలాంటి ఉద్యోగాలకు యువత దూరమవుతోందని న్యాక్‌ తాజాగా గుర్తించింది.

స్పందన కరువు..
న్యాక్‌కు భవన నిర్మాణ రంగంలోని వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చే టాప్‌ సంస్థగా పేరుంది. 1998లో ప్రారంభమైన న్యాక్‌.. యువత నుంచి ఆదరణ పెరుగుతుండటంతో తన శాఖల సంఖ్య పెంచుకోవాలని నిర్ణయించింది. తొలుత మాదాపూర్‌లో ప్రధాన కేంద్రం ఉండేది. ఇక్కడ రెసిడెన్షియల్‌ శిక్షణ కేంద్రం అందుబాటులో ఉంది. శిక్షణ కోసం దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండటంతో జగిత్యాలలో రెండో రెసిడెన్షియల్‌ కేంద్రాన్ని, పాతజిల్లా కేంద్రాల్లో సాధారణ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. రెసిడెన్షియల్‌కు కేంద్రాలకు సంబంధించి రెండు చోట్లా కలిపి శిక్షణ కాలానికి 600 మందిని ఎంపిక చేసుకునే వీలుంది. గతంలో అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చేవి. కానీ ప్రస్తుతం అతి కష్టమ్మీద 400 మంది వరకే చేరుతున్నారు.

- రాష్ట్రవ్యాప్తంగా డీఆర్‌డీఏలాంటి సంస్థలు చిరుద్యోగాలకు సంబంధించి జాబ్‌ మేళాలు నిర్వహిస్తుంటాయి. వీటిల్లో న్యాక్‌ కూడా పాల్గొంటోంది. కానీ అక్కడికి వచ్చే యువత న్యాక్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవట్లేదు. కేటరింగ్‌ సంస్థలు, రిటేల్స్, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రుల్లో బాయ్స్‌ వంటి ఉద్యోగాలకే మొగ్గు చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో న్యాక్‌కు ఐదారుకు మించి రిజిస్ట్రేషన్స్‌ రావటం లేదు.

- శిక్షణ లేకుండా వ్యక్తుల వద్ద పని నేర్చుకుని భవన నిర్మాణ రంగంలో ఉద్యోగం కోసం గల్ఫ్‌కు వెళ్లే తెలంగాణ యువతకు అక్కడ చుక్కెదురవుతోంది. శిక్షణ సర్టిఫికెట్లు లేవన్న కారణంతో అసలు పని కాకుండా కూలీ పని ఇస్తున్నారు. చివరకు అది వెట్టిచాకిరీకి దారి తీస్తోంది.

- మాల్స్, దుకాణాలు, ఆసుపత్రి బాయ్స్‌.. ఇలాంటి వాటిల్లో నెలకు 10, 12 వేల వరకు ఇస్తారు. కానీ న్యాక్‌లో శిక్షణ పొందిన తర్వాత క్యాంపస్‌ ఇంటర్వ్యూలు జరిపితే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన శిక్షణార్థులను ఎంపిక చేసుకుంటాయి. వాటిల్లో జీతాలు నెలకు రూ.30 వేల వరకు ఉంటున్నాయి. అయితే దీన్ని కాదని తక్కువ జీతమొచ్చే బాయ్స్‌ ఉద్యోగాలకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.

ఇది మంచి పరిణామం కాదు
పదో తరగతి, ఆ స్థాయిలో చదువు మానేసిన వారు న్యాక్‌లో చేరితే మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి. కానీ శ్రమ ఉంటుందని ఇలాంటి మంచి ఉద్యోగాలు వద్దనుకుంటున్నారు. జీతం తక్కువైనా చిల్లర ఉద్యోగాలనే ఇష్టపడుతున్నారు. ఇది సమాజానికి మంచి పరిణామం కాదు. వారిలో మార్పు కోసం యత్నిస్తున్నాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement