
'పార్టీ సత్తా ఏమిటో వచ్చే నెలాఖరున చూపిస్తాం'
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ సత్తా ఏమిటో జనవరి నెలాఖరు నాటికి చూపిస్తామని తెలంగాణ ఐటీ మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అని ఆయన గుర్తు చేశారు. కొత్తవారు చేరికతో పార్టీలో ఏర్పడే ఇబ్బందులు సాధారణమే అని కేటీఆర్ తెలిపారు. ఎవరిని ప్రలోభాలకు గురి చేయడం లేదన్నారు.
శుక్రవారం హైదరాబాద్లో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఏడాది 60 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. గోదావరి, కృష్ణా నదీ జలాలు పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. రానున్న తరాలకు పవర్ కట్ అంటే ఏమిటో తెలియకుండా చేస్తామన్నారు.
పరిశ్రమలకు పవర్ హాలీడే లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగూడెం ప్లాంట్లో 30 శాతం ఉత్పత్తి పెంచామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా వాడుతున్న హెలికాప్టర్ కేబిన్... హైదరాబాద్లోనే తయారు అయిందని చెప్పడానిక గర్వంగా ఉందని కేటీఆర్ అన్నారు.