ఉప్పల్ (హైదరాబాద్) : రోడ్డుమీద ఉమ్మేస్తున్నారా జాగ్రత్త. ఇక నుండి హైదరాబాద్ నగర వ్యాప్తంగా రోడ్లపై ఉమ్మినా, చెత్త వేసినా జరిమానా విధిస్తామని గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆయన మంగళవారం పర్యటించారు. గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే భాగంలో చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
వంద రోజుల కార్యక్రమంలో భాగంగా నగరంలోని చాలావరకు చెత్త ఓపెన్ పాయింట్లు దాదాపు తొలగించినట్లు తెలిపారు. వంద రోజులు ముగిసేనాటికి రోడ్లపై ఎక్కడా ఓపెన్ చెత్త కనబడకుండా చేస్తామన్నారు. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మేసినా మూత్ర విసర్జన చేసినా, గోడలపై రాసినా, ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు కట్టినా జరిమానా విధిస్తామని తెలిపారు.
చిన్నరావులపల్లిలో ఏర్పాటు చేయనున్న.. చెత్త నుండి విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రతి కార్మికుడు ఇంటింటికి వెళ్లి తడి,పొడి చెత్తపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. విద్యార్థులను సైతం ఇన్‌వాల్వ్ చేయనున్నట్లు తెలిపారు.
తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించేందుకు, ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు పరచడం తదితర అంశాలలో వచ్చే నెల 2వ తేదీన ఎస్‌ఎఫ్‌ఏలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉత్తమ సేవలందించిన పారిశుద్ద్య కార్మికులకు, అధికారులకు, గుర్తింపునిచ్చే విధంగా పూలదండలు వేసి సన్మానం చేస్తామని తెలిపారు.
ఉప్పల్ సర్కిల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్, డీసీ విజయకృష్ణ, ఈఈ నాగేందర్‌లతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఉప్పల్ కూరగాయల మార్కెట్, మండే మార్కెట్‌లలోని మోడల్ మార్కెట్‌ల భవనాన్ని పరిశీలించారు. సర్కిల్ కార్యాలయం ఆవరణలోని షటిల్ కోర్టును, ఉప్పల్ బస్ బే, సిటీజన్ సెంటర్, బిల్ కలెక్టర్లు పనిచేసే విధానం తదితర అంశాలను పరిశీలించారు. ఉద్యోగులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సిటిజన్ సర్వీస్ సెంటర్ తనిఖీ..
ఎర్లీబర్డ్ ఆఫర్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలోని సిటిజన్ సర్వీస్ సెంటర్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి తనిఖీ చేశారు. ఏరియాలకు సంబంధించిన బిల్ కలెక్టర్లను ఆస్తి పన్ను చెల్లింపు అంశాలపై ఆరా తీశారు. అవసరమైతే అదనపు కౌంటర్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
రోడ్లపై ఉమ్మినా, చెత్త వేసినా జరిమానా
Published Tue, Apr 26 2016 8:09 PM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement
Advertisement