Namaste Gang
-
బ్రాండెడ్ దుస్తులు..మసాజ్‌లు
l ‘నమస్తే’ గ్యాంగ్ విలాసవంతమైన జీవనం l 15 రోజుల పాటు జల్సాలు l కార్పొరేట్ స్కూళ్లల్లో పిల్లల చదువు సిటీబ్యూరో: వాకింగ్‌లో ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకుని... సమీపంలోకి వెళ్ళి నమస్తే చెప్తూ బెదిరించి దోపిపీలకు పాల్పడుతున్న ‘నమస్తే గ్యాంగ్’ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ గ్యాంగ్‌లో మరికొంత మంది సభ్యులు ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా టార్గెట్ చేసుకున్న నగరాలకు విమానాల్లో వెళ్లిరావడమే కాకుండా, వీరి జీవనశైలి కూడా అత్యంత విలాసవంతంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి నెలా కనీసం 15 రోజుల పాటు ‘పని’ మానేసి ఎంజాయ్ చేస్తుంటారు. నేరం చేయడానికి తిరిగేది స్కూటర్ పైనే అయినా వీరు ఎల్లప్పుడూ ఖరీదైన బ్రాండెడ్ దుస్తులే ధరిస్తారు. రెండు పూటలా పేరున్న రెస్టారెంట్లలో బిర్యానీ, రోజు విడిచి రోజు మసాజ్ వీరికి తప్పనిసరి. పోలీసులకు పట్టుబడిన బబ్బూ, ఇమ్రాన్ స్కూల్ డ్రాపౌట్స్ అయినా.. వీరి పిల్లలు మాత్రం ఘజియాబాద్‌లోని కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో పాటు మంగళవారం అరెస్టు చేసిన బబ్బూ, ఇమ్రాన్‌లను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో న‘మస్కా’ర్ నేరాలకు పాల్పడిన చేసిన ఈ ద్వయం జనవరి 10న ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో పంజా విసిరింది. ఒకే రోజు ముగ్గురిని దోచుకుంది. రిడ్జ్ఉడ్ ఎస్టేట్ ప్రాంతంలో ఆర్మీ మాజీ అధికారి భగ్వాన్ దాస్‌ను బెదిరించి బంగారం ఉంగరం లాక్కెళ్లారు. డీఎల్ఎఫ్ సెక్టార్–4, 56ల్లో వైద్యుడు మనోహర్‌లాల్ శర్మ నుంచి నగదు, అహు అభిషేక్ నుంచి ఖరీదైన సెల్‌ఫోన్ దోపిడీ చేసింది. రిడ్జ్ఉడ్ ఎస్టేట్ ప్రాంతంలోని సీసీ కెమెరాలో నిందితులను గుర్తించిన గుర్గావ్ పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్ళారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో మహారాష్ట్రలోని పుణేలో నేరాలు చేసిన వీరు ఆ మరుసటి రోజే విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఈ విషయం గుర్తించిన గుర్గావ్ అధికారులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాటు వేసి, బబ్బూ, ఇమ్రాన్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వీరిని విచారించిన గుర్గావ్ పోలీసులు వాహనాలు సమకూర్చిన లల్లూ సైతం నిందితుడిగా తేల్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. ఈ ‘నమస్తే గ్యాంగ్’ దేశంలోని ఆరు రాష్ట్రాల్లో నేరాలు చేసింది. అయితే ఏ నగర పోలీసులు పట్టుకుంటే... కేవలం అక్కడ చేసిన నేరాలను మాత్రమే బయటపెడుతుంది. మిగిలిన ప్రాంతాల్లో చేసినవి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. దీంతో వీరిపై పీటీ వారెంట్ జారీ చేసి తీసుకురావడం సాధ్యం కాదు. ఫిబ్రవరిలో నగరానికి వచ్చిన వీరు అదే నెల 12 ఉదయం రామ్‌గోపాల్‌పేట పరిధిలో పి.వెంకటరమణకు ‘నమస్తే చెప్పారు’. ఈ కేసుపై దృష్టి పెట్టిన సీసీఎస్ స్పెషల్‌టీమ్ ఇన్స్పెక్టర్ వి.శ్యాంబాబు నేతృత్వంలోని బృందం ఆ ప్రాంతంతో పాటు చుట్టు పక్కల ఉన్న 200 సీసీ కెమెరాల్లోని ఫీడ్ ఆధారంగా అనుమానితుల్ని గుర్తించి సాంకేతికంగా దర్యాప్తు చేసింది. ఫలితంగా పసోండా చిరునామా తెలుసుకుని అక్కడకు వెళ్లగా, అప్పటికే వీరిని గుర్గావ్ పోలీసులు తీసుకెళ్లారని తెలుసుకున్నారు. హుటాహుటిన అక్కడకు వెళ్ళిన ఇన్స్పెక్టర్ లోతుగా విచారించి నగర నేరాన్నీ అంగీకరించేలా చేయడంతోనే ఇక్కడకు తేవడం సాధ్యమైంది.ఈ ముఠాలో మరో ఐదుగురి వరకు సభ్యులు ఉండచ్చని అనుమానిస్తున్న సీసీఎస్ పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. తీహార్‌తో పాటు గుర్గావ్లోని భోండ్సీ, బెంగళూరు జైళ్లు వీరికి ‘సుపరిచితమే’. -
నగరంలో ‘నమస్తే గ్యాంగ్’లు!
