- ప్రధాన నిందితుడి అరెస్టు
- చోరీ సొత్తుకొన్న మరో ఇద్దరూ కటకటాల్లోకి...
- మొత్తం 21 వాహనాల స్వాధీనం
నాచారం, న్యూస్‌లైన్: తండ్రి బైక్ కొనివ్వలేదని అలిగి ఇంటి నుంచి పారిపోయిన ఓ యువకుడు వాహనాల దొంగగా మారాడు. బాలానగర్ సీసీఎస్ పోలీసులు, నాచారం పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. అంతేకాకుండా ఇతని వద్ద నుంచి చోరీ బైక్‌లను కొన్న మరో ఇద్దరినీ కటకటాల్లోకి నెట్టారు. సోమవారం నాచారం ఠాణాలో మల్కాజిగిరి ఏసీపీ సీహెచ్ చెన్నయ్య తెలిపిన వివరాల ప్రకారం...
మల్లాపూర్ భవానినగర్‌కు చెందిన చుక్క ప్రవీన్‌బాబు(23) ప్రైవేట్ ఉద్యోగి. రెండేళ్ల క్రితం తన తండ్రిని బైక్ కొ నివ్వమని కోరగా.. ఆయన నిరాకరించారు. దీంతో అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రవీన్ బైక్ చోరీలు మొదలెట్టాడు. 2011లో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో ఇల్లెందులో నాలుగు ద్విచక్రవాహనాలు చోరీ చేశాడు. వీటిని ఇల్లెందుకే చెందిన గంగాధరణి శంకర్(27), మహబూబ్‌నగర్ జిల్లా రాచపల్లి గ్రా మానికి చెందిన భారత బాలరాజు(35)కు అమ్మాడు. ఇలా వచ్చిన డబ్బుతో జల్సా చేస్తున్నాడు.
ఆ తర్వాత నగరంలోని నాచారం, ఉప్పల్, మేడిపల్లి, చైతన్యపురి పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు బైకులను దొంగి లించాడు. బాలానగర్ సీసీఎస్ ఠాణా ఎస్సై సైదులు అందిచిన సమాచారం మేరకు బాలానగర్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ వి.యాదగిరిరెడ్డి బృందం ఆదివారం నాచారం చౌరస్తాలో ప్రవీన్‌బాబును అరెస్ట్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడు గత రెండేళ్లలో తాను దొంగిలించిన బైక్‌ల వివరాలు చెప్పాడు.
వీటిని శంకర్, బాలరాజులకు అమ్మినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు ఈ ఇద్దరిని అరెస్టు చేయడంతో పాటు రూ.12 లక్షల విలువైన 21 బైకులను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన నాచారం ఇన్‌స్పెక్టర్ అశోక్‌కుమార్, బాలానగర్ సీసీఎస్ పోలీసులను ఏసీపి చెన్నయ్య అభినందించారు.