తెలంగాణ సీనియర్ మంత్రి హరీష్ రావు తొందరపడుతున్నారు. కారణం ఏమో కానీ, ఆయన బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన దుందుడుకుగా వ్యవహరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా అదంతా ఉద్యమంలో భాగమని సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన బాధ్యత కలిగిన మంత్రిగా ఉన్నారు. దానికి తగినట్లు ఆయన హుందాగా ఉండాలి. అందులోను పొరుగు రాష్ట్రం గురించి , పక్క రాష్ట్రం ప్రజల గురించి మాట్లాడేటప్పుడు మరింత పద్ధతిగా వ్యవహరించాలి. దురదృష్టవశాత్తు హరీష్ రావు అందుకు భిన్నంగా మాట్లాడి ఆంధ్ర నేతలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారనిపిస్తుంది.
హరీష్ రావు సమర్ధనేతగా గుర్తింపు పొందారు. టాస్క్ మాస్టర్ గా కూడా పేరొందారు. అయినా అక్కడి రాజకీయ కారణాలతో కొన్నిసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ చరిత్ర అవసరం లేదు. కానీ హరీష్ ఎందుకో అప్పుడప్పుడు ఆంధ్రనేతలను గిల్లుతుంటారు. తాజాగా కూడా ఆయన అదే పనిచేశారు. దానికి అదే రీతిలో ఏపీ మంత్రులు కూడా స్పందించారు. వీరిలో కూడా ఒకరు కొంచెం ఎక్కువగానే మాట్లాడి ఉండవచ్చు. కానీ అందుకు హరీష్ అవకాశం ఇచ్చారు. హరీష్ ఆంధ్ర పాలన గురించి, ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితుల గురించి తనదైన భాషలో మాట్లాడారు. వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రాంతం వారిని అవమానించేలా ఉన్నాయి.
తెలంగాణలో పనులు చేసుకుంటున్న వలస కూలీలను ఉద్దేశించి అక్కడే ఓటర్లుగా మారాలని కోరారు. అంతవరకు తప్పు లేదు. కానీ ఆంధ్రలో అసలు ఏమీ లేనట్లు, ఇక్కడ రోడ్లు లేనట్లు, పాలనే సాగనట్లు, ఏపీలో సంక్షేమ స్కీములు లేనట్లు ఏవేవో అనవసరంగా మాట్లాడారు. ఆయన కాకతాళీయంగా మాట్లాడానని అన్నప్పటికి, అవి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రజలను అవమానించేలా ఉన్నాయి. ఎదుటివారు హర్ట్ అయ్యారని తెలిసిన వెంటనే సారీ అంటే సరిపోయేది.. అలాకాకుండా మళ్లీ రెచ్చగొట్టేలా మాట్లాడారు.
'ఆంధ్రనేతలారా! మా జోలికి రావద్దు. మా గురించి మాట్లాడకపోతేనే మీకు మంచిది "అని హెచ్చరించారట. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. తెలంగాణలో అమలు అవుతున్న స్కీములు ఎపిలో లేవని అన్నారట. అసలు రెండు రాష్ట్రాల మధ్య పోల్చి చూడవలసిన అవసరం ఏముంది?హైదరాబాద్ నగరం ద్వారా వచ్చిన అడ్వాంటేజ్ ను అనుభవిస్తున్న తెలంగాణ నేతలు, ఏపీని అగౌరవపరిచేలా మాట్లాడనవసరం లేదు.
ఎంత టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినా హరీష్ రావు పాత తత్వం మారలేదని దీనిద్వారా అర్ధం అవుతుంది. ఆయనకు ఆంధ్ర వాసులు అంటే ద్వేషం కొంచెం ఎక్కువే. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉద్యమ సమయంలో సిద్దిపేట సమీపంలోని లక్ష్మీపురం అనే గ్రామం అనుకుంటా. అక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్లినవారు ఎక్కువ మంది స్థిరపడ్డారు. వారిపై ఆయన ఆద్వర్యంలో దాడి జరిపే యత్నం వార్త అప్పట్లో పెద్ద సంచలనం అయింది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా హరీష్ రావు, మరో మంత్రి ప్రశాంతరెడ్డి వంటి కొద్ది మంది ఆంధ్రపై నోరు పారేసుకున్నారు. తద్వారా తీవ్ర విమర్శలకు గురి అయ్యారు. ఏ రాష్ట్రంలో ఉండే పాజిటివ్ అంశాలు అక్కడ ఉంటాయి. ఏ రాష్ట్రంలో ఉండే నెగిటివ్ పాయింట్లు అక్కడ ఉంటాయి. సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. ఏదైనా ఎన్నికల సమయం అయితే అదో రకం. అలాంటిదేమీ లేకుండానే హరీష్ మాట్లాడడం ఏపీ మంత్రులకు ఆగ్రహం తెప్పించింది. వారు ఏపీలో జరుగుతున్న అమ్మ ఒడి, స్కూళ్ల నాడు-నేడు, చేయూత, కాపు నేస్తం, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ , రైతు భరోసా కేంద్రాలు తదితర స్కీముల గురించి ప్రస్తావించి అవి తెలంగాణలో ఉన్నాయా అని అడిగారు. ఏపీలో ఆయన ఎప్పుడుపర్యటించారు కనుక రోడ్లు బాగోలేదని అంటారు. నిజానికి ఈ మధ్య రాష్ట్రంలో రోడ్లన్నీ బాగుపడ్డాయి. అయినా అదొక నిరంతరం ప్రక్రియ.
హైదరాబాద్ నగరంలో అనేక కాలనీలలో రోడ్లు సరిగా ఉండవు. డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంటుంది. వీటికి సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు డెక్కన్ క్రానికల్ వంటి పత్రికలలో ఒక పేజీలో ప్రత్యేకంగా వస్తుంటాయి. వర్షం పడితే పలు చోట్ల రోడ్లు ఎలా మారతాయో అందరికీ తెలుసు. సరూర్ నగర్ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడింది చూశాం .తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు( ప్రస్తుతం బీఆర్ఎస్)పలు హామీలు ఇచ్చారు. వాటిలో పలు హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. ఆ విషయాలను అక్కడి ప్రతిపక్షాలు ప్రస్తావిస్తుంటాయి. వాటి గురించి హరీష్ ఏమి చెబుతారు.
ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పేర్ని నాని చమత్కారంగా మాట్లాడుతూ మామ కేసీఆర్ పై కోపం వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్లను హరీష్ తిడుతుంటాడని, చంద్రబాబు మాదిరి ఎప్పుడోసారి మామకు ఈయన కూడా పోటు పొడవవచ్చని వ్యాఖ్యానించారు. మంత్రులు కారుమూరి, బొత్స, సిదిరి అప్పలరాజు లు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. సిదిరి మాత్రం కొన్ని పదాలు అతిగా వాడారు. ఆయన అలాంటి పదాలు వినియోగించి ఉండాల్సింది కాదు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యల వల్ల రాజకీయంగా ఆయన పార్టీకే నష్టం కలిగించవచ్చు.
ఎంతకాదన్నా తెలంగాణలో హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాలలో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఇటీవలికాలంలో వారిలో పలువురు బీఆర్ఎస్ కు అనుకూలంగానే ఉన్నారు. వారిలో చాలామంది ఏపీ ముఖ్యమంత్రి జగన్ మద్దతుదారులు కూడా ఉండవచ్చు. వారందరిలో అసంతృప్తి కలిగితే బీఆర్ఎస్ కే నష్టం అన్న సంగతి హరీష్ గమనించాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల కళ్లలో సంతోషం చూడడానికి హరీష్ అలాంటి మాటలు మాట్లాడారేమో తెలియదు. ఇకనైనా ఆయన తన ధోరణి మార్చుకుంటే మంచిది. గతంలో మంత్రి కేటీఆర్ కూడా ఇలాగే మాట్లాడి ఆ వెంటనే సరిదిద్దుకున్నారు. హరీష్ అలా చేయకపోవడం బాధాకరం. రెండు రాష్ట్రాలు కలిసి,మెలిసి ఉండవలసిన తరుణంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు స్వాగతించవలసిన పరిణామం కాదని చెప్పాలి.
మరో సంగతి ఏమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వివాదంలో జోక్యం చేసుకుని ఆంధ్ర నేతలను తప్పుపట్టారు కానీ, తెలంగాణ మంత్రి హరీష్ రావును ఒక్క మాట అనలేకపోయారు. ఎంత హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నా, ఏపీలో రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ఆయన విస్మరించరాదు. ఇక విశాఖ ఉక్కు గురించి కూడా హరీష్, కేటీఆర్ లు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి.
వారితో పోటీపడి పవన్ కళ్యాణ్ తాను కేంద్రంతో మాట్లాడి రావడం వల్లే అంతా ఆగిపోయిందని చెప్పేసుకున్నారు. కేంద్ర మంత్రి విశాఖలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజ్ చేయడం లేదన్నట్లుగా మాట్లాడగానే ఇదంతా తమ ఘనతేనని వారు అన్నారు. ఆ వెంటనే ఆ కేంద్ర మంత్రి మాట మార్చారు. తదుపరి కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆపలేదని స్పష్టం చేసింది. దాంతో వీరు తీసుకున్న క్రెడిట్ ఉత్తిదే అని తేలింది. ఆ తర్వాత వీరు ఆ ఊసెత్తలేదు.
ఒక పక్క తెలంగాణలో నిజాం షుగర్స్ ను తెరిపించడంలో వైఫల్యం చెందిన తెలంగాణ మంత్రులు విశాఖ ఉక్కు గురించి భారీగా ప్రసంగాలు చేస్తున్నారు. నిజంగానే అంత డబ్బు ఉంటే బయ్యారం స్టీల్ ప్లాంట్ ను వారే ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. అన్నిటికి మించి ఆర్ధిక మంత్రిగా హరీష్ రావు ఉద్యోగులకు ఏ నెలకు ఆ నెల మొదటి తేదీన జీతాలు ఇచ్చి శభాష్ అనిపించుకోవచ్చు కదా!
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment