చైన్‌స్నాచర్ల కట్టడికి త్రిముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చైన్‌స్నాచర్ల కట్టడికి పోలీసులు పక్కా చర్యలు చేపట్టారు. పట్టణాలు, నగరాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు లాక్కెళుతున్న దొంగల కట్టడికి త్రిముఖ వ్యూహం రూపొందించారు. పట్టణాలు, నగరాల్లోకి ప్రవేశించే రహదారులపై ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వచ్చిపోయే వాహనాలపై నిఘా ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా హైదరాబాద్‌లో 150 సీసీ, ఆపైన ఇంజన్ సామర్థ్యమున్న బైక్‌లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు.
ఇక చైన్ స్నాచింగ్‌లలో ఎక్కువగా అంతర్రాష్ట్ర దొంగల హస్తముందని వెల్లడైన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌పై దృష్టి కేంద్రీకరించారు. ఇక ఇప్పటివరకు చైన్ స్నాచింగ్‌కు పాల్పడితే కేవలం చోరీ కేసులే నమోదు చేస్తుండడంతో దొంగలు కొద్ది రోజులకే బయటకొచ్చేవారు. దీంతో చైన్ స్నాచర్లపై పీడీ యాక్టు (ప్రివెంటివ్ డిటెన్షన్) కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా ఏడాది పాటు జైల్లో ఊచలు లెక్కపెట్టక తప్పదు.
పైస్థాయి నుంచి ఆదేశాలు..
ఇటీవల శాసనమండలిలో చైన్ స్నాచింగ్‌లపై జరిగిన చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు నిలదీయడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. దీంతో చైన్ స్నాచర్లపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ పెద్దలు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే చైన్ స్నాచర్లపై ఉక్కు పాదం మోపాలని పోలీసులు నిర్ణయించారు. చైన్ స్నాచర్లపై చోరీ కేసులు మాత్రమే నమోదు చేస్తుండడంతో వారు సులభంగా బెయిల్ పొంది బయటకొచ్చేవారు. దీంతో ఇక నుంచి చైన్‌స్నాచర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా వారు కనీసం ఏడాది పాటు జైల్లో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అయితే దొంగతనానికి పాల్పడుతూ తొలిసారి పట్టుబడిన వారిపై పీడీ యాక్టు నమోదు చేసే అవకాశం ఉండదు. అలాంటి వారిపై దోపిడీ నేరాల కింద కేసులు పెట్టి ఆర్నెల్ల పాటు జైల్లో ఉండేలా చర్యలు చేపట్టారు.
అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి
వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నది అంతర్రాష్ట్ర దొంగల ముఠాయేనని పోలీసులకు సమాచారం ఉంది. ఇటీవల నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి పారిపోతున్న ఒక ముఠాను బిక్కనూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఉత్తరప్రదేశ్, బిహార్‌లకు చెందిన దొంగల ముఠాలు డీసీఎం వాహనాలలో ద్విచక్ర వాహనాలను తీసుకొచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో వారికి అడ్డుకట్ట వేయడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణాలు, నగరాల్లోకి ప్రవేశించే రహదారులపై నిఘా పెట్టాలని.. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం, సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేయడం వంటివి చేపట్టనున్నారు. పట్టణాలు, నగరాలలో ప్రత్యేక బృందాలతో అంతర్గత తనిఖీలను కూడా ముమ్మరం చేశారు.