
కాంగ్రెస్‌ను వీడిన వారికి నో ఎంట్రీ
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోయిన వారికి పార్టీలోకి తిరిగి ప్రవేశం ఉండదని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా స్పష్టం చేశారు. ఏఐసీసీ విరాళాల కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం కొద్దిసేపు ఆగారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ... రాహుల్‌గాంధీ ఫార్ములా ప్రకారం పార్టీలో రెండేళ్లు విధిగా పనిచేయాల్సి ఉంటుందని, పార్టీని వీడిపోయిన వారు తిరిగి వస్తే టికెట్లు వచ్చే అవకాశమే లేదన్నారు.
పీసీసీ నాయకత్వ మార్పు ఉండకపోవచ్చని, పార్టీలో సమన్వయంతో పని జరుగుతున్నదన్నారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్న దిగ్విజయ్‌సింగ్, తన మార్పు అంశం అధిష్టానం పరిధిలోనిదన్నారు. ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజు నోటీసులు ఇచ్చిన సంగతి తనకు తెలియదని.. వారికి నోటీసులు ఎందుకు ఇచ్చారో, దాని పరిణామాలేమిటో తెలుసుకుంటానని చెప్పారు.