
తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్న దృశ్యం
హెదరాబాద్ : చారిత్రక హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనుల్లో భాగంగా చేపడుతున్న నాలా మళ్లింపు పనుల కారణంగా శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను నిషేధించారు. లిబర్టీ నుంచి రాణిగంజ్ వరకు వాహనాల రాకపోకలకు వీలు లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. బుద్ధభవన్ నుంచి రాణిగంజ్- కలాసీగూడ నాలా వరకు పారిశ్రామిక వ్యర్థ జలాలను మళ్లించేందుకు భారీ పైప్‌లైన్ వేయనున్నందున ట్రాఫిక్ పోలీసుల నుంచి అనుమతులు తీసుకొని రాకపోకలు నిలిపివేసినట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
కాగా కూకట్‌పల్లి, జీడిమెట్ల నాలాల నుంచి రోజువారీగా వచ్చి చేరుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాలు సాగర్‌లోకి చేరకుండా నేరుగా అంబర్‌పేట్‌లోని మురుగు శుద్ధి కేంద్రానికి మళ్లించేందుకు సుమారు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో నాలా మళ్లింపు పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పనుల్లో భాగంగా ప్రకాశ్‌నగర్- నెక్లెస్‌రోడ్డు - పి.వి.ఘాట్- జీహెచ్‌ఎంసీ హెర్బల్ గార్డెన్- మారియట్ హోటల్ మార్గాల్లోనూ నాలా మళ్లింపు పనులను యుద్ధప్రాతిపాదికన చేపడుతున్నట్లు జలమండలి ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డి తెలిపారు.