బ్రాండెడ్‌ దుస్తులు..మసాజ్‌లు | Branded clothing .. | Sakshi
Sakshi News home page

బ్రాండెడ్‌ దుస్తులు..మసాజ్‌లు

Published Thu, Apr 20 2017 2:11 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

బ్రాండెడ్‌ దుస్తులు..మసాజ్‌లు

బ్రాండెడ్‌ దుస్తులు..మసాజ్‌లు

l  ‘నమస్తే’ గ్యాంగ్‌ విలాసవంతమైన జీవనం
l  15 రోజుల పాటు జల్సాలు
l  కార్పొరేట్‌ స్కూళ్లల్లో పిల్లల చదువు


సిటీబ్యూరో: వాకింగ్‌లో ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకుని... సమీపంలోకి వెళ్ళి నమస్తే చెప్తూ బెదిరించి దోపిపీలకు పాల్పడుతున్న ‘నమస్తే గ్యాంగ్‌’ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ గ్యాంగ్‌లో మరికొంత మంది సభ్యులు ఉన్నట్లు సీసీఎస్‌ పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ ముఠా టార్గెట్‌ చేసుకున్న నగరాలకు విమానాల్లో వెళ్లిరావడమే కాకుండా, వీరి జీవనశైలి కూడా అత్యంత విలాసవంతంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి నెలా కనీసం 15 రోజుల పాటు ‘పని’ మానేసి ఎంజాయ్‌ చేస్తుంటారు.

నేరం చేయడానికి తిరిగేది స్కూటర్‌ పైనే అయినా వీరు ఎల్లప్పుడూ ఖరీదైన బ్రాండెడ్‌ దుస్తులే ధరిస్తారు. రెండు పూటలా పేరున్న రెస్టారెంట్లలో బిర్యానీ, రోజు విడిచి రోజు మసాజ్‌ వీరికి తప్పనిసరి. పోలీసులకు పట్టుబడిన బబ్బూ, ఇమ్రాన్‌ స్కూల్‌ డ్రాపౌట్స్‌ అయినా.. వీరి పిల్లలు మాత్రం ఘజియాబాద్‌లోని కార్పొరేట్‌ స్కూల్‌లో చదువుకుంటున్నారు.  ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో పాటు మంగళవారం అరెస్టు చేసిన బబ్బూ, ఇమ్రాన్‌లను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో న‘మస్కా’ర్‌ నేరాలకు పాల్పడిన చేసిన ఈ ద్వయం జనవరి 10న ఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌లో పంజా విసిరింది.

ఒకే రోజు ముగ్గురిని దోచుకుంది. రిడ్జ్‌ఉడ్‌ ఎస్టేట్‌ ప్రాంతంలో ఆర్మీ మాజీ అధికారి భగ్వాన్‌ దాస్‌ను బెదిరించి బంగారం ఉంగరం లాక్కెళ్లారు. డీఎల్‌ఎఫ్‌ సెక్టార్‌–4, 56ల్లో వైద్యుడు మనోహర్‌లాల్‌ శర్మ నుంచి నగదు, అహు అభిషేక్‌ నుంచి ఖరీదైన సెల్‌ఫోన్‌ దోపిడీ చేసింది. రిడ్జ్‌ఉడ్‌ ఎస్టేట్‌ ప్రాంతంలోని సీసీ కెమెరాలో నిందితులను గుర్తించిన గుర్గావ్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్ళారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో  మహారాష్ట్రలోని పుణేలో నేరాలు చేసిన వీరు ఆ మరుసటి రోజే  విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఈ విషయం గుర్తించిన గుర్గావ్‌ అధికారులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాటు వేసి, బబ్బూ, ఇమ్రాన్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

వీరిని విచారించిన గుర్గావ్‌ పోలీసులు వాహనాలు సమకూర్చిన లల్లూ సైతం నిందితుడిగా తేల్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. ఈ ‘నమస్తే గ్యాంగ్‌’ దేశంలోని ఆరు రాష్ట్రాల్లో నేరాలు చేసింది. అయితే ఏ నగర పోలీసులు పట్టుకుంటే... కేవలం అక్కడ చేసిన నేరాలను మాత్రమే బయటపెడుతుంది. మిగిలిన ప్రాంతాల్లో చేసినవి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. దీంతో వీరిపై పీటీ వారెంట్‌ జారీ చేసి తీసుకురావడం సాధ్యం కాదు. ఫిబ్రవరిలో నగరానికి వచ్చిన వీరు అదే నెల 12 ఉదయం రామ్‌గోపాల్‌పేట పరిధిలో పి.వెంకటరమణకు ‘నమస్తే చెప్పారు’.

ఈ కేసుపై దృష్టి పెట్టిన సీసీఎస్‌ స్పెషల్‌టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.శ్యాంబాబు నేతృత్వంలోని బృందం ఆ ప్రాంతంతో పాటు చుట్టు పక్కల ఉన్న 200 సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ ఆధారంగా అనుమానితుల్ని గుర్తించి సాంకేతికంగా దర్యాప్తు చేసింది. ఫలితంగా పసోండా చిరునామా తెలుసుకుని అక్కడకు వెళ్లగా, అప్పటికే వీరిని గుర్గావ్‌ పోలీసులు తీసుకెళ్లారని తెలుసుకున్నారు. హుటాహుటిన అక్కడకు వెళ్ళిన ఇన్‌స్పెక్టర్‌ లోతుగా విచారించి నగర నేరాన్నీ అంగీకరించేలా చేయడంతోనే ఇక్కడకు తేవడం సాధ్యమైంది.ఈ ముఠాలో మరో ఐదుగురి వరకు సభ్యులు ఉండచ్చని అనుమానిస్తున్న సీసీఎస్‌ పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. తీహార్‌తో పాటు గుర్గావ్‌లోని భోండ్సీ, బెంగళూరు జైళ్లు వీరికి ‘సుపరిచితమే’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement