భయం వద్దు.. హాయిగా ఆరగిద్దాం..
చికెన్,ఎగ్ మేళాకు అనూహ్య స్పందన
పౌల్టీ పరిశ్రమకు ప్రభుత్వ అండగా ఉంటుందని మంత్రుల హామీ
సిటీబ్యూరో: అపోహలకు, అనుమానాలకు తావు లేకుండా మాంసాహార ప్రియులంతా చికెన్, గుడ్డు ఆరగించవచ్చని మంత్రులు పిలుపునిచ్చారు. చికెన్ ,గుడ్డు ద్వారా పౌష్టికాహారం లభిస్తుందని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసొసియేషన్, నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన చికెన్ అండ్ ఎగ్ మేళాకు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి హాజరయ్యారు.
అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రులు చికెన్ ఆరగించడమే కాకుండా బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించారు. పౌల్ట్రీ పరిశ్రమను కాపాడేందుకు, మరింత అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. ఆర్థిక వుంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హోంమంత్రి నాయిని తన ప్రసంగంతో అందర్నీ ఉత్సాహపరిచారు. ఎలాంటి భయం లేకుండా బలవర్ధకమైన గుడ్డు, చికెన్‌ను తినాలని సూచించారు. స్నేహ చికెన్ ఎండీ రాంరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాయకులు మాళవిక,సుధామయి,సింహ, హిందీ గాయకులు మోనాలీసా,రత్న తదితరులు ఆలపించిన పాటలు,నృత్యప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.