⇒విమానాల్లో వచ్చి నేరాలు చేసిన వైనం ⇒ఘజియాబాద్ ముఠాగా గుర్తించిన సీసీఎస్ ⇒అక్కడకు వెళ్లేసరికి పట్టుకెళ్లిన పుణే పోలీసులు ⇒పీటీ వారెంట్‌పై తెస్తున్న సిటీ అధికారులు సిటీబ్యూరో: విమానాల్లో ముఠా సభ్యులు... ట్రాన్స్‌పోర్ట్‌లో ద్విచక్ర వాహనాలు... లాడ్జిలు/హోటళ్లలో మకాం... డమ్మీ తుపాకులు చూపించి దోపిడీలు... వరుసపెట్టి నేరాలు చేసి స్వస్థలాలకు పరారీ... ఈ తరహాలో రెచ్చిపోతూ దేశ వ్యాప్తంగా నేరాలు చేసిన ‘నమస్తే గ్యాంగ్’ సిటీలోనూ హల్చల్ చేసింది. ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్న ఈ ముఠాను నగర పోలీసులు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై సిటీకి తీసుకువస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఈ ఘరానా ముఠా దేశ వ్యాప్తంగా దోపిడీలకు పాల్పడింది. గతంలో చైన్‌స్నాచింగ్స్‌కు పాల్పడిన ఈ గ్యాంగ్ సభ్యులు కేవలం గొలుసులు మాత్రమే దోచుకెళ్లారు. దక్షిణాదిలో ఉన్న నగరాన్ని టార్గెట్ చేసుకుంటే ముందుగా వీరు ఉత్తరాదిలోని సిటీకి వెళ్లి అక్కడ ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తారు. వాటిని ట్రాన్స్‌పోర్ట్‌లో టార్గెట్ చేసుకున్న నగరానికి పంపిస్తారు. గ్యాంగ్ మొత్తం విమానాల్లో ఆ సిటీకి చేరుకుంటుంది. ఇందుకుగాను వీరు విమానాశ్రయం ఉన్న నగరాలనే ఎంచుకుంటారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, భోపాల్, బెంగళూరు, మహారాష్ట్రల్లోనూ నేరాలు చేశారు. లాడ్జిల్లో బస చేసి, ట్రాన్స్పోర్ట్ నుంచి వాహనం తీసుకుంటుంది. బైక్‌పై తిరుగుతూ తెల్లవారుజామున వాకింగ్ చేసే వారితో పాటు నిర్మానుష్య ప్రాంతాల్లో నడిచి వెళ్లే వారిని టార్గెట్ చేసుకుంటారు. ఒంటరిగా కనిపించిన స్త్రీ, పురుషుల వద్దకు వెళ్లి వాహనాన్ని ఆపుతారు. వెనుక కూర్చున గ్యాంగ్ మెంబర్ టార్గెట్ చేసిన వారి దగ్గరకు వెళ్లి తొలుత నమస్తే చెబుతాడు. అందుకే ఈ గ్యాంగ్‌ను పోలీసులు ‘నమస్తే గ్యాంగ్’గా పరిగణిస్తున్నారు. ఏదైనా చిరునామా అడుగుతున్నట్లు వారిని మాటల్లోకి దింపి ఒంటిపై ఉన్న ఆభరణాలను గుర్తిస్తాడు. అదను చూసుకుని తమ వెంట తెచ్చిన డమ్మీ తుపాకీని చూపించి బెదిరించి, గొలుసులు, ఆభరణాలు లాక్కుని... స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్న వాహనంపై ఉడాయిస్తారు. ఇలా గరిష్టంగా మూడు రోజుల్లో వీలైనన్ని నేరాలు చేసే ‘నమస్తే గ్యాంగ్’ ఆ ప్రాంతాన్ని వదిలేస్తుంది. వాహనాన్ని ‘నెక్స్›్ట టార్గెట్’గా చేసుకున్న సిటీకి పార్శిల్ చేసి వీరు మాత్రం విమానంలో తమ స్వస్థలానికి వెళ్లిపోతారు. సొత్తు అమ్మకం, పంపకాలు పూర్తయిన తర్వాత ‘నెక్ట్స్ టార్గెట్ సిటీ’కి చేరుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న రామ్‌గోపాల్‌పేట్ ఠాణా పరిధిలో ఈ ముఠా పంజా విసిరింది. మినిస్టర్స్ రోడ్లో వాకింగ్ చేస్తున్న వెంకటరత్నం అనే వ్యక్తి నుంచి మూడు తులాల బంగారం గొలుసు లాక్కెళ్లారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ అధికారులు రామ్గోపాల్పేటతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 150 సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్‌ను అధ్యయనం చేసి నేరగాళ్లు వాడిన వాహనాన్ని గుర్తించారు. దర్యాప్తు నేపథ్యంలో ఇది ఢిల్లీలో చోరీ అయినట్లు తేలింది. సాంకేతికంగా ముందుకు వెళ్ళిన అధికారులు ఘజియాబాద్ ముఠాగా నిర్థారించారు. వీరిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం గత నెల్లో ఆ ప్రాంతానికి వెళ్లగా, అప్పటికే నిందితుల్ని మహారాష్ట్రలోని పుణే పోలీసులు తీసుకువెళ్ళినట్లు తేలింది. అక్కడ నుంచి ఈ ముఠాను ఢిల్లీ పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకువెళ్ళారు. రామ్‌గోపాల్‌పేటలో నమోదైన కేసుకు సంబంధించి పీటీ వారెంట్‌లో వెళ్ళిన నగర పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఒకటిరెండు రోజుల్లో సిటీకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్ళిన నగర పోలీసులు నిందితుల్ని విచారించగా, వారు నగరంలో చేసిన మరో ఎనిమిది నేరాలను అంగీకరించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు సైతం సేకరిస్తున్న పోలీసులు సిటీకి తీసుకువచ్చిన తర్వాత న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు.