సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరో రెండు గ్యారెంటీలపై రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, వరికి రూ.500 బోనస్ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మంగళవారం సివిల్ సప్లై అధికారులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
‘సివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. రూ.500కు గ్యాస్ సిలిండర్, వరికి రూ.500 బోనస్ మరో వంద రోజుల్లో అమలు చేస్తాం. ప్రజలకు ఇచ్చే బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తోంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి. ఇప్పటి వరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. బియ్యం తీసుకునే లబ్ధిదారులు రాష్ట్రంలో 2కోట్ల 80 లక్షల మంది ఉన్నారు. వడ్ల కొనుగోలుకు సివిల్ సప్లై శాఖ అన్ని చర్యలు తీసుకోవాలి. రైతులకు డబ్బు వెంటనే అందాలి’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
‘ప్రజలకు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని వారు ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది గమనించాలి. కిలో 39 రూపాయలు పెట్టి మనం సేకరిస్తున్న బియ్యం ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం. అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుంది. మొక్కుబడిగా బియ్యం పంపిణీ కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలి. బియ్యం లబ్దిదారులను ర్యాండమ్ చెక్ చెయ్యాలి. ప్రజల నుంచి సమాచారం సేకరించాలి’ అని ఉత్తమ్ అధికారులకు సూచించారు.
‘గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖకు ఆర్థిక సహాయం చేయక పోవడంతో 56 వేల కోట్లు అప్పు చేసింది. రూ.11 వేల నష్టాల్లో శాఖ కూరుకుపోయింది. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లోపాలున్నాయి.రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల్లో బియ్యం తీసుకున్న వారు 89 శాతం దాటడడం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తా’ అని ఉత్తమ్ తెలిపారు.
ఇదీచదవండి..జనార్ధన్ రెడ్డి రాజీనామా.. మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన తమిళిసై
Comments
Please login to add a commentAdd a comment