ముహూర్తం..11:13
►దసరా రోజున ఇదే సమయంలో అన్ని కొత్త జిల్లాల ప్రారంభోత్సవం
► దాదాపు 300 ఉత్తర్వుల విడుదలకు ఏర్పాట్లు
► తొలుత కొత్త జిల్లాల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్
► ఆ వెంటనే కలెక్టర్, ఎస్పీల నియామకాలు..
► ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు
► 11.13 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ
► ఏర్పాట్లు చేసుకొనేందుకు అధికారులకు ముందుగానే మౌఖిక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. దసరా రోజున అంటే ఈ నెల 11వ తేదీన ఉదయం 11.13 గంటలకు కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరుగనుంది. అన్ని జిల్లాల్లోనూ ఇదే సమయంలో ప్రారంభోత్సవం జరగాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇక కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం దసరా పండుగ రోజే ఉత్తర్వులన్నీ జారీ చేయనుంది. ఆ రోజు ఉదయమే దాదాపు 300కు పైగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. తొలుత కొత్త జిల్లాల ఏర్పాటును ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆ వెంటనే కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ అవుతాయి.
తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా ఆర్డర్ టు సర్వ్ విధానంలో అధికారులను నియమిస్తారు. అయితే కొత్త జిల్లాలకు వెళ్లి తమ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేసుకునేందుకు సంబంధిత అధికారులకు ప్రభుత్వం ముందుగానే మౌఖిక ఆదేశాలు జారీ చేయనుంది. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు, అన్ని శాఖల కార్యాలయాల ప్రారంభోత్సవాలను ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లా కేంద్రాల్లో ఉదయం 11.13 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించి.. పోలీసు పరేడ్‌ను నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు మంత్రులు, జిల్లాధికారులు తమకు నిర్దేశించిన జిల్లాల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు.
నమూనా ఉత్తర్వులు సిద్ధం
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు ప్రభుత్వ ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ విధానంలో కేటాయించేందుకు జారీ చేయాల్సిన తాత్కాలిక ఉత్తర్వుల నమూనాను శనివారం సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసింది. ఆ నమూనాను అనుసరించి అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. ఉద్యోగులు ఈ నెల 11న కొత్త జిల్లాల్లో విధుల్లో చేరే విధంగా వారిని సంబంధిత అధికారులు తక్షణమే రిలీవ్ చేసేలా ఆదేశించాలని.. ఇందుకోసం శాఖల వారీగా ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది ప్రకటన సిద్ధమయ్యాక ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు సంబురాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రత్యేకంగా జారీ చేయనుంది.
త్వరలో కొత్త పోస్టుల మంజూరు
జిల్లా కలెక్టరేట్లు, కొత్త మండలాలకు తహసీల్దార్లు సహా వివిధ పోస్టులను మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. 119 మండలాలకు ఓఎస్డీలు, ఎంఈవోలు, వ్యవసాయాధికారుల పోస్టులను మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, విద్యా, వ్యవసాయ శాఖలు ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. ప్రభుత్వం కొత్త జిల్లాల ముసాయిదాలో 27 జిల్లాలను ప్రకటించగా.. అనంతరం వాటిని 31కి పెంచిన విషయం తెలిసిందే. దీంతో అదనంగా పెరిగిన నాలుగు జిల్లాలకు కలెక్టర్, జేసీ, ఎస్పీ, అదనపు ఎస్పీ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయనుంది.