దేవునికి హారతిచ్చేవారేరీ?
ఆలయాల్లో నిలిచిపోయిన ఆర్జిత సేవలు
* రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో మొదలైన సమ్మె
* హామీ ఇచ్చేదాక విరమించేది లేదని జేఏసీ స్పష్టీకరణ
* కావాలనే కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపణలు
* భద్రాద్రి, యాదాద్రి, వేములవాడ ఆలయాలకు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరుతూ దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులు, ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరగలేదు.
ఉదయం, సాయంత్రం పూట జరపాల్సిన నిత్య పూజలతో సరిపుచ్చారు. చివరికి దేవుడికి హారతిచ్చే వారు కూడా లేకపోవటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గత జూన్‌లో సమ్మె చేసిన సమయంలో అర్చకులు, ఆలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ల పరిశీలనకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. నెలరోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకూ ఇవ్వకపోవడంతో అర్చకులు, ఉద్యోగుల జేఏసీ మళ్లీ సమ్మెకు పిలుపునిచ్చింది.
ఈసారి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ నేతలు గంగు భానుమూర్తి, రంగారెడ్డి తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగానే ఉన్నప్పటికీ కొందరు అడ్డుతగులుతున్నారని మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. కమిటీ నివేదిక అందించేందుకు వివరాలు ఇవ్వడంలో దేవాదాయ శాఖలోని కొందరు అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ సంఘీభావం..
మంగళవారం చిక్కడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఎల్‌బీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నుంచి కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్‌జీఆర్‌ఐ సమీపంలోని హనుమదాలయం వద్ద వంటావార్పు నిర్వహించారు. భద్రాద్రి, యాదాద్రి, వేములవాడ ఆలయాలను సమ్మె నుంచి మినహాయించారు. సికింద్రాబాద్ గణేశ్ దేవాలయం, ఉజ్జయిని మహంకాళి ఆలయం, బాసర సరస్వతీ దేవి ఆలయం తదితర పెద్ద దేవాలయాల్లో పూజారులు ఆర్జిత సేవలు నిర్వహించి సమ్మెకు సంఘీభావం తెలిపారు.
కాగా, సమ్మెలో పాల్గొనే అర్చకులు, ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తామని దేవాదాయ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారని జేఏసీ నేతలు తెలిపారు. సమ్మెలో పాల్గొనే వారి వివరాలను మధ్యాహ్నం వరకు ప్రధాన కార్యాలయానికి పంపుతామని, అక్కడి నుంచి వారి పేరుతో మెమోలు జారీ అవుతాయని ఈవోలు బెదిరిస్తున్నారని ఆరోపించారు.