నగరంలో ‘నమస్తే గ్యాంగ్‌’లు! | "Namaste Gang ' enter to hyderbad city | Sakshi
Sakshi News home page

నగరంలో ‘నమస్తే గ్యాంగ్‌’లు!

Published Fri, Apr 14 2017 1:13 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

నగరంలో ‘నమస్తే గ్యాంగ్‌’లు!

నగరంలో ‘నమస్తే గ్యాంగ్‌’లు!

విమానాల్లో వచ్చి  నేరాలు చేసిన వైనం
ఘజియాబాద్‌ ముఠాగా గుర్తించిన సీసీఎస్‌
అక్కడకు వెళ్లేసరికి పట్టుకెళ్లిన పుణే పోలీసులు
పీటీ వారెంట్‌పై తెస్తున్న సిటీ అధికారులు


సిటీబ్యూరో: విమానాల్లో ముఠా సభ్యులు... ట్రాన్స్‌పోర్ట్‌లో ద్విచక్ర వాహనాలు... లాడ్జిలు/హోటళ్లలో మకాం... డమ్మీ తుపాకులు చూపించి దోపిడీలు... వరుసపెట్టి నేరాలు చేసి స్వస్థలాలకు పరారీ... ఈ తరహాలో రెచ్చిపోతూ దేశ వ్యాప్తంగా నేరాలు చేసిన ‘నమస్తే గ్యాంగ్‌’ సిటీలోనూ హల్‌చల్‌ చేసింది. ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్న ఈ ముఠాను నగర పోలీసులు ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారెంట్‌పై సిటీకి తీసుకువస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఈ ఘరానా ముఠా దేశ వ్యాప్తంగా దోపిడీలకు పాల్పడింది. గతంలో చైన్‌స్నాచింగ్స్‌కు పాల్పడిన ఈ గ్యాంగ్‌ సభ్యులు కేవలం గొలుసులు మాత్రమే దోచుకెళ్లారు. దక్షిణాదిలో ఉన్న నగరాన్ని టార్గెట్‌ చేసుకుంటే ముందుగా వీరు ఉత్తరాదిలోని సిటీకి వెళ్లి అక్కడ ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తారు. వాటిని ట్రాన్స్‌పోర్ట్‌లో టార్గెట్‌ చేసుకున్న నగరానికి పంపిస్తారు. గ్యాంగ్‌ మొత్తం విమానాల్లో ఆ సిటీకి చేరుకుంటుంది.

ఇందుకుగాను వీరు విమానాశ్రయం ఉన్న నగరాలనే ఎంచుకుంటారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, భోపాల్, బెంగళూరు, మహారాష్ట్రల్లోనూ నేరాలు చేశారు. లాడ్జిల్లో బస చేసి, ట్రాన్స్‌పోర్ట్‌ నుంచి వాహనం తీసుకుంటుంది. బైక్‌పై తిరుగుతూ తెల్లవారుజామున వాకింగ్‌ చేసే వారితో పాటు నిర్మానుష్య ప్రాంతాల్లో నడిచి వెళ్లే వారిని టార్గెట్‌ చేసుకుంటారు. ఒంటరిగా కనిపించిన స్త్రీ, పురుషుల వద్దకు వెళ్లి వాహనాన్ని ఆపుతారు. వెనుక కూర్చున గ్యాంగ్‌ మెంబర్‌ టార్గెట్‌ చేసిన వారి దగ్గరకు వెళ్లి తొలుత నమస్తే చెబుతాడు. అందుకే ఈ గ్యాంగ్‌ను పోలీసులు ‘నమస్తే గ్యాంగ్‌’గా పరిగణిస్తున్నారు. ఏదైనా చిరునామా అడుగుతున్నట్లు వారిని మాటల్లోకి దింపి ఒంటిపై ఉన్న ఆభరణాలను గుర్తిస్తాడు. అదను చూసుకుని తమ వెంట తెచ్చిన డమ్మీ తుపాకీని చూపించి బెదిరించి,  గొలుసులు, ఆభరణాలు లాక్కుని... స్టార్ట్‌ చేసి సిద్ధంగా ఉన్న వాహనంపై ఉడాయిస్తారు. ఇలా గరిష్టంగా మూడు రోజుల్లో వీలైనన్ని నేరాలు చేసే ‘నమస్తే గ్యాంగ్‌’ ఆ ప్రాంతాన్ని వదిలేస్తుంది. వాహనాన్ని ‘నెక్స్‌›్ట టార్గెట్‌’గా చేసుకున్న సిటీకి పార్శిల్‌ చేసి వీరు మాత్రం విమానంలో తమ స్వస్థలానికి వెళ్లిపోతారు. సొత్తు అమ్మకం, పంపకాలు పూర్తయిన తర్వాత ‘నెక్ట్స్‌ టార్గెట్‌ సిటీ’కి చేరుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న రామ్‌గోపాల్‌పేట్‌ ఠాణా పరిధిలో ఈ ముఠా పంజా విసిరింది. మినిస్టర్స్‌ రోడ్‌లో వాకింగ్‌ చేస్తున్న వెంకటరత్నం అనే వ్యక్తి నుంచి మూడు తులాల బంగారం గొలుసు లాక్కెళ్లారు.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్‌ అధికారులు రామ్‌గోపాల్‌పేటతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 150 సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్‌ను అధ్యయనం చేసి నేరగాళ్లు వాడిన వాహనాన్ని గుర్తించారు. దర్యాప్తు నేపథ్యంలో ఇది ఢిల్లీలో చోరీ అయినట్లు తేలింది. సాంకేతికంగా ముందుకు వెళ్ళిన అధికారులు ఘజియాబాద్‌ ముఠాగా నిర్థారించారు. వీరిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం గత నెల్లో ఆ ప్రాంతానికి వెళ్లగా, అప్పటికే నిందితుల్ని మహారాష్ట్రలోని పుణే పోలీసులు తీసుకువెళ్ళినట్లు తేలింది. అక్కడ నుంచి ఈ ముఠాను ఢిల్లీ పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకువెళ్ళారు. రామ్‌గోపాల్‌పేటలో నమోదైన కేసుకు సంబంధించి పీటీ వారెంట్‌లో వెళ్ళిన నగర పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఒకటిరెండు రోజుల్లో సిటీకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఢిల్లీ వెళ్ళిన నగర పోలీసులు నిందితుల్ని విచారించగా, వారు నగరంలో చేసిన మరో ఎనిమిది నేరాలను అంగీకరించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు సైతం సేకరిస్తున్న పోలీసులు సిటీకి తీసుకువచ్చిన తర్వాత న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement