కరిగిన సైబర్ కల.. ‘సాఫ్ట్’ సంక్షోభంలో గ్రేటర్ సిటీ | no software boom in hyderabad | Sakshi
Sakshi News home page

కరిగిన సైబర్ కల.. ‘సాఫ్ట్’ సంక్షోభంలో గ్రేటర్ సిటీ

Published Mon, Sep 30 2013 1:45 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

కరిగిన సైబర్ కల.. ‘సాఫ్ట్’ సంక్షోభంలో గ్రేటర్ సిటీ - Sakshi

కరిగిన సైబర్ కల.. ‘సాఫ్ట్’ సంక్షోభంలో గ్రేటర్ సిటీ

సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్‌తోనే ఔరా అనిపించుకున్న హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ సామ్రాజ్యం. ఇంజనీరింగ్, ఎంసీఏ వంటి సాంకేతిక కోర్సులు పూర్తి చేసిన లక్షలాది మంది యువతకు కొంగుబంగారంగా విలసిల్లిన సైబరాబాద్. నిత్యం విద్యార్థులతో కిటకిటలాడే ‘అమీర్‌పేట్’ సాఫ్ట్‌వేర్ శిక్షణ సంస్థలు. కానీ ఇదంతా ఇప్పుడు గతించిన చరిత్ర ... 


 ఐటీ హబ్‌గా ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించిన గ్రేటర్ సిటీ ఇప్పుడు ‘సాఫ్ట్’ సంక్షోభంలో కూరుకుపోయింది. కంపెనీలే కొత్త ప్రాజెక్టుల కోసం దిక్కులు చూస్తున్న పరిస్థితి. అత్యవసరం అనుకుంటే తప్ప రిక్రూట్‌మెంట్ ఊసే ఎత్తడం లేదు. ఒకటీ అరా కొత్తవారికి అవకాశం ఇచ్చినా చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లోనే పోస్టింగ్ ఇస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఇన్నాళ్లూ సాఫ్ట్‌వేర్ రంగాన్నే నమ్ముకున్న శిక్షణ సంస్థలది మరో గోస. వాటిహవా పూర్తిగా తగ్గిపోయింది. అమీర్‌పేట్‌లో ఒకప్పుడు ఏటా 3 లక్షల మంది విద్యార్థులకు పలు కోర్సులు నేర్పుతూ కళకళలాడిన శిక్షణ సంస్థలు ఇప్పుడు లక్ష మంది విద్యార్థులు కూడా రాక కుదేలయ్యాయి. దశాబ్దాలుగా పాతుకుపోయిన శిక్షణ సంస్థలు మాత్రమే పంటిబిగువున మనుగడ కొనసాగిస్తున్నాయి. అమీర్‌పేట్‌లో 200పై చిలుకు ఉండే సాఫ్ట్‌వేర్ శిక్షణ సంస్థల్లో 50 దాకా మూతబడ్డాయి. మరికొన్ని సంస్థలు చెన్నై, బెంగళూరుకు మకాం మార్చాయి. ఇంకొన్ని సంస్థలు కూడా ఇదే బాట పట్టనున్నాయి.
 
 మూడేళ్లుగా నీలినీడలు : మూడేళ్ల క్రితం వరకు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ రంగం యమా ఊపులో ఉంది. కానీ ఆ తరవాత రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులుపలు సాఫ్ట్‌వేర్ కంపెనీలను డైలమాలో పడేశాయి. సకాలంలో ప్రాజెక్టులు పూర్తవుతాయన్న భరోసా లేకపోవడంతో ఆఫ్ షోర్ వర్కులు కూడా మందగించాయి. అందుకే చిన్నా చితకా ప్రాజెక్టులే తప్ప పెద్దవేవీ నగ రం దరిదాపుల్లోకి రావడం లేదని సాఫ్ట్‌వేర్ నిపుణులు చెబుతున్నా రు. అవన్నీ చెన్నై, బెంగళూరులకు తరలిపోయాయంటున్నారు.
 
 క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కలే: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ కొలువును కాపాడుకోవడానికే ఆపసోపాలు పడుతున్నారు. ఇక ఫ్రెషర్స్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇంజనీరింగ్ కాలేజీలకు నేరుగా వెళ్లి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులను ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ఎగరేసుకుపోయే సంస్కృతి ఎప్పుడో కనుమరుగైంది.మల్టిపుల్ స్కిల్స్ ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. దాంతో లక్షలు పోసి చదువుకున్న వారు కూడా ఏ చిన్న కంపెనీలోనైనా చేరిపోయేందుకు సిద్ధపడి సైబర్ టవర్స్ చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా లాభం లేక విసిగి వేసారి, చివరికి చదివిన చదువుతో ఏ సంబంధమూ లేని ఉద్యోగాల్లో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మాన్‌పవర్‌కు, టెక్నికల్ స్కిల్స్‌కు పెట్టింది పేరైన హైదరాబాద్‌లో ఇప్పుడు రిక్రూట్‌మెంట్లు దాదాపుగా నిలిచిపోయాయంటే అతిశయోక్తి కాదు. తీసుకున్న సిబ్బందిని కూడా ఇక్కడైతే ప్రాజెక్టు వర్కులు సకాలంలో పూర్తి కావన్న భయంతో చెన్నై, బెంగళూరు బ్రాంచీలకు పంపుతున్న సంస్థలే ఎక్కువ.
 
 డిగ్రీ ఉద్యోగులకు కొలువులు: అనిశ్చితిని అడ్డు పెట్టుకుని సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా బీఎస్సీ కంప్యూటర్స్ వంటి డిగ్రీ కోర్సులు చేసిన వారిని అత్తెసరు వేతనాలకు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. మాదాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న అమెరికా బేస్‌డ్ కంపెనీ ఐటీసీ ఇన్ఫోటెక్ ఇటీవల ఏకంగా 100 మంది డిగ్రీ విద్యార్థులను నియమించుకోవడం విశేషం. పైగా మరో 3,000 వేల మందిని కూడా తీసుకునేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వీరిని కూడా ఇతర రాష్ట్రాల్లోని బ్రాంచ్‌లకు పంపుతామని కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ సుదేశ్ సుబ్రహ్మణ్యం తెలిపారు.
 
 ప్రాజెక్టుల్లేవ్
 ప్రాజెక్టులు రాక సాఫ్ట్‌వేర్ సంస్థలు డీలా పడ్డాయి. రిక్రూట్‌మెంట్లను పక్కన పెట్టాయి. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారిలో గందరగోళం రేపుతోంది. బీపీఓల్లో చేరేందుకు కూడా సిద్ధపడుతున్నారు.
 - గంగాధర్,  డెరైక్టర్, పీర్స్ టెక్నాలజీ, అమీర్‌పేట్
 వేలాడుతున్న కత్తి
 ప్రాజెక్టులు పెద్దగా రావడం లేదు. అందుకే మూడేళ్లుగా చాలా ప్రాజెక్టులు చెన్నై, బెంగళూరులకు తరలిపోయాయి. ఇక్కడ ప్లేస్‌మెంట్స్ కూడా జరగడం లేదు. చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాయి!
 - శ్రీనివాస్, టీమ్ లీడర్, నావియోనిక్స్ టెక్నాలజీస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement