సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం నుంచి వచ్చే నెల 6వరకు అమలు చేయనున్న ‘ప్రజాపాలన’కార్యక్రమాన్ని అధికారులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవ హారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రజా పాలన అమలు విషయంలో నిర్లక్ష్యం వద్దని రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో పాటు మిగతా శాఖల భాగస్వామ్యంతో పదిరోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డుల్లో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు.
రేపు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలిస్తాం..
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను శుక్రవారం పరిశీలిస్తామని, వంతెన కుంగిన ఘటనను పరిశీలించి విచారణ చేపట్టి అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంథనిలోని కాళేశ్వరం ప్రాజెక్టు, హుస్నాబాద్‌లోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment