చోటు చూసి.. మాటువేసి! | Snatcher in hyd City | Sakshi
Sakshi News home page

చోటు చూసి.. మాటువేసి!

Published Tue, Mar 15 2016 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

చోటు చూసి.. మాటువేసి!

చోటు చూసి.. మాటువేసి!

సిటీలో స్నాచర్ల పంజా
జంట కమిషనరేట్లలో రెచ్చిపోయిన చోరులు
రెండున్నర గంటల వ్యవధిలో నాలుగు చోట్ల..
వనస్థలిపురంలో మూడు... సైదాబాద్‌లో ఒకటి
‘సేఫ్ కాలనీ’లో ముందస్తు  రెక్కీతో పని పూర్తి

 
 తుర్కయంజాల్/సైదాబాద్:  రాజధానిలో గొలుసు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. రెండున్నర గంటల వ్యవధిలో జంట కమిషనరేట్లలోని నాలుగు చోట్ల పంజా విసిరారు. నలుగురు బాధితుల నుంచి 18 తులాల బంగారు గొలుసులు తెంచుకుపోయారు. స్నాచర్ల బారిన పడిన నలుగురు మహిళల్లో ముగ్గురు వృద్ధులు కావడం గమనార్హం. ఉదయం ఇంటి బయట పనులు చేసుకుంటున్న వాళ్లే గొలుసు చోరుల టార్గెట్ అయ్యారు. నేరాల తీరును బట్టి నాలుగూ ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం 7.20 గంటలకు ఎన్జీఓస్ కాలనీలో మొదలుపెట్టిన ఇరువురు చోరులు 9.45కు సరస్వతి నగర్ కాలనీలో ముగించారు.
 
అదును చూసుకుని రెచ్చిపోతూ...

గత ఏడాది నుంచి జంట కమిషనరేట్ల అధికారులు చైన్ స్నాచింగ్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. డెకాయ్ ఆపరేషన్లు, ప్రత్యేక బృందాలతో నిఘా ముమ్మరం చేశారు. దీంతో స్నాచర్లు పంథా మార్చుకుంటూ అధికారులనే బురిడీ కొట్టిస్తున్నారు. పోలీసుల పనితీరు, కదలికలను పూర్తిగా గమనించిన తర్వాతే రంగంలోకి దిగుతున్నారు. దర్జాగా తమ ‘పని’ పూర్తి చేసుకు వెళ్తున్నారు. గత ఏడాది గణేష్ నిమజ్జనం ముగిసిన తర్వాత... గత నె లలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక పోలీసులు రిలాక్స్‌గా ఉండటాన్ని అదునుగా చేసుకుని రెచ్చిపోయారు. తాజాగా సోమవారం పోలీసులు అసెంబ్లీ బందోబస్తుల్లో మునిగి ఉండటం.. మిగిలిన వారు పూర్తిగా విధుల్లోకి రాని సమయాన్ని ఎంపిక చేసుకుని నాలుగు చోట్ల నేరాలకు పాల్పడ్డారు.

‘సేఫ్’లోనూ హల్‌చల్...
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఎస్ సదన్ సరస్వతి నగర్ సేఫ్ కాలనీ ప్రాజెక్టులో భాగం. ఇక్కడ దాదాపుగా కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. సరస్వతీ శిశు మందిర్ నుంచి సింగరేణి కాలనీకి వెళ్లే ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు. ఈ విషయం గుర్తించిన స్నాచర్లు సింగరేణి కాలనీ నుంచి నేరుగా ఎస్‌బీహెచ్ పక్కన ఉన్న రోడ్డులోకి వచ్చి... మొదటి వీధిలో పంజా విసిరారు. అక్కడ దామెరమ్మ మెడలోని గొలుసు తస్కరించారు. సీసీ కెమెరాకు చిక్కుతామనే ఉద్దేశంతో అక్కడి నుంచి సైదాబాద్ ప్రధాన రహదారి వైపు రాకుండా తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే పక్కా ప్రొఫెషనల్స్ రెక్కీ తర్వాత పంజా విసిరినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.  
 
వనస్థలిపురంలో ‘కనపడని’ పోలీసులు...
వనస్థలిపురం ఠాణా పరిధిలో సోమవారం ఉదయం 7.20 గంటలకు మొదటి గొలుసు చోరీజరిగింది. ఇది తెలిసినప్పటికీ పోలీసులు అప్రమత్తం కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగానే వరుసగా మరో రెండు ఘటనలు జరిగాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. చైన్ స్నాచింగ్‌లు జరిగినా... కొన్ని గంటల వరకు ఏ ప్రధాన కూడలిలోనూ పోలీసుల జాడ కనిపించలేదు.
 
వరుస చోరీలు ఇలా...
ఉదయం 7.20 గంటలు.. ఎన్జీవోస్ కాలనీ, ఆర్‌ఎస్‌ఎస్ గ్రౌండ్ సమీపంలో తేత గణపతి భార్య అలివేలు మంగ (50) ఇంటి ముందు వాకిలి ఊడ్చి ఇంట్లోకి వెళ్తుండగా... వెనుక నుంచి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని ఐదున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిపోయారు.

పెయింటింగ్‌పై ఆరా తీస్తూ...
‘ఇంటికి పెయింటింగ్ డిజైన్ ఎవరు వేశారని ఓ వ్యక్తి హిందీలో అడిగాడు. చెప్పేలోపే వెనుక నుంచి గొలుసును లాగేందుకు ప్రయత్నిస్తుండగా అప్రమత్తమయ్యా. అప్పటికే మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉండడంతో మరొకడు గొలుసు తెంచుకుని పారిపోయారు. ‘దొంగ.. దొంగ’ అని అరిచినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.    - అలివేలు
 
ఉదయం 8.10 గంటలు.. ఎన్జీవోస్ కాలనీ, వివేకానంద పార్కు ఏరియా.. దాస్యం కుసుమ కుమారి (70) ఇంట్లో నుంచి బయటకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును లాగేశాడు. సమీపంలో ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి పరారయ్యాడు.
 
ఇంట్లోకి వెళుతుండగా...
ఇంటి బయటకు వచ్చి మళ్లీ తిరిగి వెళ్తుండగా తెల్లటి రంగు, గుండ్రటి ముఖం కలిగిన ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చాడు. తేరుకునే లోపే మెడలోని గొలుసు లాక్కుపోయాడు. రెండో వ్యక్తిని స్పష్టంగా చూడలేదు. - కుసుమ కుమారి
 
ఉదయం 8.50 గంటలు.. ద్వారకామయి నగర్...

కమలానగర్ వాసిషాబాద్ అశోక్ భార్య కృష్ణవేణి (30) తమ పిల్లలను సిద్ధార్థ పాఠశాలలో వదిలారు. ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తుండగా... ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని వెళ్లిపోయారు.

ముందే గమనించినట్టున్నారు
పిల్లలను స్కూల్ దగ్గర వదిలి తిరిగి వస్తున్నా. బైక్‌పై వెనుక నుంచి వచ్చి గొలుసు లాక్కుపోయారు. పాఠశాలకు వెళ్లేటప్పుడే వాళ్లు గమనించారనే అనుమానం ఉంది.     - కృష్ణవేణి
 
ఉదయం 9.45 గంటలు, ఐఎస్ సదన్ సరస్వతి నగర్ కాలనీ... ఇంటి ముందు పూల కుండీలో వేయడానికి ఎర్రమట్టి తేవడానికి వెళ్తున్న వృద్ధురాలు సంపత్ దామెరమ్మ (70) మెడలో ఉన్న అయిదు తులాల బంగారు ఆభరణాలను బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తెంచుకుపోయారు. ఆమె కింద పడటంతో మెడపై సల్ప గాయాలయ్యాయి.
 
ఏదీ రక్షణ?
ఇంటి ముందు ఉన్న మహిళలకు కూడా రక్షణ లేకుంటే ఎలా. ఇంక బయటకు వెళ్తే ఎవరికి రక్షణ ఉంటుంది? పోలీసులు కేసును త్వరగా కొలిక్కి తెచ్చి నా బంగారాన్ని తిరిగి అప్పగించాలి.    - దామెరమ్మ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement