సీవో అంటే కొకైన్.. బ్లాక్‌బెర్రీ అంటే అమ్మాయి
సీవో అంటే కొకైన్.. బ్లాక్‌బెర్రీ అంటే అమ్మాయి
Published Tue, Jul 25 2017 4:09 AM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM
- డ్రగ్స్ రవాణా, వ్యభిచారం చేస్తున్న నైజీరియన్ ముఠా అరెస్టు
- రూ.2 లక్షల నగదు, 8 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- డ్రగ్స్, యువతుల సమాచారాన్ని డైరీలో కోడ్ భాషలో రాసుకున్న నైజీరియన్లు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ రవాణా, వ్యభిచారానికి పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను రాచకొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ ముఠాలోని ఐదుగురు నైజీరియన్లతోపాటు వారికి సహకరిస్తున్న విజయవాడకు చెందిన ఓ మహిళను అదుపు లోకి తీసుకున్నారు. వారి నుంచి 2,04,000 నగదుతో కలుపుకొని రూ.9,70,000 విలువ చేసే 20 గ్రాముల కొకైన్, 12 గ్రాముల బ్రౌన్ షుగర్, 39.8 గ్రాముల అంఫిటమైన్ ట్యాబ్లెట్లు, 1.675 కిలోల గంజాయి, 3 ల్యాప్‌టాప్‌లు, 6 పాస్‌పోర్టులు, తొమ్మిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.
ఫేస్‌బుక్‌లో పరిచయం నుంచి..
విజయవాడకు చెందిన పాలపర్తి సంగీతకు పెళ్లయిన ఆరు నెలలకే భర్త చనిపోయాడు. అనంతరం విజయవాడలోని ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఫేస్‌బుక్‌లో సూడాన్‌కు చెందిన ఓ అమ్మాయి పరిచయమైంది. కొంతకాలానికి సంగీత హైదరాబాద్‌కు మకాం మార్చగా.. ఆ సూడాన్ స్నేహితురాలి ద్వారా నైజీరియాకు చెందిన ఒజుకు కాస్మోస్, అతడి స్నేహితులతో పరిచయమైంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి వారితో కలసి డ్రగ్స్ అక్రమ రవాణాలో భాగస్వామిగా మారింది. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని బండ్లగూడ సన్‌సిటీలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఒజుకు కాస్మోస్‌తో కలసి ఉంటోంది. కాస్మోస్ గాబ్రిల్ అనే స్నేహితుడి సహాయంతో కొకైన్, బ్రౌన్‌షుగర్, అంఫిటమైన్ టాబ్లెట్‌లను తీసుకొచ్చి... తన స్నేహితులు జాన్ ఒకొరి, సిరిల్, హెన్రీ, సంగీతలతో కలసి హైదరాబాద్‌లో సరఫరా చేస్తున్నాడు. సంగీత పేరు మీద బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు తీసుకుని వినియోగిస్తున్నాడు. జాన్, సిరిల్‌లు నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు.
పక్కా సమాచారంతో..
కొందరు నైజీరియన్లు డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో రాచకొండ ఎస్‌వోటీ, ఎల్‌బీ నగర్ పోలీసులు నిఘాపెట్టారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఎల్‌బీనగర్ బస్టాపులో సంగీతను, జాన్‌ను అదుపులోకి తీసుకుని.. మూడు గ్రాముల కొకైన్, 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంగీత వెల్లడించిన వివరాల మేరకు.. సన్‌సిటీలోని నివాసంలో దాడి చేసి కాస్మోస్‌ను అరెస్టు చేసి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కాస్మోస్ ఇచ్చిన సమాచారంతో మేడ్చల్ జిల్లా యాప్రాల్‌లోని తిరు అపార్ట్‌మెంట్‌లో, సిరిల్ అనే ముఠా సభ్యుడి నివాసంలో కార్డన్ సెర్చ్ చేపట్టి మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
కోడ్ లాంగ్వేజ్‌తో రాతలు
సీవో అంటే కొకైన్.. బ్లాక్‌బెర్రీ అంటే అమ్మాయి.. నైజీరియన్ ముఠా సభ్యులు తమ దందాలను కోడ్ భాషలో రాసుకునే పదాలివి. వారు నైజీరియన్ యువతులతో యాప్రాల్ కేంద్రంగా.. కుషాయి గూడ, ఏఎస్‌రావు నగర్, జవహర్‌నగర్, నేరేడ్ మెట్‌లలో వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో కీలక నిందితుడు గాబ్రిల్ కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాకు గోవాలోని డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్టు తేలింది. దీనిపై పోలీసులు గోవా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసుల్లో అరెస్టైన వారికి, ఈ ముఠాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న దిశగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.
Advertisement