'సెంచరీ' అక్రమ్ @ ఏడేళ్లు జైలు
హైదరాబాద్: క్రికెట్ ఫీవర్ లో నిండా మునిగిపోయాం కదా మనకు తెలియకుండా సెంచరీ చేసిన అక్రమ్ ఎవరబ్బా! అనుకుంటున్నారా? క్రికెటర్లు స్టేడియంలలో సెంచరీలు కోడితే.. ఈ ప్రబుద్ధుడు మాత్రం మహిళల మెడల్లోనుంచి బంగారు గొలుసులు గుంజటంలో సెంచరీ చేశాడు. ఏకంగా 102 చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. వీడికి మరో ఘనత కూడా ఏడ్చిందిమరి. అదేమంటేజజ చైన్ స్నాచర్లలో మొట్టమెదటిసారి ఏడేళ్లు జైలు శిక్షగు గురైందీ అక్రమే. ఇతడి గొలుసు గుంజుడు సంగతుల గురించి పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు చెప్పుకొచ్చారిలా..
కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల బాకర్ అక్రమ్ అలియాస్ బాబర్.. హైదరాబాద్ ను అడ్డాగా చేసుకుని అనేక నేరాలకు పాల్పడ్డాడు. నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధుల్లో మొత్తం 102 చైన్ స్నాచింగ్‌లు చేశాడు. గత సంవత్సరం ఎప్రిల్ 12వ తేదీన పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలో మలక్‌పేటకు చెందిన సరస్వతి (61) మహిళ తన బర్తతో కలిసి వెలుతుండగా ఆమె మెడలోనుండి నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు స్నాచింగ్ చేసి పారిపోయాడు. పోలీసుల దగ్గరున్న స్నాచర్ల ఫైల్ ఫోటోలు చూపగా.. సరస్వతి నిందితున్ని గుర్తించింది. దీంతో గతేడాది మేలో వలపన్ని బాబర్ ను చిక్కించుకున్నారు పంజాగుట్ట పోలీసులు.
సమగ్ర ఆధారాలను న్యాయస్థానం ముందుంచగా.. మంగళవారం తుది తీర్పు వెలువరించిన నాంపల్లి 16వ మెట్రోపాలిటన్ కోర్టు అక్రమ్ ను దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఒక చైన్ స్నాచర్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడటం ఇదే మొదటిసారి. కేసుకు సంబంధించిన ఆధారాలు పక్కాగా చూపించిన కోర్టు పోలీసులను, నిందితున్ని పట్టుకున్న క్రైమ్ బ్రాంచ్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.