ఆ మాట కూడా వినిపించకూడదు | no farmer suicides after 4 years, says kcr | Sakshi
Sakshi News home page

ఆ మాట కూడా వినిపించకూడదు

Published Sat, Apr 9 2016 4:41 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

ఆ మాట కూడా వినిపించకూడదు - Sakshi

ఆ మాట కూడా వినిపించకూడదు

నాలుగైదేళ్ల తర్వాత రైతు ఆత్మహత్యలు ఉండవు
ఆ మాట కూడా వినిపించకూడదు: ఉగాది వేడుకలో కేసీఆర్
కరువురహిత రాష్ట్రంగా తెలంగాణ
క్షణకాలం కూడా కరెంటు పోకుండా చూస్తాం
రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం
నీటి కోసం మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నాం
పక్షం రోజుల్లో తుది ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభిస్తాం
ఐటీలో త్వరలోనే రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలుస్తుంది
ఇప్పుడు రాష్ట్ర ఆదాయం ఎంతో తేలిపోయింది
మరే రాష్ట్రంలో లేనివిధంగా 15 శాతం వృద్ధి సాధించాం

 
సాక్షి, హైదరాబాద్
‘‘మరో నాలుగైదేళ్లలో తెలంగాణ కరువు రహిత రాష్ట్రంగా ఉంటుంది. రాష్ట్రంలో రైతు ఆత్మహత్య అన్న మాటే వినిపించకూడదు. కరువును శాశ్వతంగా నివారించాలి. ఈ దిశలో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. క్షణకాలం కూడా కరెంటు పోకుండా ఏర్పాట్లు చేస్తాం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. శుక్రవారం రవీంద్రభారతిలో దుర్ముఖి నామ ఉగాది వేడుకలను ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించారు. శృంగేరీ ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శర్మ పంచాంగ పఠనం అనంతరం సీఎం ప్రసంగించారు. వచ్చే పండుగను తెలంగాణలో జరుపుకొంటామంటూ ఇదే రవీంద్రభారతి వేదిక మీదుగా ఎన్నోసార్లు అనుకున్నామన్నారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో పండుగ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని, తెలంగాణను అన్నింటా గొప్పగా నిలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
 
‘‘నేను ఇటీవల అసెంబ్లీలో చెప్పా.. మూడు ప్రధానాంశాలు.. నిధులు, నియామకాలు, నీళ్లు. ఇందులో రెండు పరిష్కారమయ్యాయి. రాష్ట్రాన్ని పాలించుకునేది మనమే కాబట్టి రూపాయి కూడా వేరేచోటుకి పోదు. మన ఉద్యోగాలు మనకే వస్తాయి. ఇక మిగిలింది నీళ్లు. కొత్త రాష్ట్రం పునాది బలంగా ఉండాలే. లేకుంటే భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి. అందుకే నాలుగు రోజులు ఆలస్యమైనా ఫర్వాలేదు క్షుణ్ణంగా అధ్యయనం చేసి అవగాహన తెచ్చుకున్నాకే అడుగేయాలనుకొని పనిచేశాం. ఒక్కోరోజు రాత్రి రెండు మూడు గంటల దాకా కూర్చుని పరిశీలించాం. ఏడాది తర్వాత పనిలోకి దిగాం. వానలు లేకున్నా, కరువున్నా తెలంగాణకు నీళ్లొచ్చే విధంగా ఇటీవల మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాం. శాశ్వతంగా కరువు నివారణ దిశగా అడుగులేస్తున్నాం. మరో పక్షం రోజుల్లో తుది ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభిస్తాం..’ అని సీఎం అన్నారు.
 
 త్వరలో ఐటీలో మనమే నెంబర్ వన్
 గ తేడాది 1,500 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రం పాలయ్యాయని, వాటిని ఒడిసిపట్టుకుని ఉంటే తెలంగాణలో కరువు, కష్టాలుండేవి కావని ముఖ్యమంత్రి అన్నారు. ఈసారి ఆ దుస్థితి రావొద్దన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. దేవుడు దయతలిస్తే కరెంటు కారుచీకట్లు కూడా ఉండవన్నారు. అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నామని, ఐటీ రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఇప్పుడు తెలంగాణ ఆదాయం ఎంతో స్పష్టంగా తెలిసిందని, తెలంగాణ వచ్చాక ఒక ఆర్థిక సంవత్సరం సంపూర్ణంగా సాగటంతో వాస్తవాలు కచ్చితంగా తేలిపోయాయని చెప్పారు. మరే రాష్ట్రంలో లేనట్టుగా ఆదాయంలో తెలంగాణ 15 శాతం వృద్ధి సాధించటం గొప్ప వరమన్నారు. ఆంధ్రాలో కలవకముందున్నది మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ స్టేట్ అని, ఇప్పుడు సంపూర్ణ తెలంగాణ ఉన్నందున ఆదాయం వివరాలు తెలిశాయన్నారు. ఫలితంగా అద్భుత ప్రగతికి బాటలు పడతాయని ఈ దుర్మిఖి ఉగాది వేదిక మీదుగా రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెబుతున్నానన్నారు.
 
 కడియం, లక్ష్మారెడ్డి జాగ్రత్త!
 పంచాగ పఠనంలో భాగంగా వైద్యం, విద్య రంగాల్లో అవినీతి పెరుగుతుందని పండితుడు చెప్పిన అంశాన్ని ఉటంకించిన సీఎం కేసీఆర్.. ఆ శాఖల మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి జాగ్రత్తగా ఉండాలని సరదాగా వ్యాఖ్యానించారు. దాన్ని అధిగమించే శక్తి వారికుందని కూడా ముక్తాయించారు. పంచాంగం మార్గనిర్దేశం చేస్తుందని, ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగాలని, మనమే గొప్ప అనే గర్వం లేకుండా చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే లక్ష్యం సిద్ధిస్తుందన్నారు. పంచాంగంలో పేర్కొనే కొన్ని విషయాలు ఆందోళన కలిగించినా భయపడకుండా సద్భుద్దితో సాగాలన్నారు. ఎన్నికల సమయంలో ట్రెండ్స్ అనుకూలంగా లేకున్నా పనిచేసుకుంటూ పోవటాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement