
హైదరాబాద్: పోరాట యోధురాలైన ఈశ్వరీబాయిని మహిళా నాయకులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ ఈస్ట్‌మారేడుపల్లిలో ఈశ్వరీబాయి విగ్రహం వద్ద 27వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈశ్వరీబాయి కుమార్తె, జహీరాబాద్ ఎమ్మెల్యే జె.గీతారెడ్డి నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయిని ఈశ్వరీబాయికి నివాళులు అర్పించారు. ఈశ్వరీబాయి చేసిన సేవలు మరువలేనివని, దళితుల అభ్యున్నతికి పాటుపడిన మహానాయకురాలని నాయిని కొనియాడారు.
ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సైతం తనవాణిని వినిపించి పేదల పక్షాన నిలిచిన గొప్ప మహనీయురాలని ఆయన అన్నారు. తన తల్లి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గీతారెడ్డి తెలిపారు. ఈశ్వరీబాయి స్ఫూర్తితో రాజకీయాల్లో రాణిస్తున్నానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు బాలానందం, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, శివకుమార్, ప్రదీప్, రాజుసాగర్, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ మహిళా నాయకురాలు మేఘనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment