సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని సీఐడీ.. న్యాయస్థానానికి నివేదించింది. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి మరీ అస్మదీయుల కంపెనీ టెరాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టారని ఆధారాలతో సహా వెల్లడించింది. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసేందుకు పీటీ వారెంట్‌ను ఆమోదించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు పీటీ వారెంట్ జారీచేయాలన్న సీఐడీ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం బుధవారం విచారించింది.
ఈ కేసులో తమ వాదనలు వినాలని చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేసిన ‘రైట్ టు ఆడియెన్స్’ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం సీఐడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని చెప్పారు. ఏపీ ఈ–గవర్నెన్స్ కౌన్సిల్‌లో డైరెక్టర్‌గా ఉన్న వేమూరి హరికృష్ణను ఈ ప్రాజెక్ట్ టెండర్ల టెక్నికల్ ఎవాల్యూయేషన్ కమిటీలో సభ్యుడిగా చేర్చారన్నారు. ఆయన కంపెనీ టెరాసాఫ్ట్ టెండర్లలో పాల్గొంటుండగా ఆయన్నే కమిటీలో చేర్చడం పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధమని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
బ్లాక్ లిస్టు్టలో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిం చడం ద్వారా అవినీతికి దారులు తెరిచారని తెలిపారు. అంతేగాక నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల గడువును వారం రోజులు పొడిగించారని చెప్పారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతూ 10 బ్యాంకు ఖాతాల్లోకి రూ.114 కోట్ల అక్రమ నిధులు మళ్లించినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ఫాస్ట్‌లేన్ కంపెనీ, టెరాసాఫ్ట్, ఫ్యూచర్ స్పేస్, అభిజ్ఞ, నీలిమ, నెట్ ఇండియా, కోఫెల్, నెట్‌టాప్స్ అనే కంపెనీలకు చెందిన మొత్తం 10 ఖాతాలకు అక్రమంగా రూ.114 కోట్లు మళ్లించిన వివరాలను కోర్టుకు సమర్పించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేస్తూ కుంభకోణంలో కీలకపాత్ర పోషించడం ద్వారా ప్రజాధనం దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ కేసులో మరింత సమగ్ర దర్యాప్తునకు ఆయన్ని అరెస్ట్‌చేయాల్సిన అవసరం ఉన్నందున పీటీ వారెంట్‌ను ఆమోదించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద కోరారు. ఈ కేసులో వాదనలు పూర్తికావడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment