రాజ్యాధికారం కావాలి
2019 ఎన్నికల్లోపే రాజ్యాధికారంలో బీసీల వాటా తేల్చాలి
- బీసీల సమర శంఖారావం సభలో నేతల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: ‘మాకు రాయితీ లొద్దు.. రాజ్యాధికారం కావాలి. 2019 ఎన్నికలకు ముందే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో బీసీల వాటాను ప్రకటించాలి. లేదంటే ఆయా పార్టీలను శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయం’అని బీసీల సమర శంఖారావం సభ హెచ్చరించింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్ గౌడ్ అధ్య«క్షతన ఆదివారం హైదరాబాద్‌లో జరి గిన బీసీల సమరశంఖారావం సభకు కేంద్రమంత్రి దత్తాత్రేయ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, భిక్షమయ్య మాట్లాడారు.
119 నియోజకవర్గాల్లో పూలే విగ్రహాలు
బీసీల సమర శంఖారావం సభ జనాభా ప్రాతి పాదికన బీసీ రిజర్వేషన్లను 50శాతానికి పెంచాలని డిమాండ్ చేసింది. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను అధికారికంగా ప్రకటించాలని, మండల కమిషన్ మురళీధర్‌రావు, అనంతరామ కమిషన్ సిఫార్సులను విధిగా అమలు చేయాలని కోరింది. జాతీయస్థాయిలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసి, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని.. దానికి రాజ్యంగబద్ధమైన చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది.119 నియోజకవర్గాల్లో మహత్మా పూలే విగ్రహాలను ప్రతిష్టించాలని ప్రకటించింది.
త్వరలోనే బీసీ కమిషన్: దత్తాత్రేయ
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ త్వరలోనే జాతీయ స్థాయిలో బీసీ కమిషన్‌కు చట్టబద్ధత రాబోతోందని, దీనికి సంబంధించిన విధివిధానాలు ఇప్పటికే రూపొందించినట్లు తెలిపారు. మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. 2019 ఎన్నికల్లోపే బీసీ సబ్‌ప్లాన్‌ను, తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు.