ఇక ‘మన కూరగాయలు’
హైదరాబాద్ చుట్టూ ప్రయోగాత్మకంగా 10 క్లస్టర్లలో పెంచడానికి ప్రణాళికలు
రెండు వేల హెక్టార్లలో సాగు
పదిరోజుల్లో పనులు ప్రారంభం
మార్కెటింగ్ భారం ప్రభుత్వానిదే
శివార్లలోని నాలుగు జిల్లాలు ఎంపిక
హైదరాబాద్: హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న నాలుగు జిల్లాల్లో పది క్లస్టర్లను ఎంపిక చేసి రెండువేల హెక్టార్లలో కూరగాయలు పండించే విధంగా ైరె తులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా ఈ కూరగాయలు పండించే పథకాన్ని పదిరోజుల్లో ప్రారంభించనున్నారు. అన్‌సీజన్‌లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున, ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం రైతుల్లో చైతన్యం తేవడం ద్వారా కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. రైతులు పండించే కూరగాయలను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసి..వాటిని మార్కెట్‌కు పంపించేలా ప్రణాళికను రూపొందించారు.
రైతులు పండించే పంటలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతోపాటు, సాగుకు అవసరమయ్యే పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో సరఫరా చేయనున్నట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగా ప్రభుత్వం చూస్తుందని, వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆ అధికారి పేర్కొన్నారు. ‘మన కూరగాయలు’ పేరుతో వాటిని విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.