‘క్లాట్’లో గురుకుల విద్యార్థుల సత్తా
‘క్లాట్’లో గురుకుల విద్యార్థుల సత్తా
Published Sat, Jun 17 2017 1:53 AM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM
- ముగ్గురు విద్యార్థులకు జాతీయస్థాయి ర్యాంకులు
- 87వ ర్యాంకు సాధించిన స్వర్ణలత
- వెంకటేశ్‌కు 116వ ర్యాంకు.. మణికి 525వ ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: కామన్ లా అడ్మిషన్ టెస్ట్.. సంక్షిప్తంగా క్లాట్. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ఇది. మరోవైపు నిరుపేద కుటుంబాలు వారివి.. తిండికే కష్టం.. ఇక ఉన్నత చదువులు చదివించే స్థోమత ఎక్కడిది.. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన ముగ్గురు విద్యార్థులు క్లాట్‌లో మెరిశారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు స్వర్ణలత, వెంకటేశ్, మణి.. జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. ఇప్పటివరకు చదివింది ఒక ఎత్తయితే.. ఇకపై చదవేది మరో ఎత్తు అంటూ తమ లక్ష్యాలు, కుటుంబ నేపథ్యాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. వారి మాటల్లోనే..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవుతా
దేవరకొండ మండలం పెద్దతండా మా సొంతూరు. నాన్న కౌలు రైతు. అమ్మ, నాన్న నిరక్ష్యరాస్యులు. నాకు చిన్నప్పటి నుంచి ఉన్నత చదువులు చదవాలని కోరిక ఉండేది. కాని వారికి చదివించే స్థోమత లేక గురుకులంలో చేర్పిస్తానని చెప్పారు. అలా ఆర్‌కేపురం గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశం పొందా. ఇంటర్మీడియట్‌లో ఐడీఐఏ (ఇంక్రీజింగ్ డైవర్సిటీ ఇంక్రీజింగ్ యాక్సిస్) సంస్థ నన్ను దత్తత తీసుకుంది. ఇంటర్‌లో ప్రభుత్వ సహకారం, ఐటీఐఏ సంస్థ ఆర్థిక సహకారంతో 90 శాతం మార్కులు సాధించా. ఆ తర్వాత క్లాట్‌కు సన్నద్ధమయ్యా. జాతీయ స్థాయిలో 87వ ర్యాంకు సాధించా. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడమేనా లక్ష్యం. దాన్ని సాధించే వరకు కష్టపడతా.
– స్వర్ణలత, క్లాట్–2017లో 87వ ర్యాంకు
ఐఏఎస్.. నా లక్ష్యం
నిజామాబాద్ పక్కన రహ్మత్‌నగర్ మా ఊరు. నాన్న రైతు. అత్యంత పేద కుటుంబం మాది. ఐదో తరగతిలో ఆర్మూరు గురుకులంలో చేరా. ఇంటర్మీడియట్‌లో షేక్‌పేట గురుకుల పాఠశాలకు మారాను. అక్కడ క్లాట్‌పై అవగాహన కల్పించారు. పట్టుదలతో చదివి జాతీయ స్థాయిలో 116వ ర్యాంకు సాధించా. నా లక్ష్యం సివిల్ సర్వీస్. న్యాయ శాస్త్రం పూర్తయ్యాక సివిల్స్‌కు సన్నద్ధమవుతా. ఐఏఎస్ అవుతా.
– వెంకటేశ్, క్లాట్–2017లో 116వ ర్యాంకు
షెల్టర్ హోం నుంచి చదువుకున్నా
మాది శ్రీకాకుళం జిల్లా. నాన్న ఆటోడ్రైవర్, అమ్మ గృహిణి. అత్యంత పేదలం. నన్ను చదివించే స్థోమత అమ్మానాన్నలకు లేకపోయింది. దీంతో ఈసీఐఎల్ సమీపంలో ఒక క్రిస్టియన్ సంస్థ నిర్వహిస్తున్న షెల్టర్ హోంలో చేరి నాలుగో తరగతి వరకు చదువుకున్నా. తర్వాత సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ప్రవేశ పరీక్ష రాసి మహేంద్రహిల్స్ గురుకులంలో అడ్మిషన్ పొందా. ఇంటర్మీడియట్ నుంచి ఐడీఐఏ (ఇంక్రీజింగ్ డైవర్సిటీ ఇంక్రీజింగ్ యాక్సిస్) సంస్థ నన్ను దత్తత తీసుకుంది. న్యాయ శాస్త్రంపై అవగాహన కల్పించి క్లాట్‌కు సన్నద్ధమయ్యేలా ప్రోత్సహించింది. దీంతో క్లాట్–2017లో 525 ర్యాంకు పొందగలిగాను. న్యాయ విద్య పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటా.
– మణి, క్లాట్–2017లో 525వ ర్యాంకు
Advertisement
Advertisement