తెలంగాణలో 6, ఏపీలో 4 కాలేజీలకు ఎంసీఐ నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పది ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అనుమతులను నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం ఆరు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా ఎంసీఐకి సిఫార్సు చేశాయి. ఈ మెడికల్ కాలజీల్లో 2016-17 విద్యాసంవత్సరం నుంచి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతించాలని కోరగా ఎంసీఐ అందుకు అంగీకరించలేదు. ఈ కాలేజీల్లో కనీస వసతులు లేనందున అనుమతి నిరాకరిస్తున్నట్లు ఎంసీఐ లిఖిత పూర్వకంగా తెలియజేసింది.
తెలంగాణలోని మెదక్ జిల్లా పటాన్‌చెరులో అల్లేటి ఎడ్యుకేషన్ సొసైటీ కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలో శివారెడ్డిపేటలో కొత్త మెడికల్ కాలేజీకి, సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ మిట్టపల్లిలో మరో మెడికల్ కాలేజీకి, అయ్యన్న ఎడ్యుకేషనల్ సొసైటీ రంగారెడ్డి జిల్లా కనకకామిడిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు, వరంగల్‌లో మరో కొత్త మెడికల్ కాలేజీకి, మెదక్ జిల్లా ములుగు మండలంలో ఆర్.వి.ఎం చారిటబుల్ ట్రస్టు కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎంసీఐ నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నిమ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ కొత్తగా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు, చిత్తూరు జిల్లా రేణిగుంటలో కంచికామకోటి పీఠం మెడికల్ కాలేజీకి, చిత్తూరు జిల్లా శ్రీనివాస ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి, విశాఖపట్నం జిల్లా మర్రివలసలో గాయత్రి విద్యాపరిషత్ ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి ఎంసీఐ ఒప్పుకోలేదు.
అలాగే ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అదనంగా 150 మెడికల్ సీట్లను కోరగా అందుకు నిరాకరించింది. విశాఖలోని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజీలో 150 సీట్లకు, వైఎస్‌ఆర్ కడప జిల్లాలో ఫాతిమా మెడికల్ కాలేజీలో 100 సీట్లకు, హైదరాబాద్‌లోని అపోలో కాలేజీలో 100 సీట్లకు ఈ ఏడాది అడ్మిషన్లు చేయవద్దని కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తగినంతగా లేరనే కారణంతో నాలుగు కొత్త కోర్సుల ప్రారంభానికి కూడా ఎంసీఐ అంగీకారం తెలుపలేదు.
పది మెడికల్ కాలేజీల అనుమతికి నో!
Published Sun, Jun 12 2016 2:35 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement
Advertisement