Common Law Admission Test
-
కామన్ ఎంట్రన్స్‌తో నైతికత ఉన్న విద్యార్థులు దొరక్కపోవచ్చు: సీజేఐ
పణాజి: నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(సీఎల్ఏటీ) ద్వారా సరైన నైతికత ఉన్న విద్యార్థులు దొరక్కపోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఎల్లప్పుడూ పరీక్షల్లో ఉత్తీర్ణతకే తప్ప, విలువ ఆధారిత విద్యను ప్రోత్సహించకపోవడమే ఇందుకు కారణం కావచ్చని ఆయన చెప్పారు. శనివారం ఆయన గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి విద్యా సంవత్సరం సెషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. -
ఆ పరీక్ష రద్దు కుదరదు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)–2020ను రద్దు చేయడం కానీ, కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపడం కానీ కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ ప్రక్రియలో సాంకేతిక లోపాలున్నాయంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థులు తమ ఫిర్యాదులను మూడు రోజుల్లోపు రిడ్రెసెల్ కమిటీకి తెలియజేయాలని న్యాయస్థానం సూచించింది. ఫిర్యాదుదారుల సమస్యలను వినడానికి అన్ని నేషనల్ లా యూనివర్సిటీలకు ఒక ఫిర్యాదుల పరిష్కార కమిటీ మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఉందని నేషనల్ లా యూనివర్సిటీల తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ తెలిపారు. ఈ కేసుని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిర్యాదుదారుల సమస్యలపై మాజీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని కమిటీ తక్షణం స్పందిస్తుందని తన ఆదేశాల్లో పేర్కొంది. పిటిషనర్ల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది శంకర్ నారాయణన్, పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయని, కొన్ని ప్రశ్నలకు ‘కీ’లో ఇచ్చిన సమాధానాలు తప్పుగా ఉన్నాయని, ఇప్పటి వరకు క్లాట్‌కు, దాదాపు 40,000 అభ్యంతరాలు అందాయని తెలిపారు. మొత్తం 150 మార్కులకు గాను, మొదటిసారిగా మూడు శాతం మంది విద్యార్థులు మాత్రమే 50 శాతం మార్కులు సాధించారని శంకర్ నారాయణన్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. (చదవండి: కరోనాతో చనిపోతే లోక్‌సభను మూసేయాలా?) -
క్లాట్ ఫార్ములాకు సుప్రీం ఆమోదం
న్యూఢిల్లీ: ఉమ్మడి న్యాయ ప్రవేశపరీక్ష(క్లాట్) –2018 కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలో విద్యార్థులు కోల్పోయిన సమయానికి అనుగుణంగా మార్కుల్ని జతచేస్తూ ఫిర్యాదుల పరిష్కార కమిటీ (జీఆర్సీ) ప్రతిపాదించిన ఫార్ములాకు ఆమోదం తెలిపింది. అలాగే క్లాట్‌ను పూర్తిగా రద్దుచేసి మరోసారి నిర్వహించాలన్న డిమాండ్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీనివల్ల మిగతా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ దీపక్ గుప్తాల వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఎన్యూఏఎల్ఎస్కు చెందిన ఇద్దరు సభ్యుల ఫిర్యాదుల పరిష్కార కమిటీ 4,690 మంది విద్యార్థులకు అన్యాయం జరిగినట్లు కోర్టుకు తెలిపింది. దీంతో సవరించిన మార్కులకు అనుగుణంగా విద్యార్థుల కొత్త మెరిట్ జాబితాను సిద్ధం చేసి జూన్ 16లోగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని సుప్రీం ఆదేశించింది. -
మళ్లీ క్లాట్ నిర్వహణకు సుప్రీంకోర్టు నో
న్యూఢిల్లీ: ఉమ్మడి న్యాయ ప్రవేశ పరీక్ష(క్లాట్)ను మరోసారి నిర్వహించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న క్లాట్ తొలిదశ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలన్న విజ్ఞప్తిని వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. క్లాట్ పరీక్షలో సాంకేతిక సమస్యల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసేందుకు జూన్ 15లోగా ఓ పరిష్కారాన్ని కనుగొనాలని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్(ఎన్‌యూఏఎల్‌ఎస్) ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఆదేశించింది. దేశంలోని 19 ప్రతిష్టాత్మక న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 13న ఎన్‌యూఏఎల్‌ఎస్ క్లాట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా పలుచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపు 6,000 మంది విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోయారు. -
‘క్లాట్’ కౌన్సెలింగ్ నిలుపుదలకు సుప్రీం నో
న్యూఢిల్లీ: క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్) ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా 19 ప్రతిష్టాత్మక న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం చేపట్టనున్న కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తాము జారీ చేసే తదుపరి ఉత్తర్వుల ఆధారంగానే ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని స్పష్టం చేసింది. బుధవారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. మే 13న నిర్వహించిన క్లాట్‌కు 54 వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే పరీక్ష సందర్భంగా సాంకేతిక సమస్య లు ఎదురయ్యాయని, ఫలితాలను నిలిపి వేయాలని, పరీక్ష మళ్లీ నిర్వహించాలని కొంద రు విద్యార్థులు పలు హైకోర్టులతోపాటు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీం.. ఫిర్యాదుల పరిష్కా ర కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాల్సిం దిగా కొచ్చిలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్‌ను ఆదేశించింది. -
‘క్లాట్’లో గురుకుల విద్యార్థుల సత్తా
- ముగ్గురు విద్యార్థులకు జాతీయస్థాయి ర్యాంకులు - 87వ ర్యాంకు సాధించిన స్వర్ణలత - వెంకటేశ్‌కు 116వ ర్యాంకు.. మణికి 525వ ర్యాంకు సాక్షి, హైదరాబాద్: కామన్ లా అడ్మిషన్ టెస్ట్.. సంక్షిప్తంగా క్లాట్. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ఇది. మరోవైపు నిరుపేద కుటుంబాలు వారివి.. తిండికే కష్టం.. ఇక ఉన్నత చదువులు చదివించే స్థోమత ఎక్కడిది.. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన ముగ్గురు విద్యార్థులు క్లాట్‌లో మెరిశారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు స్వర్ణలత, వెంకటేశ్, మణి.. జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. ఇప్పటివరకు చదివింది ఒక ఎత్తయితే.. ఇకపై చదవేది మరో ఎత్తు అంటూ తమ లక్ష్యాలు, కుటుంబ నేపథ్యాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. వారి మాటల్లోనే.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవుతా దేవరకొండ మండలం పెద్దతండా మా సొంతూరు. నాన్న కౌలు రైతు. అమ్మ, నాన్న నిరక్ష్యరాస్యులు. నాకు చిన్నప్పటి నుంచి ఉన్నత చదువులు చదవాలని కోరిక ఉండేది. కాని వారికి చదివించే స్థోమత లేక గురుకులంలో చేర్పిస్తానని చెప్పారు. అలా ఆర్కేపురం గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశం పొందా. ఇంటర్మీడియట్లో ఐడీఐఏ (ఇంక్రీజింగ్ డైవర్సిటీ ఇంక్రీజింగ్ యాక్సిస్) సంస్థ నన్ను దత్తత తీసుకుంది. ఇంటర్లో ప్రభుత్వ సహకారం, ఐటీఐఏ సంస్థ ఆర్థిక సహకారంతో 90 శాతం మార్కులు సాధించా. ఆ తర్వాత క్లాట్‌కు సన్నద్ధమయ్యా. జాతీయ స్థాయిలో 87వ ర్యాంకు సాధించా. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడమేనా లక్ష్యం. దాన్ని సాధించే వరకు కష్టపడతా. – స్వర్ణలత, క్లాట్–2017లో 87వ ర్యాంకు ఐఏఎస్.. నా లక్ష్యం నిజామాబాద్ పక్కన రహ్మత్‌నగర్ మా ఊరు. నాన్న రైతు. అత్యంత పేద కుటుంబం మాది. ఐదో తరగతిలో ఆర్మూరు గురుకులంలో చేరా. ఇంటర్మీడియట్లో షేక్‌పేట గురుకుల పాఠశాలకు మారాను. అక్కడ క్లాట్‌పై అవగాహన కల్పించారు. పట్టుదలతో చదివి జాతీయ స్థాయిలో 116వ ర్యాంకు సాధించా. నా లక్ష్యం సివిల్ సర్వీస్. న్యాయ శాస్త్రం పూర్తయ్యాక సివిల్స్‌కు సన్నద్ధమవుతా. ఐఏఎస్ అవుతా. – వెంకటేశ్, క్లాట్–2017లో 116వ ర్యాంకు షెల్టర్ హోం నుంచి చదువుకున్నా మాది శ్రీకాకుళం జిల్లా. నాన్న ఆటోడ్రైవర్, అమ్మ గృహిణి. అత్యంత పేదలం. నన్ను చదివించే స్థోమత అమ్మానాన్నలకు లేకపోయింది. దీంతో ఈసీఐఎల్ సమీపంలో ఒక క్రిస్టియన్ సంస్థ నిర్వహిస్తున్న షెల్టర్ హోంలో చేరి నాలుగో తరగతి వరకు చదువుకున్నా. తర్వాత సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ప్రవేశ పరీక్ష రాసి మహేంద్రహిల్స్ గురుకులంలో అడ్మిషన్ పొందా. ఇంటర్మీడియట్ నుంచి ఐడీఐఏ (ఇంక్రీజింగ్ డైవర్సిటీ ఇంక్రీజింగ్ యాక్సిస్) సంస్థ నన్ను దత్తత తీసుకుంది. న్యాయ శాస్త్రంపై అవగాహన కల్పించి క్లాట్‌కు సన్నద్ధమయ్యేలా ప్రోత్సహించింది. దీంతో క్లాట్–2017లో 525 ర్యాంకు పొందగలిగాను. న్యాయ విద్య పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటా. – మణి, క్లాట్–2017లో 525వ ర్యాంకు -
క్లాట్‌కు భారీగా దరఖాస్తులు
ఎడ్యు న్యూస్ దేశంలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)కు ఈ ఏడాది దరఖాస్తులు భారీగా వచ్చాయి. గత తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 45,040 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 39,686 దరఖాస్తులు అందాయి. మే 8న ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఐదేళ్ల బీఏ-ఎల్ఎల్బీ, ఏడాది వ్యవధి ఉన్న ఎల్ఎల్ఎం కోర్సుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది పంజాబ్‌లోని రాజీవ్‌గాంధీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఆర్‌జీఎన్‌యూఎల్) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఆన్లైన్ పరీక్ష కోసం 170 కేంద్రాలను ఎంపిక చేశారు. బీఏఎల్ఎల్బీ (అండర్ గ్రాడ్యుయేట్)కి 39,468 మంది, ఎల్ఎల్ఎం (పోస్ట్ గ్రాడ్యుయేట్)కు 5,572 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2008 నుంచి 2015 వరకు క్లాట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల సంఖ్య 200 శాతం పెరిగింది. -
ప్రతిష్టాత్మక ‘లా’కు క్లాట్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)-2015ను లక్నోలోని డాక్టర్ రాంమనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ నిర్వహించనుంది. అర్హత: యూజీ కోర్సులకు: జనరల్/ఓబీసీ/శారీరక వికలాంగు లు 45 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 40 శాతం) మార్కులతో 10+2 ఉత్తీర్ణత. 2015 మార్చి/ఏప్రిల్‌లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసేవారు అర్హులే.వయోపరిమితి: జూలై 1, 2015 నాటికి జనరల్/ఓబీసీలకు 20 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 22 ఏళ్లు). పీజీ కోర్సులకు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతం, ఇతరులు 55 శాతం మార్కులతో ఎల్ఎల్బీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. యూజీ కోర్సులకు పరీక్ష విధానం: సబ్జెక్టు మార్కులు ఇంగ్లిష్ ఇన్క్లూడింగ్ కాంప్రెహెన్షన్ 40 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 50 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (న్యూమరికల్ ఎబిలిటీ) 20 లీగల్ ఆప్టిట్యూడ్ 50 లాజికల్ రీజనింగ్ 40 ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. పీజీ కోర్సులకు పరీక్ష విధానం: కాన్స్టిట్యూషనల్ లా, జ్యురిస్‌ప్రుడెన్స్‌ల నుంచి 50 చొప్పు న ప్రశ్నలు ఇస్తారు. కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ లా, ఫ్యామిలీ లా, ప్రాపర్టీ లా, ఐపీఆర్ తదితర సబ్జెక్టుల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. సరైన సమాధానానికి 1 మార్కు. తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత ఉంటుంది. ప్రిపరేషన్ టిప్స్: ఇంగ్లిష్ కాంప్రహెన్షన్: అభ్యర్థి ఇంగ్లిష్ వ్యాకరణాన్ని, గ్రహణశక్తిని పరిశీలించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన విభాగం ఇంగ్లిష్. ఇచ్చిన ప్యాసేజ్ ప్రధాన విషయాన్ని గుర్తించడంతోపాటు పదాలను అర్థాలను తెలుసుకుని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: వర్తమాన వ్యవహారాలపై అభ్యర్థికున్న పట్టును తెలుసుకోవడానికి ఉద్దేశించిన విభాగం జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. నిర్దేశిత సిలబస్ అంటూ లేని ఈ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా సమాధానం గుర్తించడానికి సిద్ధంగా ఉండాలి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్: ఇందులో గణితంలో ప్రాథమిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేలా ప్రశ్నలు ఎదురవుతాయి. పదో తరగతి స్థాయిలోనే ఈ ప్రశ్నలుంటాయి.లీగల్ ఆప్టిట్యూడ్: పరీక్షలో ఎక్కువ వెయిటేజ్ ఉన్న విభాగం లీగల్ ఆప్టిట్యూడ్. ఇందులో ప్రధానంగా స్టడీ ఆఫ్ లా, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, సమస్య పరిష్కార సామర్థ్యంలో అభ్యర్థిని అంచనా వేసేలా ప్రశ్నలడుగుతారు.లాజికల్ రీజనింగ్: తార్కిక నమూనాలు, లాజికల్ లింక్స్ ను గుర్తించడంతోపాటు తర్కవిరుద్ధమైన వాదనలను సరిచేయడంలో అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. రిఫరెన్స్ బుక్స్ ఇంగ్లిష్ గ్రామర్ - రెన్ అండ్ మార్టిన్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ-నార్మన్ లూయిస్. ఏ మోడ్రన్ అప్రోచ్ టు లాజికల్ రీజనింగ్ - ఆర్ఎస్ అగర్వాల్; క్లాట్ ఎగ్జామ్ గైడ్-అరిహంత్ పబ్లికేషన్స్; క్లాట్ ప్రీవియస్ ప్రశ్నపత్రాలు; జనరల్ నాలెడ్జ్ కోసం మళయాల మనోరమ ఇయర్‌బుక్, కరెంట్ అఫైర్స్ కోసం ఏవైనా మ్యాగజైన్లు, దినపత్రికలు. ముఖ్య సమాచారం: ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 14, 2015 ఆన్లైన్ పరీక్ష: మే 10, 2015. వెబ్సైట్: జ్ట్టిఞ://ఛ్చ్టి.్చఛి.జీ క్లాట్‌తో ప్రవేశాలు కల్పించే సంస్థలు నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ- బెంగళూరు. నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీ అండ్ రీసెర్చ్ (నల్సార్) యూనివర్సిటీ ఆఫ్ లా- హైదరాబాద్. నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ, భోపాల్. వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సెన్సైస్, కోల్‌కతా. నేషనల్ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్. హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, రాయ్‌పూర్. గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, గాంధీనగర్. డాక్టర్ రాంమనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ, లక్నో. రాజీవ్‌గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా, పంజాబ్. చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ, పాట్నా. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్,కోచి నేషనల్ లా యూనివర్సిటీ, కటక్. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా, రాంచీ. నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్ అకాడమీ, గువహటి. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, విశాఖపట్నం. తమిళనాడు నేషనల్ లా స్కూల్, తిరుచిరాపల్లి.