గ్యాంగ్‌స్టర్ నయూమ్ గురించి.....
నయీమ్ అనుచరుడి ఇంటరాగేషన్! రియూజ్‌ను ప్రశ్నించిన డీఎస్పీ?
మునుగోడు: గ్యాంగ్‌స్టర్ నయూమ్ ముఖ్య అనుచరుడు, బెస్ట్ షూటర్‌గా పేరున్న రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళవారం రాత్రి మునుగోడు పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నల్లగొండ డీఎస్పీకి అప్పగించినట్లు తెలిసింది. మూడు వాహనాల్లో పోలీసులను వెంటబెట్టుకుని డీఎస్పీ రాత్రి 1 గంట సమయంలో రియాజ్‌ను మునుగోడు పీఎస్‌కు తరలించి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఆ సమయంలో స్థానిక పోలీసులను కూడా దగ్గరికి రానివ్వలేదని సమాచారం. 3 గంటల 30 నిమిషాలకు డీఎస్పీ నల్లగొండకు వెళ్లగా ఉదయం 7 గంటల సమయంలో రియాజ్‌ను మరో చోటుకు తరలించినట్లు తెలియవచ్చింది.
నయీమ్ ఇంటి నుంచి వాహనాలు స్వాధీనం
షాద్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం కాలనీలో నయీమ్ నివసించిన ఇంటి నుంచి పోలీసులు బుధవారం రెండు కార్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్న ఈ వాహనాలు ఎవరివి, ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు నయీమ్‌కు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు, ఇతరత్రా అంశాలను పోలీసులు బయటకు పొక్కనివ్వడం లేదు.
శ్రీధర్ ఆచూకీ సంగతేమిటి?
పూర్తి వివరాలు సమర్పించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడుగా భావిస్తున్న నీలా శ్రీధర్‌గౌడ్ ఆచూకీ కోసం అతని భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. శ్రీధర్‌గౌడ్ అదృశ్యంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ సీతారామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నయీమ్ ఎన్‌కౌంటర్ తరువాత పోలీసులు తన భర్తను పట్టుకెళ్లారని, ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియడం లేదని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ శ్రీధర్ భార్య శ్రీలత హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా శ్రీలత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్, ఆమె భర్త ఈ నెల 8న హస్తినాపురంలోని బంధువుల ఇంట్లో ఉండగా పోలీసులు వచ్చి తీసుకెళ్లారని తెలిపారు. నయీమ్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో శ్రీధర్‌గౌడ్‌కు ప్రాణహాని ఉందన్నారు.
నయీమ్ అనుచరులు వేధించారు ఆదిబట్ల గ్రామవాసి
ఇబ్రహీంపట్నం రూరల్: ‘‘గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు మా భూమి కబ్జా చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ వారు దాడులు, దౌర్జన్యాలు చేసినా జంకలేదు’’ అని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల గ్రామానికి చెందిన బురుగుల వెంకట్‌రెడ్డి పేర్కొన్నాడు. వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 2013లో ఆదిబట్ల గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 289లో 8 ఎకరాల భూమిని హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు కొనుగోలు చేశారు. కాగితాలు ఉన్నా దానికి సరిపోయేంత భూమి అక్కడ లేకపోవడంతో పక్కనే 490, 410 సర్వే నంబర్‌లోని మా భూమిని కబ్జా చేశారని వెంకట్‌రెడ్డి చెప్పాడు. సర్వే నంబర్ 289లోని భూమిని యజమానులు నయీమ్ అనుచరుడు శ్రీహరికి అమ్మారని, అతను చాలాసార్లు తమ కుటుంబ సభ్యులను బెదిరించాడని వెంకట్‌రెడ్డి తెలిపాడు. ప్రత్యక్ష దాడులకు కూడా దిగాడని, తమ భూమిలో ఉన్న దొండ తోటను కూడా ధ్వంసం చేశాడని చెప్పారు. శ్రీహరి భార్య మాధవి కూడా తమ ఇంటికి వచ్చి మహిళలపై దాడికి దిగిందన్నాడు. ఈ వ్యవహారంపై గతంలో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు వారి వైపే మొగ్గు చూపారని ఆరోపించాడు. ప్రస్తుతం ఈ స్థల వివాదం భూపరిపాలన శాఖలో పెండింగ్‌లో ఉందన్నాడు.
నయీమ్‌తో సంబంధాలపై విచారణ జరపండి
సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్: పోలీసులు, ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు నయీమ్ ముఠాతో ఉన్న సంబంధాలపై సమగ్ర విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వాలు, పోలీసుల అండదండలతో అరాచకాలు, హత్యలు చేస్తూ వేల ఎకరాల భూములు, కేజీల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల నగదును నయీమ్ కూడబెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. నయీమ్‌ను అడ్డం పెట్టుకుని చాలా మంది రాజకీయ నాయకులు, అధికారులు కోట్లు సంపాదించినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ నుంచి బహిష్కృతుడైన నయీమ్‌ను పోలీసులు చేరదీసి ఆ ముఠా ద్వారా ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలను హత్య చేయించారని ఆరోపించారు. చివరకు వారికే సవాల్‌గా మారడంతో నయీమ్‌ను మట్టుపెట్టారని వెల్లడించారు. నేరస్తులను మొగ్గలోనే తుంచివేసే పద్ధతిలో కఠినంగా వ్యవహరించడం ద్వారా ప్రజలకు భరోసానివ్వాలని ఆయన సూచించారు.