chain Snachings
-
‘గొలుసు’ దొంగలు దొరికారు...!
ఖమ్మంక్రైం: ఒకటి కాదు.. రెండు కాదు.. పది నెలల నుంచి ఖమ్మం జిల్లాలో వరుసగా చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. ఆ ‘గొలుసు’ దొంగలెవరో, ఎక్కడి నుంచి వచ్చారో తెలియకపోవడంతో పోలీసులు తల పట్టుకున్నారు. వీరిని గుర్తించేందుకు, పట్టుకునేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాన్ని పోలీస్ కమిషనర్ ఏర్పాటు చేశారు. వారి సుదీర్ఘ ప్రయత్నం ఫలించింది. ఇద్దరు ‘గొలుసు’ దొంగ సోదరులను ఎట్టకేలకు పట్టుకున్నారు. ఖమ్మంలోని సీపీ కార్యాలయంలో మంగళవారం కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించిన వివరాలు... చింతకాని మండలం నాగులవంచ గ్రామస్తుడు మొండితోక వీరయ్య, చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. గేదెల వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఇతడు జల్సాలకు అలవాటు పడ్డాడు. అప్పులపాల య్యాడు. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఉపాయం చెప్పాలని తన తమ్ముడు ఏసోబును అడిగాడు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ఏయే మార్గాలున్నాయో ఇద్దరూ ఆలోచించారు. మహిళల మెడలోని గొలుసులను లాక్కుని తప్పించుకోవచ్చని ఏసోబుకు ఆలోచన వచ్చింది. అన్న య్య వీరయ్యతో చెప్పాడు. గొలుసులు దొంగత నం చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలలోని సీసీ కెమెరాల పుటేజీలను చూశారు. ఖమ్మం నగరంతోపాటు గ్రామాల్లోనూ స్నాచింగ్ చేయొచ్చని, తేలిగ్గా తప్పించుకోవచ్చని అన్నయ్యతో తమ్ముడు చెప్పాడు. అన్నదమ్ములిద్దరూ రెండు ద్విచక్ర వాహనాలను సిద్ధం చేసుకున్నారు. ప్రతిసారీ ఒకే వాహనం కాకుండా ఒకసారి అది.. ఒకసారి ఇది వాడేవారు. అన్న వీరయ్య నడిపేవాడు. తమ్ముడేమో వెనకాల కూర్చునేవాడు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను గమనించి, వారి మెడలోని పుస్తెల తాళ్లు గుంజుకుని పారిపోయేవారు. ఖమ్మం నగరంలో సీసీ కెమెరాలు ఉండటం, పోలీస్ నిఘా ఎక్కువవడంతో గ్రామాలపై ఈ అన్నదమ్ములు దృష్టి పెట్టారు. ఊరు అవతల, పొలాలకు వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. వారి మెడలోని తాళిబొట్లను గుంజుకుని తప్పించుకుని పారిపోయేవారు. ఒకసారి చైన్ స్నాచింగ్ చేసిన తరువాత కొన్ని రోజులపాటు నగరంలోనో, ఇంకొన్ని రోజులపాటు గ్రామీణ ప్రాంతాల్లో గడిపేవారు. మధ్య మధ్యలో ఇతర జిల్లాలకు కూడా వెళ్లేవారు. కృష్ణా జిల్లా వత్సవా యి, చిల్లకల్లులో, సూర్యాపేట జిల్లాలోని కోదాడ రూరల్‌ప్రాంతంలో గొలుసు దొంగతనాలు చేశారు. వీళ్లు, కేవలం చైన్ స్నాచింగ్‌కు మాత్రమే పరిమితమయ్యారు. ‘‘ఎందుకంటే, దాదాపుగా 90 శాతం మంది మహిళలు బంగారపు తాళిబొట్లనే ధరిస్తారు. వాటిని కాజేయడం, ఆ తరువాత తప్పించుకోవడం... రెండే తేలిక. అందుకే, ఈ పనికి మాత్రమే పరిమితమయ్యాం’’ అని, పోలీసుల విచారణలో ఆ ఇద్దరు చెప్పారు. 44 గొలుసులు గుంజేశారు.. వీరు ఇప్పటివరకు 44 గొలుసులు గుంజారు. ఖమ్మం వన్ టౌన్ పరిధిలో 10, ఖమ్మం రూరల్ పరిధిలో ఏడు, ఖమ్మం అర్బన్ పరిధిలో ఒకటి, ముదిగొండ మండలంలో రెండు, తిరుమలాయ పాలెంలో ఒకటి, నేలకొండపల్లిలో నాలుగు, చిం తకానిలో మూడు, వైరాలో రెండు, రఘునాధపా లెంలో ఒకటి, కొణిజర్లలో మూడు, మధిరలో ఒక టి, కృష్ణా జిల్లా వత్సవాయిలో మూడు, ఇదే జిల్లా లోని చిల్లకల్లులో మూడు, సూర్యాపేట జిల్లాలోని కోదాడ రూరల్‌లో మూడు చైన్‌స్నాచింగ్‌లకు పా ల్పడ్డారు. వీరు ఇలా కాజేసిన బంగారం మొత్తం కేజీ 65 గ్రాములు ఉంటుంది. దీని విలువ రూ. 32లక్షలు. ఈ బంగారంతోపాటు రెండు మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. నగరంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో వీరిని సీసీఎస్, ఖమ్మం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వెంకన్న, మంగ్త్యాకు సీపీ అభినందన ఈ ఇద్దరు చైన్ స్నాచర్లను పట్టుకోవడంలో సీసీఎస్ కానిస్టేబుళ్లు వెంకన్న, మంగ్త్యా కీలకంగా వ్యవహరించారు. వీరిని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ప్ర త్యేకంగా అభినందించారు. సొత్తును రాబట్టిన టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రెహమాన్, ఖమ్మం రూరల్ ఏ సీపీ రామోజీ రమేష్, వైరా ఏసీపీ ప్రసన్నకుమార్, సీసీఎస్ సీఐలు వేణుమాధవ్, వసంతకుమార్ ను అభినందించారు. సీసీఎస్ ఏఎస్సై లింగయ్య, సిబ్బంది వెంకన్న, మంగ్త్యా, సాదిక్, అబ్బాస్, లతీ ఫ్, రాజ్‌కుమార్, బివి.రమణ, వెంకటేశ్వర్లు, కృ ష్ణారావుకు కలిపి రూ.లక్ష రివార్డు అందించారు. అ డిషనల్ డీసీపీ మురళీధర్, ట్రైనీ ఐపీఎస్ వినీత్, ఏ సీపీలు వెంకట్రావు, రెహమాన్, రామోజీ ర మేష్, ప్రసన్నకుమార్, సత్యనారాయణ, సీఐలు ర మేష్, షుకూర్, రమేష్, మురళి, సాయిరమణ తదితరులుæ పాల్గొన్నారు. -
నగరంలో ‘నమస్తే గ్యాంగ్’లు!
⇒విమానాల్లో వచ్చి నేరాలు చేసిన వైనం ⇒ఘజియాబాద్ ముఠాగా గుర్తించిన సీసీఎస్ ⇒అక్కడకు వెళ్లేసరికి పట్టుకెళ్లిన పుణే పోలీసులు ⇒పీటీ వారెంట్‌పై తెస్తున్న సిటీ అధికారులు సిటీబ్యూరో: విమానాల్లో ముఠా సభ్యులు... ట్రాన్స్‌పోర్ట్‌లో ద్విచక్ర వాహనాలు... లాడ్జిలు/హోటళ్లలో మకాం... డమ్మీ తుపాకులు చూపించి దోపిడీలు... వరుసపెట్టి నేరాలు చేసి స్వస్థలాలకు పరారీ... ఈ తరహాలో రెచ్చిపోతూ దేశ వ్యాప్తంగా నేరాలు చేసిన ‘నమస్తే గ్యాంగ్’ సిటీలోనూ హల్చల్ చేసింది. ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్న ఈ ముఠాను నగర పోలీసులు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై సిటీకి తీసుకువస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఈ ఘరానా ముఠా దేశ వ్యాప్తంగా దోపిడీలకు పాల్పడింది. గతంలో చైన్‌స్నాచింగ్స్‌కు పాల్పడిన ఈ గ్యాంగ్ సభ్యులు కేవలం గొలుసులు మాత్రమే దోచుకెళ్లారు. దక్షిణాదిలో ఉన్న నగరాన్ని టార్గెట్ చేసుకుంటే ముందుగా వీరు ఉత్తరాదిలోని సిటీకి వెళ్లి అక్కడ ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తారు. వాటిని ట్రాన్స్‌పోర్ట్‌లో టార్గెట్ చేసుకున్న నగరానికి పంపిస్తారు. గ్యాంగ్ మొత్తం విమానాల్లో ఆ సిటీకి చేరుకుంటుంది. ఇందుకుగాను వీరు విమానాశ్రయం ఉన్న నగరాలనే ఎంచుకుంటారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, భోపాల్, బెంగళూరు, మహారాష్ట్రల్లోనూ నేరాలు చేశారు. లాడ్జిల్లో బస చేసి, ట్రాన్స్పోర్ట్ నుంచి వాహనం తీసుకుంటుంది. బైక్‌పై తిరుగుతూ తెల్లవారుజామున వాకింగ్ చేసే వారితో పాటు నిర్మానుష్య ప్రాంతాల్లో నడిచి వెళ్లే వారిని టార్గెట్ చేసుకుంటారు. ఒంటరిగా కనిపించిన స్త్రీ, పురుషుల వద్దకు వెళ్లి వాహనాన్ని ఆపుతారు. వెనుక కూర్చున గ్యాంగ్ మెంబర్ టార్గెట్ చేసిన వారి దగ్గరకు వెళ్లి తొలుత నమస్తే చెబుతాడు. అందుకే ఈ గ్యాంగ్‌ను పోలీసులు ‘నమస్తే గ్యాంగ్’గా పరిగణిస్తున్నారు. ఏదైనా చిరునామా అడుగుతున్నట్లు వారిని మాటల్లోకి దింపి ఒంటిపై ఉన్న ఆభరణాలను గుర్తిస్తాడు. అదను చూసుకుని తమ వెంట తెచ్చిన డమ్మీ తుపాకీని చూపించి బెదిరించి, గొలుసులు, ఆభరణాలు లాక్కుని... స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్న వాహనంపై ఉడాయిస్తారు. ఇలా గరిష్టంగా మూడు రోజుల్లో వీలైనన్ని నేరాలు చేసే ‘నమస్తే గ్యాంగ్’ ఆ ప్రాంతాన్ని వదిలేస్తుంది. వాహనాన్ని ‘నెక్స్›్ట టార్గెట్’గా చేసుకున్న సిటీకి పార్శిల్ చేసి వీరు మాత్రం విమానంలో తమ స్వస్థలానికి వెళ్లిపోతారు. సొత్తు అమ్మకం, పంపకాలు పూర్తయిన తర్వాత ‘నెక్ట్స్ టార్గెట్ సిటీ’కి చేరుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న రామ్‌గోపాల్‌పేట్ ఠాణా పరిధిలో ఈ ముఠా పంజా విసిరింది. మినిస్టర్స్ రోడ్లో వాకింగ్ చేస్తున్న వెంకటరత్నం అనే వ్యక్తి నుంచి మూడు తులాల బంగారం గొలుసు లాక్కెళ్లారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ అధికారులు రామ్గోపాల్పేటతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 150 సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్‌ను అధ్యయనం చేసి నేరగాళ్లు వాడిన వాహనాన్ని గుర్తించారు. దర్యాప్తు నేపథ్యంలో ఇది ఢిల్లీలో చోరీ అయినట్లు తేలింది. సాంకేతికంగా ముందుకు వెళ్ళిన అధికారులు ఘజియాబాద్ ముఠాగా నిర్థారించారు. వీరిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం గత నెల్లో ఆ ప్రాంతానికి వెళ్లగా, అప్పటికే నిందితుల్ని మహారాష్ట్రలోని పుణే పోలీసులు తీసుకువెళ్ళినట్లు తేలింది. అక్కడ నుంచి ఈ ముఠాను ఢిల్లీ పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకువెళ్ళారు. రామ్‌గోపాల్‌పేటలో నమోదైన కేసుకు సంబంధించి పీటీ వారెంట్‌లో వెళ్ళిన నగర పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఒకటిరెండు రోజుల్లో సిటీకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్ళిన నగర పోలీసులు నిందితుల్ని విచారించగా, వారు నగరంలో చేసిన మరో ఎనిమిది నేరాలను అంగీకరించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు సైతం సేకరిస్తున్న పోలీసులు సిటీకి తీసుకువచ్చిన తర్వాత న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. -
'సెంచరీ' అక్రమ్ @ ఏడేళ్లు జైలు
హైదరాబాద్: క్రికెట్ ఫీవర్ లో నిండా మునిగిపోయాం కదా మనకు తెలియకుండా సెంచరీ చేసిన అక్రమ్ ఎవరబ్బా! అనుకుంటున్నారా? క్రికెటర్లు స్టేడియంలలో సెంచరీలు కోడితే.. ఈ ప్రబుద్ధుడు మాత్రం మహిళల మెడల్లోనుంచి బంగారు గొలుసులు గుంజటంలో సెంచరీ చేశాడు. ఏకంగా 102 చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. వీడికి మరో ఘనత కూడా ఏడ్చిందిమరి. అదేమంటేజజ చైన్ స్నాచర్లలో మొట్టమెదటిసారి ఏడేళ్లు జైలు శిక్షగు గురైందీ అక్రమే. ఇతడి గొలుసు గుంజుడు సంగతుల గురించి పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు చెప్పుకొచ్చారిలా.. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల బాకర్ అక్రమ్ అలియాస్ బాబర్.. హైదరాబాద్ ను అడ్డాగా చేసుకుని అనేక నేరాలకు పాల్పడ్డాడు. నగరంలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధుల్లో మొత్తం 102 చైన్ స్నాచింగ్‌లు చేశాడు. గత సంవత్సరం ఎప్రిల్ 12వ తేదీన పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలో మలక్‌పేటకు చెందిన సరస్వతి (61) మహిళ తన బర్తతో కలిసి వెలుతుండగా ఆమె మెడలోనుండి నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు స్నాచింగ్ చేసి పారిపోయాడు. పోలీసుల దగ్గరున్న స్నాచర్ల ఫైల్ ఫోటోలు చూపగా.. సరస్వతి నిందితున్ని గుర్తించింది. దీంతో గతేడాది మేలో వలపన్ని బాబర్ ను చిక్కించుకున్నారు పంజాగుట్ట పోలీసులు. సమగ్ర ఆధారాలను న్యాయస్థానం ముందుంచగా.. మంగళవారం తుది తీర్పు వెలువరించిన నాంపల్లి 16వ మెట్రోపాలిటన్ కోర్టు అక్రమ్ ను దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఒక చైన్ స్నాచర్కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడటం ఇదే మొదటిసారి. కేసుకు సంబంధించిన ఆధారాలు పక్కాగా చూపించిన కోర్టు పోలీసులను, నిందితున్ని పట్టుకున్న క్రైమ్ బ్రాంచ్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
చోటు చూసి.. మాటువేసి!
⇒ సిటీలో స్నాచర్ల పంజా ⇒ జంట కమిషనరేట్లలో రెచ్చిపోయిన చోరులు ⇒ రెండున్నర గంటల వ్యవధిలో నాలుగు చోట్ల.. ⇒ వనస్థలిపురంలో మూడు... సైదాబాద్‌లో ఒకటి ⇒ ‘సేఫ్ కాలనీ’లో ముందస్తు రెక్కీతో పని పూర్తి తుర్కయంజాల్/సైదాబాద్: రాజధానిలో గొలుసు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. రెండున్నర గంటల వ్యవధిలో జంట కమిషనరేట్లలోని నాలుగు చోట్ల పంజా విసిరారు. నలుగురు బాధితుల నుంచి 18 తులాల బంగారు గొలుసులు తెంచుకుపోయారు. స్నాచర్ల బారిన పడిన నలుగురు మహిళల్లో ముగ్గురు వృద్ధులు కావడం గమనార్హం. ఉదయం ఇంటి బయట పనులు చేసుకుంటున్న వాళ్లే గొలుసు చోరుల టార్గెట్ అయ్యారు. నేరాల తీరును బట్టి నాలుగూ ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం 7.20 గంటలకు ఎన్జీఓస్ కాలనీలో మొదలుపెట్టిన ఇరువురు చోరులు 9.45కు సరస్వతి నగర్ కాలనీలో ముగించారు. అదును చూసుకుని రెచ్చిపోతూ... గత ఏడాది నుంచి జంట కమిషనరేట్ల అధికారులు చైన్ స్నాచింగ్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. డెకాయ్ ఆపరేషన్లు, ప్రత్యేక బృందాలతో నిఘా ముమ్మరం చేశారు. దీంతో స్నాచర్లు పంథా మార్చుకుంటూ అధికారులనే బురిడీ కొట్టిస్తున్నారు. పోలీసుల పనితీరు, కదలికలను పూర్తిగా గమనించిన తర్వాతే రంగంలోకి దిగుతున్నారు. దర్జాగా తమ ‘పని’ పూర్తి చేసుకు వెళ్తున్నారు. గత ఏడాది గణేష్ నిమజ్జనం ముగిసిన తర్వాత... గత నె లలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక పోలీసులు రిలాక్స్‌గా ఉండటాన్ని అదునుగా చేసుకుని రెచ్చిపోయారు. తాజాగా సోమవారం పోలీసులు అసెంబ్లీ బందోబస్తుల్లో మునిగి ఉండటం.. మిగిలిన వారు పూర్తిగా విధుల్లోకి రాని సమయాన్ని ఎంపిక చేసుకుని నాలుగు చోట్ల నేరాలకు పాల్పడ్డారు. ‘సేఫ్’లోనూ హల్చల్... సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఎస్ సదన్ సరస్వతి నగర్ సేఫ్ కాలనీ ప్రాజెక్టులో భాగం. ఇక్కడ దాదాపుగా కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. సరస్వతీ శిశు మందిర్ నుంచి సింగరేణి కాలనీకి వెళ్లే ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు. ఈ విషయం గుర్తించిన స్నాచర్లు సింగరేణి కాలనీ నుంచి నేరుగా ఎస్బీహెచ్ పక్కన ఉన్న రోడ్డులోకి వచ్చి... మొదటి వీధిలో పంజా విసిరారు. అక్కడ దామెరమ్మ మెడలోని గొలుసు తస్కరించారు. సీసీ కెమెరాకు చిక్కుతామనే ఉద్దేశంతో అక్కడి నుంచి సైదాబాద్ ప్రధాన రహదారి వైపు రాకుండా తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే పక్కా ప్రొఫెషనల్స్ రెక్కీ తర్వాత పంజా విసిరినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వనస్థలిపురంలో ‘కనపడని’ పోలీసులు... వనస్థలిపురం ఠాణా పరిధిలో సోమవారం ఉదయం 7.20 గంటలకు మొదటి గొలుసు చోరీజరిగింది. ఇది తెలిసినప్పటికీ పోలీసులు అప్రమత్తం కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగానే వరుసగా మరో రెండు ఘటనలు జరిగాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. చైన్ స్నాచింగ్‌లు జరిగినా... కొన్ని గంటల వరకు ఏ ప్రధాన కూడలిలోనూ పోలీసుల జాడ కనిపించలేదు. వరుస చోరీలు ఇలా... ఉదయం 7.20 గంటలు.. ఎన్జీవోస్ కాలనీ, ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ సమీపంలో తేత గణపతి భార్య అలివేలు మంగ (50) ఇంటి ముందు వాకిలి ఊడ్చి ఇంట్లోకి వెళ్తుండగా... వెనుక నుంచి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని ఐదున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిపోయారు. పెయింటింగ్‌పై ఆరా తీస్తూ... ‘ఇంటికి పెయింటింగ్ డిజైన్ ఎవరు వేశారని ఓ వ్యక్తి హిందీలో అడిగాడు. చెప్పేలోపే వెనుక నుంచి గొలుసును లాగేందుకు ప్రయత్నిస్తుండగా అప్రమత్తమయ్యా. అప్పటికే మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉండడంతో మరొకడు గొలుసు తెంచుకుని పారిపోయారు. ‘దొంగ.. దొంగ’ అని అరిచినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. - అలివేలు ఉదయం 8.10 గంటలు.. ఎన్జీవోస్ కాలనీ, వివేకానంద పార్కు ఏరియా.. దాస్యం కుసుమ కుమారి (70) ఇంట్లో నుంచి బయటకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును లాగేశాడు. సమీపంలో ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి పరారయ్యాడు. ఇంట్లోకి వెళుతుండగా... ఇంటి బయటకు వచ్చి మళ్లీ తిరిగి వెళ్తుండగా తెల్లటి రంగు, గుండ్రటి ముఖం కలిగిన ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చాడు. తేరుకునే లోపే మెడలోని గొలుసు లాక్కుపోయాడు. రెండో వ్యక్తిని స్పష్టంగా చూడలేదు. - కుసుమ కుమారి ఉదయం 8.50 గంటలు.. ద్వారకామయి నగర్... కమలానగర్ వాసిషాబాద్ అశోక్ భార్య కృష్ణవేణి (30) తమ పిల్లలను సిద్ధార్థ పాఠశాలలో వదిలారు. ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తుండగా... ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని వెళ్లిపోయారు. ముందే గమనించినట్టున్నారు పిల్లలను స్కూల్ దగ్గర వదిలి తిరిగి వస్తున్నా. బైక్‌పై వెనుక నుంచి వచ్చి గొలుసు లాక్కుపోయారు. పాఠశాలకు వెళ్లేటప్పుడే వాళ్లు గమనించారనే అనుమానం ఉంది. - కృష్ణవేణి ఉదయం 9.45 గంటలు, ఐఎస్ సదన్ సరస్వతి నగర్ కాలనీ... ఇంటి ముందు పూల కుండీలో వేయడానికి ఎర్రమట్టి తేవడానికి వెళ్తున్న వృద్ధురాలు సంపత్ దామెరమ్మ (70) మెడలో ఉన్న అయిదు తులాల బంగారు ఆభరణాలను బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తెంచుకుపోయారు. ఆమె కింద పడటంతో మెడపై సల్ప గాయాలయ్యాయి. ఏదీ రక్షణ? ఇంటి ముందు ఉన్న మహిళలకు కూడా రక్షణ లేకుంటే ఎలా. ఇంక బయటకు వెళ్తే ఎవరికి రక్షణ ఉంటుంది? పోలీసులు కేసును త్వరగా కొలిక్కి తెచ్చి నా బంగారాన్ని తిరిగి అప్పగించాలి. - దామెరమ్మ -
మళ్లీ రెచ్చిపోయారు
హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. కొద్ది రోజుల కిందట చోటుచేసుకున్న వరుస దురాగతాల మాదిరే శుక్రవారం రాత్రి కూడా ఐదు చోట్ల గొలుసులు చోరీ చేశారు. ఎంజీబీఎస్, మాదాపూర్, పురానాపూల్, బన్సీలాల్ పేట, నారాయణ గూడాల్లో ఐదుగురు మహిళల మెడల్లోని బంగారు గొలుసుల్ని ఎత్తుకెళ్లారు. కాగా, ఇన్నాళ్లూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే చైన్ స్నాచింగ్ లు ఇప్పుడు ఎంజీబీఎస్ వంటి అత్యంత రద్దీ ప్రదేశాల్లోనూ చోటుచేసుకుంటూ ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసులు ఇంకాస్త సమర్థవంతంగా వ్యవహరించి సిటీలోని చైన్ స్నాచర్ల భరతం పట్టాలని జనం కోరుతున్నారు. -
చైన్‌స్నాచర్ల కట్టడికి త్రిముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చైన్‌స్నాచర్ల కట్టడికి పోలీసులు పక్కా చర్యలు చేపట్టారు. పట్టణాలు, నగరాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు లాక్కెళుతున్న దొంగల కట్టడికి త్రిముఖ వ్యూహం రూపొందించారు. పట్టణాలు, నగరాల్లోకి ప్రవేశించే రహదారులపై ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వచ్చిపోయే వాహనాలపై నిఘా ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా హైదరాబాద్‌లో 150 సీసీ, ఆపైన ఇంజన్ సామర్థ్యమున్న బైక్‌లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. ఇక చైన్ స్నాచింగ్‌లలో ఎక్కువగా అంతర్రాష్ట్ర దొంగల హస్తముందని వెల్లడైన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌పై దృష్టి కేంద్రీకరించారు. ఇక ఇప్పటివరకు చైన్ స్నాచింగ్‌కు పాల్పడితే కేవలం చోరీ కేసులే నమోదు చేస్తుండడంతో దొంగలు కొద్ది రోజులకే బయటకొచ్చేవారు. దీంతో చైన్ స్నాచర్లపై పీడీ యాక్టు (ప్రివెంటివ్ డిటెన్షన్) కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా ఏడాది పాటు జైల్లో ఊచలు లెక్కపెట్టక తప్పదు. పైస్థాయి నుంచి ఆదేశాలు.. ఇటీవల శాసనమండలిలో చైన్ స్నాచింగ్‌లపై జరిగిన చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు నిలదీయడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. దీంతో చైన్ స్నాచర్లపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ పెద్దలు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే చైన్ స్నాచర్లపై ఉక్కు పాదం మోపాలని పోలీసులు నిర్ణయించారు. చైన్ స్నాచర్లపై చోరీ కేసులు మాత్రమే నమోదు చేస్తుండడంతో వారు సులభంగా బెయిల్ పొంది బయటకొచ్చేవారు. దీంతో ఇక నుంచి చైన్స్నాచర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా వారు కనీసం ఏడాది పాటు జైల్లో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అయితే దొంగతనానికి పాల్పడుతూ తొలిసారి పట్టుబడిన వారిపై పీడీ యాక్టు నమోదు చేసే అవకాశం ఉండదు. అలాంటి వారిపై దోపిడీ నేరాల కింద కేసులు పెట్టి ఆర్నెల్ల పాటు జైల్లో ఉండేలా చర్యలు చేపట్టారు. అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నది అంతర్రాష్ట్ర దొంగల ముఠాయేనని పోలీసులకు సమాచారం ఉంది. ఇటీవల నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి పారిపోతున్న ఒక ముఠాను బిక్కనూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఉత్తరప్రదేశ్, బిహార్‌లకు చెందిన దొంగల ముఠాలు డీసీఎం వాహనాలలో ద్విచక్ర వాహనాలను తీసుకొచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో వారికి అడ్డుకట్ట వేయడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణాలు, నగరాల్లోకి ప్రవేశించే రహదారులపై నిఘా పెట్టాలని.. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం, సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేయడం వంటివి చేపట్టనున్నారు. పట్టణాలు, నగరాలలో ప్రత్యేక బృందాలతో అంతర్గత తనిఖీలను కూడా ముమ్మరం చేశారు. -
జల్సాల కోసం చోరీల బాట
గోల్కొండ: జల్సాలకు అలవాటుపడి స్నాచింగ్, సెల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ఓ విద్యార్థుల గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. వారికి బాస్‌గా వ్యవరిస్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగితోపాటు ఇద్దరు మైనర్ విద్యార్థులు కూడా ఉన్నారు. గోల్కొండ ఇన్ స్పెక్టర్ ఖలీల్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకి జానకినగర్‌కు చెందిన మహ్మద్ ఫర్మాన్ (18) ప్రైవేట్ షాపులో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. కొంత కాలం క్రితం అతడికి పారామౌంట్ కాలనీకి చెందిన ఎంఏ అక్రం (19) తో పరిచయమైంది. అక్రం ప్రైవేట్ కాలేజిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బులు సరిపోక పోవడంతో సులువైన చైన్‌స్నాచింగ్ బాటపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను ఇద్దరూ 17 ఏళ్ల విద్యార్థులను తమతో కలుపుకున్నారు. నలుగురూ కలిసి గోల్కొండ, ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఈ గ్యాంగ్ టూంబ్స్ చౌరస్తా వద్ద ఉందని గోల్కొండ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై పి.వాసుదేవ్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి వారిని పటుకున్నారు. మార్నింగ్ వాక్కు వచ్చే వారి ఫోన్లను చోరీ చేయటానికే తామక్కడికి వచ్చామంటూ వారు విచారణలో వెల్లడించారు. వారి వద్దనుంచి రెండు బైకులు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
చెలరేగిపోతున్న చైన్ స్నాచర్లు
జిల్లాలో చైన్‌స్నాచర్లు చెలరేగి పోతున్నారు. అదునుచూసి ఆడవారి మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. గుడికెళ్లాలన్నా.. బడికెళ్లాలన్నా.. చివరకు ఇంటి ముంగిట ముగ్గు వేయాలన్నా.. ఏ క్షణంలో దుండగులు వచ్చి దురాగతానికి పాల్పడతారో అనే భయం మహిళలను వెంటాడుతోంది. కేసులు నమోదు చేయడం మినహా పోలీసులు చేసిందేమీ లేదనే విమర్శలున్నాయి. కడప అర్బన్ : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లు పెరిగిపోయాయి. మహిళలు ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లాలన్నా, దేవాలయాలకు వెళ్లాలన్నా, పాఠశాలలకు వెళ్లి తమ పిల్లలకు భోజనాలు పెట్టి తిరిగి ఇళ్లకు రావాలన్నా బెంబేలెత్తిపోతున్నారు. ఒకవైపు జిల్లా పోలీసు యంత్రాంగం ఎర్రచందనం అక్రమ రవాణా నివారించేందుకు టాస్క్‌ఫోర్స్ పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స్మగ్లర్లను పట్టుకునే పనిలో బిజీగా ఉంది. మరోవైపు గోదావరి పుష్కరాలు ప్రారంభం కావడంతో జిల్లా నుంచి దాదాపు వెయ్యి మంది పోలీసులు, సిబ్బంది, అధికారులు బందోబస్తు నిమిత్తం వెళ్లారు. ఇదే అదనుగా భావించిన కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి నిరంతరం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. పోలీసులు మాత్రం ప్రత్యేక నిఘా వేసి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని పులివెందుల, కమలాపురం, కడప, ఇతర పట్టణాల్లో ఈనెల 1వ తేది నుంచి ఇప్పటివరకు జరిగిన చైన్ స్నాచింగ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 6వ తేదిన పులివెందులలోని ఎస్బీఐ కాలనీలో ఉమామహేశ్వరి అనే బ్యాంకు ఉద్యోగినిమహిళ మెడలోని మూడు తులాల బంగారు ఆభరణాన్ని లాక్కెళ్లారు. అదేరోజు కమలాపురం పరిధిలో కోగటం-ప్రొద్దుటూరు దారిలో లక్ష్మిదేవి అనే మహిళ తన చెల్లెలు అరుణ, మరిది సుధాకర్‌తో కలిసి మోటారు సైకిల్‌పై వెళుతుండగా ముగ్గురు యువకులు మోటారు సైకిల్‌పై వచ్చి బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. ఈనెల 7వ తేదిన కడప నగరంలో ఎర్రముక్కపల్లెకు చెందిన లావణ్య అనే విద్యుత్ ఉద్యోగిని మెడలోని నాలుగు తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. కొన్ని గంటల వ్యవధిలోనే హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన నాగ రమాదేవి అనే మహిళ స్కూలు వద్ద తన పిల్లలకు భోజనం పెట్టి తిరిగి ఇంటికి వెళ్తుండగా బంగారు చైన్‌ను మోటారు సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. ఈనెల 11వ తేది ఆదిలక్ష్మి అనే మహిళ కో ఆపరేటివ్ కాలనీలో నడుచుకుంటూ వెళుతుండగా ముగ్గురు యువకులు మోటారు సైకిల్‌పై వచి 30 గ్రాముల బంగారు ఆభరణాన్ని దోచుకెళ్లారు. ఈనెల 13వ తేది కడప బిల్టప్ వద్ద ఉన్న అజ్మత్ కల్యాణ మండపం సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మహాలక్ష్మి అనే వృద్ధురాలి మెడలో నుంచి వెనుక నుంచి వేగంగా నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి రెండు బంగారు చైన్లను లాక్కొని కొంతదూరంలో మోటారు సైకిల్‌పై సిద్ధంగా ఉన్న ఇద్దరితో కలిసి పరారయ్యాడు. ఆయా సంఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారుగానీ, విచారణ అంతంత మాత్రమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని ఎన్నిమార్లు చెప్పినా తమ మాటలు పట్టించుకోవడం లేదని పోలీసులు మహిళలనే తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు చైన్ స్నాచింగ్‌లపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. కడప డీఎస్పీ వివరణ చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గట్టి చర్యలు చేపడుతున్నామని కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తెలిపారు. -
జిల్లాలో ఇరానీ గ్యాంగ్ హల్చల్
రోజుకోచోట చైన్‌స్నాచింగ్‌లు ఊహాచిత్రం విడుదల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు కోల్‌సిటీ : ‘జిల్లాలో ఇరానీ గ్యాంగ్ చొరబడింది. అప్రమత్తంగా ఉండండి. గ్యాంగ్‌లోని మనుషులు ఇలాగే ఉంటారు’ అంటూ గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఆరె వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం నిందితుల ఊహాచిత్రంను విడుదల చేశారు. ఇటీవల కాలంలో వరుసగా మహిళల మెడలోని బంగారు పుస్తెలతాళ్లు తెంపుకుపోతున్న సంఘటనలు కళకలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా రోజుకోచోట చైన్‌స్నాచింగ్ జరుగుతోంది. చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న వారు ఇరానీ గ్యాంగ్‌కు చెందినవారేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కరీంనగర్‌తోపాటు నిజామాబాద్, మెదక్‌లోని సిద్దిపేట ప్రాంతాల్లో ఇరానీ గ్యాంగ్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానం రాకుండా... నిందితులు ఎక్కువగా ఖరీదైన ద్విచక్రవాహనాలు ఉపయోగిస్తుంటారు. ైబైక్‌లపై ఇద్దరు కూర్చొని ప్రయాణిస్తుంటారు. కొందరైతే మాస్క్‌లు ధరిస్తుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా బైక్‌పై సరదాగా మాట్లాడుకుంటున్నట్లు నటిస్తూ తిరుగుతుంటారు. ఎక్కువగా నిర్మాణుశ్యమైన ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఇరానీ గ్యాంగ్‌తోపాటు కొందరు స్థానిక యువకులు కూడా చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఒంటిరి మహిళలే టార్గెట్... జనసంచారం లేని రోడ్లపై, కాలనీలలో ఒంటిరిగా వెళ్తున్న మహిళలనే గ్యాంగ్ టార్గెట్ చేస్తోంది. అలాగే ఇంటి ముందు ఒంటరిగా ఇంటి పనులు చేస్తున్న మహిళలను కూడా నిందితులు టార్గెట్ చేస్తున్నారు. అడ్రస్ చెప్పండంటూ మాట్లాడుతూనే.. మెడలోని బంగారు పుస్తెలతాడును తెంపుకుని పారిపోతుంటారు. ఈనెల 11న పెద్దపల్లిలోని సాయిబాబా దేవాలయం సమీపంకు చెందిన సుమతి తెల్లవారుజామున వాలికి ఊడుస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ‘ఏ రస్తా కిదర్‌జాతా’ అంటూ హిందీలో అడిగారు. సమాధానం చెప్పేలోగా ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును తెంపుకుని పారిపోయారు. గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి వెళ్ళే దారిలో ఈనెల 10న రాత్రి లక్ష్మి అనే మహిళ ఆస్పత్రికి వస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని పుస్తెలతాడును తెంపుకుని పారిపోయారు. గోదావరిఖని చంద్రబాబుకాలనీకి చెందిన ఆడెపు లక్ష్మి ఈనెల 11న ఇంటి ఎదుట పనులు చేసుకుంటూ ఉండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ అడ్రస్ చెప్పని అమాయకంగా అడిగారు. మహిళ అడ్రస్ తెలియదని చెప్పేలోగా ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడు తెంపుకుని పారిపోయారు. ఈనెల 17న గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన లక్ష్మి నడుచుకుంటూ వస్తుండగా.. ఆమె వెనకనుంచి ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చారు. అకస్మాత్తుగా ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు తెంపుకుపోయారు. ఈనెల 8న గోదావరిఖని యైంటిక్లైయిన్‌కాలనీలోని ఓ కిరాణ దుకాణం నిర్వహించే మహిళను నీళ్లప్యాకెట్ కావాలని అడిగి మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. అప్రమత్తంగా ఉండండి..: డీఎస్పీ చైన్‌స్నాచింగ్‌లపట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని డీఎస్పీ ఎస్.మల్లారెడ్డి సూచిం చా రు. మహిళలు విలువైన ఆభరణాలు ధరించి ఒంటిరిగా బయటకు వెళ్లొదని అన్నారు. ఆభరణాలతో బయటకు వెళ్లినప్పుడు మెడచుట్టూ చీర కొంగు కప్పుకోవాలన్నారు. కుటుం బ సభ్యులను తోడుగా తీసుకుపోవాలన్నారు. ము ఖ్యంగా తెల్లవారుజామునమహిళలు ఇంటి ఎదు ట వాకిలి ఊడ్చే సమయంలో కానీ.. ఇంటి పనులు చేసుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చిరునామా కోసం అడిగితే నమ్మవద్దన్నారు. అపరి చితులు తారసపడితే వెంటనే 100 కుఫోన్‌చేయాలనిసూచించారు. -
అరగంటలో నాలుగు దొంగతనాలు
అది మచిలీపట్నంలోని కలెక్టర్ బంగళా వెనుక రోడ్డు.. మంగళవారం తెల్లవారుజాము సమయం.. సీఎస్ఆర్ నగర్‌కు చెందిన లక్ష్మీరత్నకుమారి వాకింగ్ చేస్తున్నారు.. ఇంతలో మోటార్ సైకిల్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకునే ప్రయత్నం చేశారు.. ప్రతిఘటించిన ఆమెను రోడ్డుపై పడేసి గొలుసు లాక్కుపోయారు.. ఇంగ్లిషుపాలెంలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మరో మహిళ వద్ద.. ఈడేపల్లిలో, బైపాస్ రోడ్డులోని మాచవరంలో మరో ఇద్దరి వద్ద.. ఇదే తరహాలో గొలుసు చోరీలు చేశారు. ఒకేరోజు అరగంట వ్యవధిలో వరుసగా చోరీలు జరగడం పట్టణంలో సంచలనం రేపింది. ఈ ఘటనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు చోట్ల వరుస గొలుసు దొంగతనాల ఘటనలు జరిగాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వాకింగ్ చేస్తుండగా వాహనంపై వచ్చి ... పట్టణంలోని సీఎస్ఆర్ నగర్‌కు చెందిన క్రోవి లక్ష్మీరత్నకుమారి కలెక్టర్ బంగ్లా వెనుకరోడ్డులో మంగళవారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా మోటార్‌సైకిల్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 26 గ్రాముల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు. ఆమె ప్రతిఘటించటంతో రోడ్డుపై పడేసి మెడలోని గొలుసును లాక్కుపోయారు. అడ్రస్‌లు అడిగి.. ఆదమరిపించి.. ఇంగ్లిషుపాలెంకు చెందిన మాదిరెడ్డి ఉమాసుందరి తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న నాలుగు కాసుల (32 గ్రాములు) గొలుసును తెంచుకుని పోయారు. అనంతరం ఈడేపల్లికి చెందిన వేముల భారతరాజేశ్వరి ఇంటిముందు ముగ్గు వేస్తుండగా బైక్‌పై ఇద్దరు దుండగులు వచ్చారు. వారిలో ఒకడు తనవద్ద ఉన్న చిన్న కాగితం చూపి ఫలానా పేరున్న వ్యక్తి ఇల్లు ఇదేనా? అని అడిగాడు. ఆ పేరుగలవారు ఇక్కడ ఎవరూ లేరనే సమాధానం ఇచ్చే లోపుగానే రాజేశ్వరి మెడలో ఉన్న మూడు సవర్ల (24గ్రాములు) బంగారు గొలుసును లాక్కుపోయారు. బైపాస్ రోడ్డులోని మాచవరంలో ఉంటు న్న కాగిత సూరమ్మ అనే వృద్ధురాలు ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఇద్దరు దుండగులు వచ్చారు. వారిలో ఒకడు ఆమె వద్దకు వచ్చి ఒకరి అడ్రస్‌ను హిందీలో అడిగాడు. తనకు హిందీ రాదని.. భర్తను పిలుస్తానంటూ ఇంట్లోకి వెళ్లబోతున్న సూరమ్మపై దాడి చేశాడు. ఆమె మెడలోని ఆరు సవర్ల (48గ్రాములు) రెండు పేటల నానుతాడును మంగళసూత్రాలతో సహా తెంచుకున్నాడు. వెంటనే ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. ఈ నాలుగు ఘటనల్లో ఇద్దరు యువకులు పాల్గొన్నారు. వారిలో ఒకడు గొలుసులు తెంచుకుని సమీపంలో ఉన్న బైక్‌పైకి ఎక్కాడు. దానిపై అప్పటికే సిద్ధంగా ఉన్న మరో యువకుడితో కలిసి రెప్పపాటులో మాయమయ్యారని బాధితులు చెబుతున్నారు. పోలీసు బృందాల గాలింపు పట్టణంలో గత జూన్ 16వ తేదీ తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో ఇదే తరహాలో వరుస చోరీలు జరిగాయి. అప్పట్లో పలువురు మహిళల నుంచి సుమారు 109 గ్రాముల విలువ చేసే బంగారు ఆభరణాలను ఇద్దరు యువకులు సినీ ఫక్కీలో అపహరించుకుపోయారు. అదే ముఠా మళ్లీ ఈ చోరీలకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ఆరా తీస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. ఈ బృందాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బాధితుల నుంచి వివరాలు సేకరించిన డీఎస్పీ చైన్‌స్నాచింగ్‌ల వరుస ఘటనలు పట్టణ ప్రజల్లో కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న పలువురు వాకింగ్‌ను మానివేసి హుటాహుటిన ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనలపై సమాచారం అందుకున్న డీఎస్పీ కె.వి.శ్రీనివాసరావు హుటాహుటిన బాధితుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. నేరస్తులకు సంబంధించి బాధితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే దుండగులు ఒక్కసారిగా గొలుసులు తెంచుకుపోతుండటంతో ఆందోళనకు గురై వారిని సరిగా పసిగట్టలేకపోయామని బాధితులు తెలిపారు. దీంతో ఆయన పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో పుటేజీలను పరిశీలించి, నిందితుల ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నించారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో రెండు పోలీసు ప్రత్యేక బృందాలనుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. కాగా ఈ చోరీలన్నీ చిలకలపూడి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగాయి. బాధితులంతా అదే స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
నెలరోజుల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ‘నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. నెల రోజుల్లో మీరే చూస్తారు.. ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతామో. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం అంటే అక్కడక్కడా కానిస్టేబుళ్లను పెడితే సరిపోదు. ఆధునిక పరిజ్ఞానాన్ని, పద్ధతులను వినియోగించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది’ అని నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నగర కమిషనరేట్ స్థాయి పెంపు, నేరాలకు అడ్డుకట్ట తదితర అంశాలపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి : కమిషనరేట్ పరిధి 80 కిలోమీటర్ల మేర పెరిగే అవకాశం ఉందంటున్నారు? సీపీ : ఇప్పటికిప్పుడే దీనిపై వ్యాఖ్యానించడం మంచిది కాదు. ఈ నెలాఖరులోగా రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కమిషనరేట్ పరిధి ఎలా ఉండాలి, సిబ్బంది, విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో ఇస్తుంది. అప్పటి వరకు ఇంతే. ఇప్పటికిప్పుడు విషయాన్ని స్పెక్యులేట్ చేస్తే కొందరికి మంచి జరిగితే, కొందరికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. సాక్షి : నగరంలో ఆర్థిక నేరాలు పెరిగాయి. పలు చిట్ఫండ్సంస్థల మూసివేతతో రూ.500 కోట్ల మేర ప్రజలు నష్టపోయారు. భవిష్యత్తులో ఇటువంటివి జరగక్కుండా ఏం చేయబోతున్నారు? సీపీ : ఈ విషయంలో మోసపోతున్న వారి బాధ్యత కూడా కొంత ఉంది. ప్రారంభంలో తెలియక రిజిస్టర్ కాని సంస్థల్లో సభ్యులుగా చేరారంటే అర్థం ఉంది. మోసాలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత కూడా దురాశకుపోయి స్కీములు, చిట్స్‌లో చేరి మోసపోయేవాళ్లకు సాయం చేయమంటే ఎలా? తప్పుడు కంపెనీల్లో పెట్టుబడి పెడితే పోలీసుశాఖ మాత్రం ఏం చేస్తుంది. పోలీసు యంత్రాంగం వీటి పైనే దృష్టిసారిస్తే దౌర్జన్యాలు, దొంగతనాలు, అల్లర్లను అరికట్టేది ఎవరు? సాక్షి : నగర విస్తరణతో పాటు వ్యాపారాలు విస్తరించాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా పరంగా తీసుకునే చర్యలు ఏంటి? సీపీ : వ్యాపార సముదాయాలకు వచ్చే వారికి భద్రత కలిపించాల్సిన బాధ్యత ఆయా సంస్థల యాజమాన్యాలదే. ఇది ఎస్టాబ్లిష్ చట్టంలోనే ఉంది. ఖచ్చితంగా వారు రక్షణ చర్యలు తీసుకునేలా చూస్తాము. ఇక బహిరంగ ప్రదేశాల్లో పౌరుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సాక్షి : గొలుసు దొంగతనాలు (చైన్ స్నాచింగ్స్) నిలువరించేందుకు ఏ చర్యలు తీసుకుంటారు? సీపీ : ఇది మాకో ముఖ్యమైన సవాల్, గొలుసు దొంగతనాల్లో విద్యార్థులు, కొందరు యువ కానిస్టేబుళ్ల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. ఇంటికి కన్నం వేసి రూ.లక్షలు కాజేసిన దానికంటే ఇది తీవ్రమైన నేరం. ఇలాంటి చోరీలు మహిళలను భయానక స్థితిలోకి నెడతాయి. చైన్ స్నాచింగ్స్‌ను నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతాం.