చెలరేగిపోతున్న చైన్ స్నాచర్లు
జిల్లాలో చైన్‌స్నాచర్లు చెలరేగి పోతున్నారు. అదునుచూసి ఆడవారి మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. గుడికెళ్లాలన్నా.. బడికెళ్లాలన్నా.. చివరకు ఇంటి ముంగిట ముగ్గు వేయాలన్నా.. ఏ క్షణంలో దుండగులు వచ్చి దురాగతానికి పాల్పడతారో అనే భయం మహిళలను వెంటాడుతోంది. కేసులు నమోదు చేయడం మినహా పోలీసులు చేసిందేమీ లేదనే విమర్శలున్నాయి.
కడప అర్బన్ : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లు పెరిగిపోయాయి. మహిళలు ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లాలన్నా, దేవాలయాలకు వెళ్లాలన్నా, పాఠశాలలకు వెళ్లి తమ పిల్లలకు భోజనాలు పెట్టి తిరిగి ఇళ్లకు రావాలన్నా బెంబేలెత్తిపోతున్నారు. ఒకవైపు జిల్లా పోలీసు యంత్రాంగం ఎర్రచందనం అక్రమ రవాణా నివారించేందుకు టాస్క్‌ఫోర్స్ పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స్మగ్లర్లను పట్టుకునే పనిలో బిజీగా ఉంది. మరోవైపు గోదావరి పుష్కరాలు ప్రారంభం కావడంతో జిల్లా నుంచి దాదాపు వెయ్యి మంది పోలీసులు, సిబ్బంది, అధికారులు బందోబస్తు నిమిత్తం వెళ్లారు. ఇదే అదనుగా భావించిన కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి నిరంతరం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. పోలీసులు మాత్రం ప్రత్యేక నిఘా వేసి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని పులివెందుల, కమలాపురం, కడప, ఇతర పట్టణాల్లో ఈనెల 1వ తేది నుంచి ఇప్పటివరకు జరిగిన చైన్ స్నాచింగ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఈనెల 6వ తేదిన పులివెందులలోని ఎస్‌బీఐ కాలనీలో ఉమామహేశ్వరి అనే బ్యాంకు ఉద్యోగినిమహిళ మెడలోని మూడు తులాల బంగారు ఆభరణాన్ని లాక్కెళ్లారు.
అదేరోజు కమలాపురం పరిధిలో కోగటం-ప్రొద్దుటూరు దారిలో లక్ష్మిదేవి అనే మహిళ తన చెల్లెలు అరుణ, మరిది సుధాకర్‌తో కలిసి మోటారు సైకిల్‌పై వెళుతుండగా ముగ్గురు యువకులు మోటారు సైకిల్‌పై వచ్చి బంగారు చైన్‌ను లాక్కెళ్లారు.
ఈనెల 7వ తేదిన కడప నగరంలో ఎర్రముక్కపల్లెకు చెందిన లావణ్య అనే విద్యుత్ ఉద్యోగిని మెడలోని నాలుగు తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లారు.
కొన్ని గంటల వ్యవధిలోనే హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన నాగ రమాదేవి అనే మహిళ స్కూలు వద్ద తన పిల్లలకు భోజనం పెట్టి తిరిగి ఇంటికి వెళ్తుండగా బంగారు చైన్‌ను మోటారు సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు.
ఈనెల 11వ తేది ఆదిలక్ష్మి అనే మహిళ కో ఆపరేటివ్ కాలనీలో నడుచుకుంటూ వెళుతుండగా ముగ్గురు యువకులు మోటారు సైకిల్‌పై వచి 30 గ్రాముల బంగారు ఆభరణాన్ని దోచుకెళ్లారు.
ఈనెల 13వ తేది కడప బిల్టప్ వద్ద ఉన్న అజ్మత్ కల్యాణ మండపం సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మహాలక్ష్మి అనే వృద్ధురాలి మెడలో నుంచి వెనుక నుంచి వేగంగా నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి రెండు బంగారు చైన్లను లాక్కొని కొంతదూరంలో మోటారు సైకిల్‌పై సిద్ధంగా ఉన్న ఇద్దరితో కలిసి పరారయ్యాడు.
ఆయా సంఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారుగానీ, విచారణ అంతంత మాత్రమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని ఎన్నిమార్లు చెప్పినా తమ మాటలు పట్టించుకోవడం లేదని పోలీసులు మహిళలనే తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు చైన్ స్నాచింగ్‌లపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
కడప డీఎస్పీ వివరణ
చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గట్టి చర్యలు చేపడుతున్నామని కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తెలిపారు.