సాక్షి ప్రతినిధి, విజయవాడ : ‘నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. నెల రోజుల్లో మీరే చూస్తారు.. ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతామో. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం అంటే అక్కడక్కడా కానిస్టేబుళ్లను పెడితే సరిపోదు. ఆధునిక పరిజ్ఞానాన్ని, పద్ధతులను వినియోగించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది’ అని నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నగర కమిషనరేట్ స్థాయి పెంపు, నేరాలకు అడ్డుకట్ట తదితర అంశాలపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
సాక్షి : కమిషనరేట్ పరిధి 80 కిలోమీటర్ల మేర పెరిగే అవకాశం ఉందంటున్నారు?
సీపీ : ఇప్పటికిప్పుడే దీనిపై వ్యాఖ్యానించడం మంచిది కాదు. ఈ నెలాఖరులోగా రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కమిషనరేట్ పరిధి ఎలా ఉండాలి, సిబ్బంది, విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో ఇస్తుంది. అప్పటి వరకు ఇంతే. ఇప్పటికిప్పుడు విషయాన్ని స్పెక్యులేట్ చేస్తే కొందరికి మంచి జరిగితే, కొందరికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.
సాక్షి : నగరంలో ఆర్థిక నేరాలు పెరిగాయి. పలు చిట్‌ఫండ్‌సంస్థల మూసివేతతో రూ.500 కోట్ల మేర ప్రజలు నష్టపోయారు. భవిష్యత్తులో ఇటువంటివి జరగక్కుండా ఏం చేయబోతున్నారు?
సీపీ : ఈ విషయంలో మోసపోతున్న వారి బాధ్యత కూడా కొంత ఉంది. ప్రారంభంలో తెలియక రిజిస్టర్ కాని సంస్థల్లో సభ్యులుగా చేరారంటే అర్థం ఉంది. మోసాలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత కూడా దురాశకుపోయి స్కీములు, చిట్స్‌లో చేరి మోసపోయేవాళ్లకు సాయం చేయమంటే ఎలా? తప్పుడు కంపెనీల్లో పెట్టుబడి పెడితే పోలీసుశాఖ మాత్రం ఏం చేస్తుంది. పోలీసు యంత్రాంగం వీటి పైనే దృష్టిసారిస్తే దౌర్జన్యాలు, దొంగతనాలు, అల్లర్లను అరికట్టేది ఎవరు?
సాక్షి : నగర విస్తరణతో పాటు వ్యాపారాలు విస్తరించాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా పరంగా తీసుకునే చర్యలు ఏంటి?
సీపీ : వ్యాపార సముదాయాలకు వచ్చే వారికి భద్రత కలిపించాల్సిన బాధ్యత ఆయా సంస్థల యాజమాన్యాలదే. ఇది ఎస్టాబ్లిష్ చట్టంలోనే ఉంది. ఖచ్చితంగా వారు రక్షణ చర్యలు తీసుకునేలా చూస్తాము. ఇక బహిరంగ ప్రదేశాల్లో పౌరుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
సాక్షి : గొలుసు దొంగతనాలు (చైన్ స్నాచింగ్స్) నిలువరించేందుకు ఏ చర్యలు తీసుకుంటారు?
సీపీ : ఇది మాకో ముఖ్యమైన సవాల్, గొలుసు దొంగతనాల్లో విద్యార్థులు, కొందరు యువ కానిస్టేబుళ్ల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. ఇంటికి కన్నం వేసి రూ.లక్షలు కాజేసిన దానికంటే ఇది తీవ్రమైన నేరం. ఇలాంటి చోరీలు మహిళలను భయానక స్థితిలోకి నెడతాయి. చైన్ స్నాచింగ్స్‌ను నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతాం.
నెలరోజుల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్
Published Wed, Aug 13 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM
Advertisement
Advertisement