
న్యూఢిల్లీ: కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)–2020ను రద్దు చేయడం కానీ, కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపడం కానీ కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ ప్రక్రియలో సాంకేతిక లోపాలున్నాయంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థులు తమ ఫిర్యాదులను మూడు రోజుల్లోపు రిడ్రెసెల్ కమిటీకి తెలియజేయాలని న్యాయస్థానం సూచించింది. ఫిర్యాదుదారుల సమస్యలను వినడానికి అన్ని నేషనల్ లా యూనివర్సిటీలకు ఒక ఫిర్యాదుల పరిష్కార కమిటీ మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఉందని నేషనల్ లా యూనివర్సిటీల తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ తెలిపారు.
ఈ కేసుని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిర్యాదుదారుల సమస్యలపై మాజీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని కమిటీ తక్షణం స్పందిస్తుందని తన ఆదేశాల్లో పేర్కొంది. పిటిషనర్ల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది శంకర్ నారాయణన్, పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయని, కొన్ని ప్రశ్నలకు ‘కీ’లో ఇచ్చిన సమాధానాలు తప్పుగా ఉన్నాయని, ఇప్పటి వరకు క్లాట్‌కు, దాదాపు 40,000 అభ్యంతరాలు అందాయని తెలిపారు. మొత్తం 150 మార్కులకు గాను, మొదటిసారిగా మూడు శాతం మంది విద్యార్థులు మాత్రమే 50 శాతం మార్కులు సాధించారని శంకర్ నారాయణన్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. (చదవండి: కరోనాతో చనిపోతే లోక్‌సభను మూసేయాలా?)
Comments
Please login to add a commentAdd a comment