'రమ్యకృష్ణ అంత పిరికిది కాదు'
హైదరాబాద్ : చనిపోయిందన్న గంట ముందే తన కుమార్తె ఫోన్లో మాట్లాడిందని ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రమ్యకృష్ణ తల్లి ఉషారాణి తెలిపారు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన రమ్యకృష్ణ అనే యువతి వారం క్రితం ఆస్ట్రేలియాలో వారం క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకు వచ్చారు. కాగా రమ్యకృష్ణకు నాలుగేళ్ల క్రితం మెల్బోర్న్కు చెందిన మహంత్తో వివాహం జరిగింది. కుమార్తె మృతిపై రమ్యకృష్ణ తల్లి మాట్లాడుతూ 'నాతో మాట్లాడిన తర్వాత మళ్లీ కాల్ వచ్చింది. (చదవండి..ఆస్ట్రేలియాలో ఎన్నారై యువతి అనుమానస్పద మృతి)
ఆ రెండు గంటల్లో ఏమి జరిగిందో ఏమో చనిపోయిందని ఫోన్ వచ్చింది. అది కూడా మహంత్ చెప్పలేదు. అతడి కంపెనీలో చేసే అబ్బాయి సమాచారం ఇచ్చాడు. మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. చాలా ధైర్యవంతురాలు, కష్టాలకు అధైర్యపడదు. కొద్దిరోజుల క్రితం కారు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కూడా చాలా ధైర్యంగా ఉంది. నా కూతురిది ఆత్మహత్య కాదు, హత్యే. అందుకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలి. నా కూతురును అత్తమామలు సూటిపోటీ మాటలతో వేధించేవారు. ఎన్నోసార్లు నాతో చెప్పుకుని బాధపడింది. పరోక్షంగా కారకులైన అత్తమామలపై కూడా చర్యలు తీసుకోవాలి.' అని డిమాండ్ చేశారు.
తమ కుమార్తె మృతదేహం ఇచ్చేంతవరకూ మమ్మల్ని మహంత్ తన చెప్పుచేతల్లో ఉంచుకున్నాడని రమ్యకృష్ణ తండ్రి పూర్ణచంద్రరావు అన్నారు. నా కూతురు ఉరేసుకున్నందన్న దానికి ఆధారం లేదు. మహంత్ పొంతన లేని సమాధానం చెబుతున్నాడని ఆస్ట్రేలియా పోలీసులే అన్నారని ఆయన తెలిపారు. మహంత్తో పాటు అతడి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని మహంత్ తండ్రి సుబ్రహ్మణ్యం అన్నారు. తాను 15 రోజులపాటు ఆస్ట్రేలియాలోనే ఉన్నానని, భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. కాగా రమ్యకృష్ణ మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం మహంత్ తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.